ETV Bharat / bharat

చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుని శక్తిమంతమైన భారత్​ను నిర్మించాలి: అజిత్ ఢోబాల్

అవమానం, నాశనం, అణచివేత చరిత్రను మర్చిపోవద్దన్న జాతీయ భద్రతా సలహాదారు- యువతలో ఆవేశం, తపన అవసరమని సూచించిన అజిత్ ఢోబాల్

Ajit Doval
Ajit Doval ((Photo/Ministry of Youth Affairs and Sports))
author img

By ETV Bharat Telugu Team

Published : January 10, 2026 at 12:10 PM IST

3 Min Read
Choose ETV Bharat

Ajit Doval On Independence : భారతదేశ స్వాతంత్య్రం ఎన్నో త్యాగాల ఫలితమని, వాటి వెనుక ఉన్న బాధ, అవమానం, జరిగిన నష్టాలను యువత ఎప్పటికీ మరిచిపోవద్దని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్ సూచించారు. దిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భారత స్వాతంత్ర్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని శక్తిమంతమైన భారత్​ను నిర్మించాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.

తీవ్రమైన అవమానాలను ఎదుర్కొన్న తర్వాతనే!
భారత స్వాతంత్ర్యం ఒక్కరోజులో సాధించిన విజయం కాదని అజిత్‌ డోభాల్ స్పష్టం చేశారు. తరతరాల భారతీయులు అపారమైన కష్టాలు అనుభవించారని, అవమానాలు భరించారని చెప్పారు. "ఈరోజు మనం చూస్తున్న స్వతంత్ర భారతదేశం ఎప్పుడూ ఇలాగే లేదు. మన ముందు తరాలు దీనికోసం గొప్ప త్యాగాలు చేశారు. వారు తీవ్రమైన అవమానాలను ఎదుర్కొన్నారు" అని అజిత్‌ డోభాల్ చెప్పారు.

"ఎన్నో సందర్భాల్లో అశక్తతతో చూస్తూ ఉండిపోయారు. ఎంతోమంది ఉరిశిక్షలు ఎదుర్కొన్నారు. మన గ్రామాలు కాలిపోయాయి. మన నాగరికత నాశనం అయింది. మన ఆలయాలు దోచుకున్నారు. అయినా మనం మౌనంగా నిలబడ్డాం" అని వ్యాఖ్యానించారు. ఈ చరిత్రే నేటి యువత ముందున్న అసలైన సవాల్‌ అని ఆయన అన్నారు. ప్రతి యువకుడి మనసులో ఆవేశం, తపన ఉండాలని చెప్పారు.

ఆ ప్రతీకారం సాధించాలి!
ప్రతీకారం అనే పదం సరైనది కాకపోవచ్చని అంగీకరిస్తూనే, చరిత్ర నుంచి వచ్చే ప్రతీకార భావన ఒక శక్తివంతమైన ప్రేరణగా మారాలని ఆయన పేర్కొన్నారు. "మన చరిత్రకు ప్రతీకారం తీర్చుకోవాలి. అది హింస ద్వారా కాదు. మన దేశాన్ని తిరిగి నిలబెట్టడం ద్వారా. మన హక్కులు, మన ఆలోచనలు, మన నమ్మకాలు ఆధారంగా ఒక గొప్ప భారతదేశాన్ని నిర్మించడం ద్వారా ఆ ప్రతీకారం సాధించాలి" అని ఆయన పిలుపునిచ్చారు.

భారతదేశానికి ఎంతో పురాతనమైన, అభివృద్ధి చెందిన నాగరికత ఉందని అజిత్ ఢోబాల్ గుర్తు చేశారు. శాంతియుత జీవన విధానమే భారతీయుల సంస్కృతి అని చెప్పారు. "మన నాగరికత ఎప్పుడూ ఇతరుల ఆలయాలను ధ్వంసం చేయలేదు. ఎక్కడికీ వెళ్లి దోచుకోలేదు. ఇతర దేశాలపై దాడులు చేయలేదు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు వెనుకబడి ఉన్న కాలంలోనే మనం అత్యున్నత స్థాయిలో జీవించాం" అని వివరించారు.

చరిత్ర మనకు గుణపాఠం చెప్పింది!
అయితే, భద్రతా ముప్పులను గుర్తించడంలో గతంలో చేసిన నిర్లక్ష్యం భారతదేశానికి భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందని అజిత్ ఢోబాల్ హెచ్చరించారు. శత్రువులను, ముప్పులను తేలికగా తీసుకోవడం వల్లే చరిత్రలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని అన్నారు. "భద్రత విషయంలో నిర్లక్ష్యం చేసినప్పుడు చరిత్ర మనకు గుణపాఠం చెప్పింది. ఆ పాఠాన్ని మనం నేర్చుకున్నామా? భవిష్యత్‌ తరాలు దాన్ని గుర్తుంచుకుంటాయా?" అని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్‌ తరాలు ఈ పాఠాన్ని మరిచిపోతే అదే దేశానికి అతిపెద్ద దురదృష్టమని స్పష్టం చేశారు. చరిత్రను మర్చిపోవడమే అత్యంత పెద్ద విషాదమని వ్యాఖ్యానించారు. భద్రత, స్వాభిమానం, జాతీయ విలువల విషయంలో అప్రమత్తత అత్యంత అవసరమని ఆయన యువతకు సూచించారు.

ఇదిలా ఉండగా, వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌ 2.0 కార్యక్రమం శనివారం అధికారికంగా ప్రారంభమైంది. జనవరి 12 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. దేశవ్యాప్తంగా వచ్చిన యువ నాయకులు, విద్యార్థులు, నిపుణులు ఈ వేదికపై అభివృద్ధి చెందిన భారతదేశం దిశగా తమ ఆలోచనలు పంచుకోనున్నారు. గత ఏడాది జనవరిలో ఇదే భారత్‌ మండపంలో ఈ డైలాగ్‌ తొలి ఎడిషన్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. యువతలో జాతీయ చైతన్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు.

'భారత్​కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?'- ఆపరేషన్​ సిందూర్​పై అజిత్​ ఢోబాల్

ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం మాకు లేదు- పాక్ అలా చేస్తే మాత్రం ఊరుకోం: అజిత్ ఢోబాల్