100 సీసీ బైక్‌పై సోదరుల సాహస యాత్ర- గ్వాలియర్ నుంచి హిమాలయాల వరకు- డెడ్ చీప్‌గా టూర్స్!
100 సీసీ బైక్‌పైనా సుదూర సాహస యాత్రలు- గ్వాలియర్ నుంచి మనాలీ, నేపాల్, ఆది కైలాశ్, లడఖ్‌లకు యాత్రలు- గౌరవ్, రోహిత్ బ్రదర్స్ సంకల్ప శక్తికి వరుస విజయాలు

Published : November 9, 2025 at 6:56 PM IST
Adventrue Trips On 100cc Bike : సాహస యాత్ర చేయాలంటే అడ్వెంచర్ బైక్ ఉండాల్సిందే అని భావించే వాళ్లు గౌరవ్ మహోర్, రోహిత్ మహోర్ గురించి తెలుసుకోవాలి. వరుసకు సోదరులయ్యే ఈ ఇద్దరు యువతేజాలు సాహస యాత్రకు కొత్త నిర్వచనం ఇచ్చారు. సాహసం ఉంటే హార్స్ పవర్ తక్కువ ఉన్న బైక్‌తోనూ సాహస యాత్ర చేయొచ్చని నిరూపించారు. వారిద్దరు కలిసి ఓ సాధారణ 100 సీసీ బైక్‌పై మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నుంచి మనాలీ(హిమాచల్ ప్రదేశ్), లద్ధాఖ్, ఆది కైలాశ్(ఉత్తరాఖండ్), నేపాల్‌లకు వెళ్లొచ్చారు. బైక్ కంటే మనిషిలోని సంకల్పానికే ఎక్కువ పవర్ ఉంటుందని రుజువు చేసిన మహోర్ సోదరులపై కథనమిది.
సాహస యాత్ర అలా మొదలైంది
గౌరవ్ మహోర్ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక చిన్న జనరల్ స్టోర్ నడుపుతున్నారు. రోహిత్ మహోర్ అదే పట్టణంలోని ఓ ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మొదటి నుంచీ వాళ్లిద్దరికి సాహస యాత్రలు అంటే చాలా ఆసక్తి. కానీ చేతిలో అడ్వెంచర్ బైక్ లేదు. భారీ ధర పెట్టి దాన్ని కొనడం కూడా అంత ఈజీ కాదు. అందుకే రెండేళ్ల క్రితం (2023లో) గౌరవ్, రోహిత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ దగ్గరున్న 100 సీసీ బైక్‌పైనే హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీ సాహస యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పంక్చర్ కిట్లు, అదనపు ట్యూబ్‌లు, దుస్తులతో బ్యాగ్‌ను రెడీ చేసుకున్నారు. ఇద్దరూ హెల్మెట్లు ధరించి మనాలీకి బయలుదేరారు. మార్గం మధ్యలో బైక్ టైర్లు పంక్చర్ అయ్యాయి. ఎక్కువ గంటల పాటు డ్రైవింగ్ చేయాల్సి వచ్చింది. అయినా గౌరవ్, రోహిత్ అలసిపోలేదు. తమ లక్ష్యాన్ని వదల్లేదు. రాతి రోడ్లు, కఠినమైన వాతావరణాన్ని దాటుకుంటూ వెళ్లి 837 కి.మీ తొలి సాహస యాత్రను ఆనాడు విజయవంతంగా పూర్తి చేశారు. 100 సీసీ బైక్‌తోనూ కఠినమైన మార్గాల్లో సాహస యాత్రలు చేయొచ్చని చాటి చెప్పారు.

2,700 కి.మీ యాత్ర : గ్వాలియర్ టు నేపాల్
2023 సంవత్సరంలోనే మరో సాహస యాత్రకు గౌరవ్, రోహిత్ సోదరులు ప్లాన్ చేశారు. నేపాల్‌లోని పవిత్ర ముక్తినాథ్ ఆలయం దాకా తమ 100 సీసీ బైక్‌పై వెళ్లి రావాలని సంకల్పించారు. గ్వాలియర్ నుంచి 2,700 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది. ఇద్దరూ కలిసి బైక్‌పై బయలుదేరారు. ముక్తినాథ్ ఆలయాన్ని దర్శించుకొని తమ సంకల్పాన్ని సాకారం చేసుకున్నారు.

1500 కి.మీ యాత్ర : గ్వాలియర్ టు లడఖ్
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డు మార్గం మన దేశంలోని లద్ధాఖ్ ప్రాంతంలో ఉంది. దానిపై జర్నీ చేయాలని 2024లో గౌరవ్, రోహిత్ భావించారు. అనుకున్నదే తడవుగా గ్వాలియర్ నుంచి బయలుదేరారు. తమ 100 సీసీ బైక్‌పై లద్ధాఖ్లోని 'ఉమ్లింగ్ లా పాస్' పర్వత రహదారిపైకి చేరుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డు మార్గం అదే. ఆ రోడ్డు 19,024 అడుగుల ఎత్తులో ఉంది. అంతటి ఎత్తులో నిటారుగా ఉన్న పర్వత రహదారిపైకి 100 సీసీ బైక్‌పై వెళ్లడం అంటే ఆషామాషీ విషయం కాదు. డ్రైవింగ్‌లో నిబద్ధత, అలసిపోకుండా ముందుకుసాగే పట్టుదల ఉంటేనే ఆ తరహా జర్నీ చేయడం సాధ్యం. చిన్న బైక్‌ల టైర్ల వెడల్పు చాలా తక్కువ. దీంతో ఇలాంటి కఠినతర రోడ్లపై అవి పట్టును కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంత కఠినమైన 1500 కి.మీ సుదీర్ఘ ప్రయాణాన్ని కూడా గౌరవ్, రోహిత్‌లు సులువుగా పూర్తిచేశారు. చిన్న బైక్‌పైనా కఠిమైన ఐకానిక్ ప్రదేశాలకు చేరుకోవచ్చని రుజువు చేశారు.

2,500 కి.మీ యాత్ర : గ్వాలియర్ టు ఆది కైలాశ్
ఈ ఏడాది (2025) ఆరంభంలోనే గౌరవ్, రోహిత్‌లు ఉత్తరాఖండ్‌లోని ఆది కైలాశ్, ఓం పర్వతాల సాహస యాత్రను చేశారు. 2,500 కి.మీ ఈ యాత్రను 9 రోజుల్లో పూర్తి చేశారు. టెలికాం నెట్‌వర్క్ లేని నిర్మానుష్య ప్రాంతాలు, అడవులు, రాతిగుట్టలు, కొండల మార్గాలను దాటుకుంటూ ఆది కైలాశ్, ఓం పర్వతాలను దర్శించుకున్నారు. 14,700 అడుగుల ఎత్తులోని ఆది కైలాశ్‌ను ఈ సోదరులు అధిరోహించారు. అక్కడి నుంచి గ్వాలియర్‌కు తిరిగి వచ్చేటప్పుడు, ఉత్తరాఖండ్‌లోనే ఉన్న బద్రీనాథ్, రిషికేశ్, హరిద్వార్‌లను దర్శించుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతోనే సాహస యాత్రలు
ఇతర యాత్రికులకు సాహసయాత్ర అంటే ఖర్చుతో కూడుకున్న విలాసవంతమైన వ్యవహారం. కానీ గౌరవ్, రోహిత్ సోదరులకు అది సింపుల్ జర్నీయే. ఎందుకంటే వారి జర్నీలో పెద్దగా ఖర్చులు కావు. విలాసాలకు తావు ఉండదు. మార్గం మధ్యలో రోడ్ల పక్కన గుడారాలు వేసుకొని విశ్రాంతి తీసుకుంటారు. పలుచోట్ల స్థానికుల ఇళ్లలోనే ఒక గదిని నామమాత్రపు అద్దెకు తీసుకునేవారు. దీనివల్ల యాత్ర ఖర్చులు పెద్దగా ఉండవు. అందుకే గ్వాలియర్ -మనాలీ ట్రిప్‌నకు రూ.10,000 మాత్రమే ఖర్చయ్యాయి.గ్వాలియర్ - లద్ధాఖ్ రైడ్‌కు రూ.15వేలు ఖర్చయ్యాయి. 100సీసీ బైక్ గొప్ప మైలేజీని ఇవ్వడంతో ప్రయాణ ఖర్చు ఇంతగా తగ్గిపోయింది. గౌరవ్, రోహిత్ సోదరుల తదుపరి లక్ష్యం లద్ధాఖ్‌లో 19,400 అడుగుల ఎత్తులో ఉన్న మిగ్ లా పాస్. తప్పకుండా ఆ యాత్రను కూడా విజయవంతం చేస్తామని వారు అంటున్నారు.

మా తదుపరి లక్ష్యం మిగ్ లా పాస్ : రోహిత్
"మా తదుపరి లక్ష్యం మిగ్ లా పాస్. అది లద్ధాఖ్ ప్రాంతంలో 19,400 అడుగుల ఎత్తులో ఉంది. మేం 100 సీసీ బైక్‌పై దాన్ని ఎక్కగలమా? లేదా? అనేది తర్వాతి విషయం. ప్రయత్నమైతే చేసి చూస్తాం. ప్రతీ రైడ్ మాకు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. మేం మరిన్ని పాఠాలు నేర్చుకునేందుకు రెడీగానే ఉన్నాం. ఇప్పటివరకు మేం 100 సీసీ బైక్‌పై చేసిన యాత్రల్లో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతీ మలుపు ప్రమాదకరంగా అనిపించింది. ఒక్క తప్పటడుగు వేసినా ప్రమాదం చుట్టుముట్టేది. కానీ హిమాలయాలను దగ్గరగా చూసిన తర్వాత మాకు భయం దూరమైంది. అవి శాంతిని, ప్రశాంతతను అందించాయి" అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

శాంతిని వెతుక్కుంటూ యాత్రకు వెళ్తాం : గౌరవ్
"నిజం చెప్పాలంటే, మా సాహస యాత్రల వెనుక ఎటువంటి గొప్ప ఉద్దేశాలు లేవు. మేం శాంతిని వెతుక్కుంటూ యాత్రకు వెళ్తాం. బైక్‌పై వెళ్లే క్రమంలో మేం ఎక్కడైనా ఆగి గాలిని పీల్చుకోవచ్చు. అందమైన ప్రపంచాన్ని చూడొచ్చు. అయితే కొండ ప్రాంతాల్లో జర్నీ చేసే క్రమంలో భద్రతకు 100 శాతం ప్రయారిటీ ఇస్తాం. పర్వత రోడ్లు నిటారుగా ఉంటాయి. వాటిపై జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తాం. మేం అనవసరంగా ఎప్పుడూ హారన్ మోగించలేదు. రాత్రిపూట డిప్పర్ లైట్‌ను ఉపయోగించాం" అని గౌరవ్ వివరించారు.

పాక్‌కు అర్థమయ్యే భాషలోనే భారత్ సమాధానం చెప్పాలి: మోహన్ భాగవత్
భారతీయ మల్లయోధుడి డాక్యుమెంటరీ- అమెరికాలో విశేష ప్రేక్షకాదరణ- ఇంతకీ ఎవరీ బాడీ బిల్డర్?

