ETV Bharat / bharat

గత దశాబ్ద కాలంలో భారతీయ రైల్వేలో చారిత్రక మార్పులు: ప్రధాని మోదీ

2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్​ కోసం ప్రతీ భారతీయుడు ప్రేరణ: ప్రధాని మోదీ

PM Modi Tamil nadu Visit
PM Modi Tamil nadu Visit (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : March 1, 2026 at 4:25 PM IST

3 Min Read
Choose ETV Bharat

PM Modi Tamil nadu Visit : తమిళనాడు అభివృద్ధికి ఉమ్మడి లక్ష్యంతో కలిసి పనిచేద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్న డీఎంకే ఆరోపణలను ఖండించారు. గత దశాబ్ద కాలంలో మౌలిక సదుపాయల కల్పనకు కేటాయించిన నిధులను సుమారు మూడు రెట్లు పెంచామని తెలిపారు. తమిళనాడు మదురైలో చేపట్టిన రూ. 4వేల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.

"గత దశాబ్ద కాలంలో భారతీయ రైల్వేలో చారిత్రక మార్పులు జరిగాయి. భారత రైల్వే ఆధునీకరణతో పాటు ప్రజల కేంద్రంగా సరికొత్త రవాణ వ్యవస్థగా మారుతోంది. తమిళనాడును గమనిస్తేనే ఈ మార్పు కనిపిస్తుంది. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమిళనాడుకు రైల్వే బడ్జెట్​ను తొమ్మిది రెట్లు పెంచాం. 2009 నుంచి 2014 మధ్య తమిళనాడుకు రూ. 880 కోట్లు కేటాయించగా, ఒక్క 2026-27 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 7,600 కోట్లు కేటాయించాం. దాదాపు 1300 కిలోమీటర్ల దూరం కొత్త రైల్వే ట్రాక్​లు వేశాం. 97 శాతం విద్యుద్దీకరణ పూర్తి చేశాం. ఇంకా అనేక అండర్​ పాస్​లు, ఫ్లై ఓవర్లు నిర్మించాం. గతేడాది కొత్త పాంబన్​ వంతెనను నేనే ప్రారంభించాను. ఇది భారత్​లోనే తొలి వర్టికల్​ లిఫ్ట్​ సీ బ్రిడ్జ్​. ఇప్పుడు ఈ వంతెన కూడా తమిళనాడులో ఒక పర్యాటక ప్రాంతంగా మారిపోయింది."

--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

తమిళనాడుకు బుల్లెట్ ట్రైన్​ కారిడార్లు
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్​ కోసం ప్రతీ భారతీయుడు ప్రేరణ పొందాడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత లక్ష్యాన్ని నెరవేర్చడంలో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. 2026 బడ్జెట్​లో బెంగళూరు- చెన్నై, చెన్నై- హైదరాబాద్​ బుల్లెట్ ట్రైన్​ కారిడార్లు ప్రకటించామని గుర్తు చేశారు. ఇవి ఈ ప్రాంతంలో ఆర్థికంగా విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందని అభిప్రాయపడ్డారు. 2014 నుంచి ఇప్పటి వరకు తమిళనాడులో 4,000కు పైగా జాతీయ రహదారులను నిర్మించామని గుర్తు చేశారు.

గత దశాబ్ద కాలంలో మౌలిక సదుపాయల కల్పనకు కేటాయించిన నిధులను సుమారు మూడు రెట్లు పెంచాం. 2026 బడ్జెట్​లో కూడా తమిళనాడు అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాం. అందులో భాగంగా బెంగళూరు- చెన్నై, చెన్నై- హైదరాబాద్ మధ్య హై స్పీడ్​ బుల్లెట్ ట్రైన్​ కారిడార్లను ప్రకటించాం. గత 12 ఏళ్లలో తమిళనాడులో జాతీయ రహదారుల అభివృద్ధికి భారత ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 4,000 కిలోమీటర్లుకు పైగా కొత్త జాతీయ రహదారులను వేసింది. ఈరోజు ఇంకో రెండు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసుకున్నాం. ఫలితంగా తమిళనాడుకు వచ్చే భక్తుల రవాణాతో పాటు వ్యవసాయ, ఇతర ఉత్పత్తులకు సరఫరా సులభతరం అవుతుంది.

--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఇప్పుడు తమిళనాడులో 9 వందే భారత్​ ట్రైన్​లు, 9 అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇందులో వినియోగించే కోచ్​లు తమిళనాడులో ఇంటిగ్రేటేడ్ కోచ్ ఫ్యాక్టరీలోనే తయారవుతున్నాయని తెలిపారు. అనంతరం అరులిమగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ఆయనతో పాటు గవర్నర్ ఆర్ఎన్ రవి, కేంద్ర మంత్రి ఎల్ మురుగణ్​, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్​ ఉన్నారు. గతేడాది ఆలయ కొండ శిఖరంపై జ్యోతి వెలిగించడం విషయంలో తీవ్ర వివాదం నెలకొనగా, కోర్టు భక్తులకు అనకూలంగా తీర్పునివ్వగా తాజాగా ప్రధాని మోదీ ఆలయాన్ని సందర్శించారు.