పెరుగుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు- మూడేళ్లలో గర్భవతులైన 2,320 మంది మైనర్లు
సర్కార్ ఎన్ని కట్టడులు చేస్తున్నా- ఆ రాష్ట్రంలో పెరుగుతున్న టీనేజీ ప్రెగ్నెన్సీ కేసులు

Published : December 16, 2025 at 6:39 PM IST
Teenage Pregnancies In Karnataka : తెలిసీ తెలియని వయసులో క్షణికావేశం, అత్యాచారాలు, బాల్య వివాహాలు, ప్రేమ ఇలా మైనర్లు గర్భం (టీనేజ్ ప్రెగ్నెన్సీ) దాల్చడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కొన్ని అశ్లీల సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఫోన్లో అసభ్యతతో కూడిన రీల్స్ చూస్తున్న కొందరు బాలికలు ప్రేమకు ఆకర్షితులవుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది ఆకతాయి యువకులు బాలికలకు ఎర వేస్తున్నారు. ఈ క్రమంలో మైనర్లతో శృంగారంలో పాల్గొన్ని టీనేజ్ ప్రెగ్నెన్సీకి కారణమవుతున్నారు. అయితే భారత్‌లోని ఓ రాష్ట్రంలో ఆందోళనకరమైన స్థాయిలో గత మూడేళ్లలో టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు నమోదయ్యాయి. ఈ స్టోరీలో ఆ రాష్ట్రం ఏది? గత మూడేళ్లలో ఎన్ని టీనెజ్ ప్రెగ్నెన్సీ కేసులు నమోదయ్యాయి? మైనర్లు గర్భం దాల్చడానికి గల కారణాలను తెలుసుకుందాం.
కర్ణాటకలో భారీగా టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు
కర్ణాటకలో టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు అందోళన కలిగిస్తున్నాయి. ప్రేమ కారణంగా లేదా చట్టంపై అవగాహన లేకపోవడం వల్ల ఆ రాష్ట్రంలో మైనర్ బాలికలు గర్భవతులవుతున్న కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత మూడేళ్లలో కన్నటనాట 2,320 మంది బాలికలు గర్భవతులయ్యారు. ఈ ఏడాదిలోనే (అక్టోబర్ వరకు) 749 మంది బాలికలు గర్భం దాల్చారు. తమ మొబైల్ ఫోన్లలో లైంగిక ప్రేరేపణ కలిగించే కొన్ని మూవీస్, రీల్స్ చూసి బాలికలు ప్రేమలో పడిపోతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది యువకులు మైనర్లతో శృంగారం చేసి కౌమార గర్భాలకు కారణమవుతున్నారు.
పోక్సోతో ప్రయోజనం అంతంతమాత్రమే!
మైనర్లతో శృంగారం, వారిపై అత్యాచారం పాల్పడిన వారిపై పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ ఫలితం అంతగా ఉండట్లేదు. ఎందుకంటే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల బాధితురాలి కుటుంబం సమాజంలో తమ గౌరవానికి భంగం కలుగుతుందనే భయంతో ప్రాథమిక దశలోనే రాజీకి వచ్చేస్తున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల భయం నిందితులు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. గత మూడేళ్లలో మైనర్ బాలికల గర్భాలకు సంబంధించి రాష్ట్ర బాలల సంక్షేమ కమిటీలో 2,320 కేసులు నమోదయ్యాయి.
సర్కార్ కీలక ప్రయత్నాలు
టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులను నివారించడానికి కర్ణాటక సర్కార్ గత వర్షాకాల సమావేశాల్లో బాల్య వివాహాల నిషేధ చట్టం-2006 బిల్లును సవరించింది. బాల్య వివాహాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అదనంగా, టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులను అరికట్టేందుకు జిల్లా, మండల స్థాయిలో చర్యలు తీసుకుంటోంది. బాధితుల రక్షణ కోసం చైల్డ్ హెల్ప్ లైన్-1098 ను తీసుకొచ్చింది. ఈ నంబర్‌కు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న బాలికలు ఫోన్ చేయొచ్చు. అప్పుడు సంబంధిత అధికారులు వెంటనే బాలికలను రక్షించడానికి తగు చర్యలు తీసుకుంటారు.
ఒకవేళ గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చిన మైనర్లకు ప్రభుత్వం అండగా ఉంటోంది. సంరక్షణ అవసరమైన పిల్లల భద్రత, పునరావాసం కోసం ప్రతి జిల్లాలో బాలల సంక్షేమ కమిటీ, బాలల ప్రత్యేక పోలీసు విభాగం, బాలల సంక్షేమ సంస్థ, జిల్లా బాలల రక్షణ విభాగం పనిచేస్తున్నాయి. బాధితురాలికి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు సంరక్షణ కేంద్రాలలో ఉండేందుకు అనుమతి ఉంది. 23 ఏళ్ల వయసు వరకు బాధితురాలికి అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. బాధితురాలికి 18 ఏళ్లు నిండే వరకు స్పాన్సర్షిప్ పథకం కింద ఒకేసారి రూ.6,000 విలువైన ఆరోగ్య సేవలు, వైద్య పరీక్షలు చేస్తున్నారు. అలాగే నెలకు రూ.4,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేవై) కింద బాధితురాలికి, ఆమె నవజాత శిశువుకు ఏడాదికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నారు.
బాత్రూమ్లో మైనర్ల ప్రసవాలు
యాదగిర్ జిల్లాలోని షాపూర్ తాలూకాలో ఒక రెసిడెన్షియల్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఇటీవలే (ఆగస్టు 27న) హాస్టల్ బాత్రూమ్లో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్లో జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఆ వెంటనే శివమొగ్గలో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తన సొంత సోదరుడి చేతిలో లైంగిక వేధింపులకు గురైన 15 ఏళ్ల బాలిక తన ఇంట్లోని బాత్రూమ్లో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇలా అత్యాచారాలు, లైంగిక వేధింపులు, ప్రేమ సమయంలో శృంగారం వంటి కారణాల వల్ల టీనేజ్ లోనే చాలా మంది బాలికలు గర్భం దాల్చడం ఆందోళన కలిగిస్తోంది.

