ETV Bharat / bharat

'మార్చ్‌ ఫర్‌ డెమోక్రసీ, మార్చ్‌ ఫర్‌ జస్టిస్‌'- చలో దిల్లీకి రాహుల్ గాంధీ పిలుపు

ఇండియా కూటమి ఎంపీలు సోమవారం సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది క్రమంగా స్వచ్ఛంద ఉద్యమంగా మారుతోందని కాంగ్రెస్ ఎంపీలు పేర్కొన్నారు.

India Bloc on Delhi Protest
ప్రతిపక్షాల నిరసన ర్యాలీ నేపథ్యంలో దిల్లీలో భారీ భద్రత (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : October 12, 2026 at 11:11 AM IST

3 Min Read
Choose ETV Bharat

India Bloc on Delhi Protest : సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా దిల్లీలో నిరసనలకు ఇండియా కూటమి సిద్ధమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం పనితీరుకు వ్యతిరేకంగా సోమవారం మధ్యాహ్నం కన్నాట్ ప్లేస్ నుంచి సుప్రీంకోర్టు వరకు సాగే 'చలో దిల్లీ' నిరసన యాత్రకు తరలిరావాలని పిలుపునిచ్చారు. 'ప్రజాస్వామ్యం కోసం యాత్ర. న్యాయం కోసం యాత్ర. చలో దిల్లీ' అని రాహుల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌'లో పోస్ట్ పెట్టారు.

ప్రజలు తమంతట తామే రోడ్లపైకి వస్తున్నారు : కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్
ఎన్నికల అక్రమాల ఆరోపణలపై వినతిపత్రం సమర్పించేందుకు తనను కలవాలన్న ఇండియా కూటమి నిర్ణయాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తిరస్కరించడంపై కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ స్పందించారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో చేరుతున్నారని పేర్కొన్నారు. తాము నిరసన చేపట్టాలని ముందుగానే నిర్ణయించామని అన్నారు. పార్టీ ఇచ్చే ఎలాంటి ఆదేశాలనైనా ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటిస్తారని తెలిపారు. అయితే ప్రజలు తమంతట తామే రోడ్లపైకి వస్తున్నారని, దేశవ్యాప్తంగా ప్రతి చోటా ఇదొక స్వచ్ఛంద ఉద్యమంగా మారుతోందని వెల్లడించారు.

'దిల్లీ పోలీసులు సుప్రీం తీర్పును విస్మరిస్తున్నారు'
ఇండియా కూటమి సుప్రీంకోర్టు వరకు చేపట్టబోయే మార్చ్‌పై కాంగ్రెస్ ఎంపీ జేబీ మాథుర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. "మేము ఒక రాజకీయ పార్టీగానో, వ్యక్తులుగానో, పురుషులుగానో, మహిళలుగానో లేదా ఏ రాష్ట్రం, కులం, మతం, వర్గానికి చెందినవారిగానో కాకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని విశ్వసించే పౌరులుగా సుప్రీంకోర్టు వరకు పాదయాత్ర చేస్తాం. రాహుల్ గాంధీ, ఇండియా బ్లాక్ నాయకులు, ప్రజలు ఈ మార్చ్‌లో పాల్గొంటారు. దిల్లీ మునుపెన్నడూ చూడని స్థాయిలో ఈ నిరసన జరుగుతుంది. హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోని పోలీసులు సుప్రీంకోర్టు తీర్పును విస్మరిస్తున్నారు. మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నారు. రోడ్డు మార్గాలను బ్లాక్ చేస్తున్నారు. దిల్లీ వ్యాప్తంగా భారీ సంఖ్యలో పోలీస్, సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించడం ద్వారా నిరసనలకు వచ్చే ప్రజలను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ మేము (ఇండియా కూటమి) వెనకడుగు వేయం. " అని జేబీ మాథుర్ పేర్కొన్నారు.

బీజేపీ పార్టీ జెన్‌జీకి వ్యతిరేకం : గడ్డం వంశీకృష్ణ
బీజేపీ దేశంలోని యువతకు, జెన్‌జీకి వ్యతిరేకమని కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. కమలం పార్టీ తొలిసారి ఓటు వేసేవారి ఓట్లను పొందలేకపోతోందని, అందుకే ఫారం- 6ను ప్రవేశపెట్టిందని విమర్శించారు. కొత్త ఓటర్ల పేర్లను తొలగించడానికి ఎస్ఐఆర్ (SIR)ను తీసుకొచ్చిందని మండిపడ్డారు. తాము ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టం చేశారు.

రాజ్యాంగ సంస్థలను రాజకీయాల్లోకి లాగలేరు : రాహుల్‌కు బీజేపీ కౌంటర్
ఎన్నికల అక్రమాల ఆరోపణలపై వినతిపత్రం సమర్పించేందుకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌తో సమావేశం కోసం రాహుల్ గాంధీ చేసిన అభ్యర్థనపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్, ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. న్యాయవ్యవస్థ రోజువారీ రాజకీయ పోరాటాలకు అతీతంగా ఉండాలని పేర్కొంది. రాజ్యాంగ సంస్థలను రాజకీయ నాటకాల్లోకి లాగలేరని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

"అధికారాల విభజన నుంచి అధికారం కోసం ఆరాటం వరకు రాహుల్ గాంధీ రాజ్యాంగ సంస్థల్ని రాజకీయ నాటకంతో గందరగోళానికి గురిచేశారు!. రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నాయకులను కలవడానికి సీజేఐ నిరాకరించడం దేశ ప్రజలకు ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపుతోంది. న్యాయవ్యవస్థ రోజువారీ రాజకీయ పోరాటాలకు అతీతంగా ఉండాలి. రాజ్యాంగ సంస్థలను రాజకీయ నాటకాల్లోకి లాగలేరు. కేవలం రాజ్యాంగం ప్రతిని వెంట ఉంచుకున్నంత మాత్రాన అది మీకు (రాహుల్‌ను ఉద్దేశించి) అర్థమైనట్లు కాదు. దాన్ని చదవండి, గౌరవించండి. అధికారాల విభజన సిద్ధాంతాన్ని నేర్చుకోండి. రాజ్యాంగం పరిపాలనకు మార్గదర్శి. అంతేగాని రాజకీయ ప్రదర్శనకు ఆధారం కాదు." అని గౌరవ్ భాటియా స్పష్టం చేశారు.