ఇళ్లంతా నోట్ల కట్టలే! ప్రభుత్వ అధికారి ఇంట్లో రూ.4 కోట్ల నగదు స్వాధీనం- చరిత్రలో ఇదే తొలిసారి!
ఒడిశాలో బయటపడ్డ మరో అధికారి బాగోతం- గనుల శాఖ ఆధికారి ఇంట్లో రూ.4 కోట్ల నగదు స్వాధీనం- దేబబ్రత మహంతిని అరెస్టు చేసిన పోలీసులు- భువనేశ్వర్‌లో రెండంతస్తుల భవనంలో 130 గ్రా.బంగారం గుర్తింపు

Published : February 25, 2026 at 4:20 PM IST
Odisha Vigilance Raid : ఒడిశాలో ఓ చిన్న లంచం కేసు దర్యాప్తు భారీ అవినీతి కుంభకోణాన్ని బయటపెట్టింది. రూ.30 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారి ఇంట్లో కోట్ల రూపాయల నగదు లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేగింది. విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు పరిమాణం చూసి వారు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.
ఒడిశాలోని కటక్ సర్కిల్ గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దేబబ్రత మహంతి అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యాడు. లైసెన్స్ పొందిన ఓ బొగ్గు వ్యాపారి నుంచి డిపో నిర్వహణ, రవాణా అనుమతుల కోసం రూ.30 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో ఒడిశా విజిలెన్స్ డైరెక్టరేట్ అధికారులు ఉచ్చు వేశారు. మంగళవారం రాత్రి లంచం తీసుకుంటున్న సమయంలోనే ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అరెస్టు అనంతరం కేసు నమోదు చేసి, బుధవారం ఉదయం నుంచి మూడు చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. భువనేశ్వర్‌లోని ఆయన నివాస ఫ్లాట్, భద్రక్ జిల్లాలోని స్వగ్రామ ఇల్లు, అలాగే కటక్‌లోని కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో బయటపడిన నగదు చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు. భువనేశ్వర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ట్రాలీ బ్యాగులు, అల్మారాలు, డ్రాయర్లలో దాచిపెట్టిన నగదును లెక్కించగా రూ.4 కోట్లకు పైగా ఉన్నట్లు గుర్తించారు. లెక్కల్లో చూపించని ఈ మొత్తం నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని విజిలెన్స్ వర్గాలు తెలిపాయి. అదనంగా ఆయన కార్యాలయంలోని టేబుల్ డ్రాయర్‌లో మరో రూ.1.20 లక్షల నగదు కూడా పట్టుబడింది.
ఇదే కాకుండా మహంతికి చెందిన మరిన్ని ఆస్తులు కూడా వెలుగులోకి వచ్చాయి. భువనేశ్వర్ సమీపంలోని పహాలా ప్రాంతంలో సుమారు 2,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రెండంతస్తుల భవనం, దాదాపు 130 గ్రాముల బంగారు ఆభరణాలను అధికారులు గుర్తించారు. ఇవన్నీ ఆయన అధికారిక ఆదాయానికి మించి ఉన్నాయని అనుమానిస్తున్నారు. స్థిర, చరాస్తుల పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. విజిలెన్స్ అధికారులు చెబుతున్న ప్రకారం, ఒడిశా చరిత్రలో ఒకే అధికారి ఇంటి నుంచి ఇంత పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం కావడం ఇదే తొలిసారి. గతంలో కూడా పలువురు అధికారులపై సోదాలు జరిగి కోట్లు బయటపడినప్పటికీ, ఈ స్థాయి నగదు ఎప్పుడూ దొరకలేదని పేర్కొన్నారు.
మహంతి ఉద్యోగ ప్రస్థానం కూడా పరిశీలనలోకి వచ్చింది. 2004లో జూనియర్ మైనింగ్ ఆఫీసర్‌గా ప్రభుత్వ సేవలో చేరిన ఆయన బాలంగీర్, బారిపడ, బెర్హంపూర్, కటక్, భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. తరువాత ప్రమోషన్లు పొందుతూ ఇటీవలే కటక్ సర్కిల్ డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే కొద్ది కాలంలోనే అవినీతి ఆరోపణలతో చిక్కుకోవడం సంచలనంగా మారింది.
భువనేశ్వర్ విజిలెన్స్ విభాగం ఎస్పీ సరోజ్ కుమార్ సామల్ మీడియాతో మాట్లాడుతూ, మహంతిని స్పెషల్ విజిలెన్స్ కోర్టులో హాజరుపరుస్తామని, అతని ఆస్తులపై సమగ్ర విచారణ చేపడతామని తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. రూ.30 వేల లంచం కేసుతో మొదలైన ఈ దర్యాప్తు కోట్ల రూపాయల అక్రమ సంపాదనను బయటపెట్టడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఎంతగా వేర్లు వేసిందనే ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది. విజిలెన్స్ శాఖ చర్యలతో ఇతర అవినీతి అధికారులకు ఇది గట్టి హెచ్చరికగా మారింది.
#WATCH | Following apprehension of Sri Debabrata Mohanty, Deputy Director of Mines, Cuttack Circle, Cuttack, yesterday night for taking a bribe Rs.30,000 from a licensed coal vendor, simultaneous house searches were initiated by Odisha Vigilance at his residential flat, parental… https://t.co/Xh472TSEPy pic.twitter.com/WW6nkw9wyB
— ANI (@ANI) February 25, 2026

