మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఇక మూడే మిగిలాయ్: కేంద్ర హోంశాఖ
మావోయిస్టులపై కేంద్రం ఉక్కుపాదం- క్రమంగా దిగివస్తున్న మావోయిస్టులు

Published : October 15, 2025 at 7:05 PM IST
MHA Statement About Naxalism : మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్ర హోంమంత్రిత్వశాఖ తాజా కీలక వ్యాఖ్యలు చేసింది. మావోయిస్టు ప్రభావిత జిల్లాలు మూడు మాత్రమే ఉన్నాయని బుధవారం తెలిపింది. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, నారాయణ్‌పూర్ జిల్లాల్లో మాత్రమే వామపక్ష తీవ్రవాదం (ఎల్‌డబ్ల్యూఈ) ప్రభావం ఉందని హోంశాఖ పేర్కొంది.
"మావోయిస్ట్ రహిత భారత్‌ను నిర్మించాలనే మోదీ ప్రభుత్వ దార్శనికతకు గొప్ప ముందడుగు పడింది. మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య ఇప్పుడు 6 నుంచి 3కు తగ్గింది." - కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటన
అంతం చేస్తాం!
మావోయిస్టులతో చర్చలు ఉండవని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇప్పటికే తేల్చిచెప్పారు. కనుక మావోయిస్టులు లొంగిపోవాలని సూచించారు. లేకుంటే 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఘాటుగా హెచ్చరించారు. దీనితో పోలీసులు మావోయిస్టుల ఏరివేత కొనసాగించారు.
"ఈ ఏడాది రికార్డు స్థాయిలో 312 ఎల్‌డబ్ల్యూఈ సభ్యులను అంతం చేశాం. అందులో సీపీఐ (మావోయిస్టు) జనరల్ సెక్ట్రటరీ సహా 8 మంది ఇతర పొలిట్ బ్యూరో/ కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. మరోవైపు 836 మంది ఎల్‌డబ్ల్యూఈ సభ్యులను అరెస్టు చేశాం" అని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది.
క్రమంగా లొంగిపోతున్న మావోయిస్టులు
ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లోని మావోయిస్టులు క్రమంగా, పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, కాంకేర్ జిల్లాల్లో 77 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 42 మంది మహిళా కేడర్, ఇద్దరు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ఉన్నారని అధికారులు తెలిపారు. సుక్మా జిల్లాలో లొంగిపోయిన 27 నక్సల్స్‌పై రూ.50లక్షల రివార్డు ఉండడం గమనార్హం. ఇప్పటి వరకు 1,639 మంది లొంగిపోయి ప్రధాన జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు, ఒక కేంద్ర కమిటీ సభ్యుడు కూడా ఉండడం గమనార్హం.
మవోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ
ఇక మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మంగళవారం సీనియర్ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ రావు ఆలియాస్ భూపతితో పాటు 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తమ వద్ద ఉన్న ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇది మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బేనని చెప్పవచ్చు. వాస్తవానికి మల్లోజుల వేణుగోపాల్‌రావు సొంత రాష్ట్రం తెలంగాణ. పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య, మధురమ్మ దంపతులకు ఈయన మూడో సంతానం. తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే వేణుగోపాల్, ఆయన రెండో అన్న కోటేశ్వరరావు స్ఫూర్తి పొందారు. చదువు పూర్తయిన అనంతరం తన అన్న పిలుపు మేరకు ఉద్యమంలో చేరారు. పార్టీలో ఆయనను అభయ్, సోను, భూపతి, వివేక్ పేర్లతో పిలిచేవారు. మల్లోజులపై రూ.6 కోట్ల రివార్డు ఉన్నట్లు గడ్చిరోలి పోలీసులు వెల్లడించారు. మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల వేణుగోపాల్ బహిరంగ లేఖలు రాస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమని పేర్కొంటూ అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్‌బ్యూరో నుంచి బయటకు వచ్చారు. తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడిన ఆయనపై వందకు పైగా కేసులు ఉన్నాయి.
2013 నాటికి మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు 126 ఉండేవి. కానీ 2025 మార్చి నాటికి ఈ సంఖ్య 18 జిల్లాలకు తగ్గిపోయింది. తాజా ఈ మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 3కి పడిపోయింది' అని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది.
2040 నాటికి తొలి మానవసహిత జాబిల్లి యాత్ర : ఇస్రో చైర్మన్
EPFO నిబంధనల మార్పుపై కాంగ్రెస్ ఫైర్- మోదీ సర్కార్ ఉద్యోగులను శిక్షిస్తోందని ఆరోపణ

