అంత్యక్రియల కోసం అవస్థలు- పీకల్లోతు వాగులో మృతదేహాన్ని మోస్తూ పాట్లు
గ్రామానికి సరైన రహదారి, వంతెన లేకపోవడమే కారణమని గ్రామస్థులు- దశాబ్దాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని గ్రామస్థుల ఆవేదన


Published : July 6, 2026 at 4:30 PM IST
Villagers Carrying Dead Body in Water : సాంకేతిక రంగంలో దేశం పురోగమిస్తున్నప్పటికీ, స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా కొన్ని గ్రామాల్లో కనీస వసతులు కూడా లేవు. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని హోన్నావర తాలూకా, హోసాకులి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 'దొడ్డహిట్టలకేరి' గ్రామమే దీనికి ఒక ఉదాహరణ. ఇక్కడ నివసించే వారికి సరైన రహదారి లేదు. ఇంకా అక్కడ ప్రవహించే వాగును దాటడానికి కనీసం వంతెన కూడా లేదు. వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఇక్కడి ప్రజల జీవితం నరకప్రాయంగా మారుతుంది. ముఖ్యంగా ఎవరైనా మరణిస్తే పీకల్లోతు ప్రవహించే వాగులో ప్రమాదకరంగా మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇళ్లలోకి వరద నీరు- పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం
దొడ్డహిట్టలకేరిలో 50కి పైగా ఇళ్లు, 150 మందికి పైగా జనాభా ఉన్నారు. ఈ గ్రామానికి చేరుకోవడానికి సరైన రహదారి లేకపోవడంతో, దశాబ్దాలుగా ప్రైవేట్ భూములు, తోటల గుండానే రాకపోకలు సాగిస్తున్నారు. అయితే, పశ్చిమ కనుమల ఎగువన ఉన్న సిద్దాపుర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు, గ్రామం గుండా ప్రవహించే భాస్కేరి వాగు పొంగిపొర్లుతుంది. దీంతో వరద నీరు తోటలు, దారులను దాటి ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా అనేక కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందాల్సి వస్తోంది. నిత్య అవసరాల కోసం గ్రామస్థులు, మహిళలు, పాఠశాల విద్యార్థులు నడుము లోతు, కొన్నిసార్లు అయితే పీకల్లోతు నీటిలో నడిచి తమ పనులకు వెళ్లాల్సి వస్తోంది.
మెడ లోతు నీటిలో మృతదేహాన్ని మోసుకెళ్లిన గ్రామస్థులు
జూలై 1న గ్రామానికి చెందిన క్రిస్టెన్ జోసెఫ్ రోడ్రిగ్స్ మరణించారు. అతడి అంత్యక్రియల కోసం గ్రామస్థులు మృతదేహాన్ని మెడ లోతు నీటిలో మోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. కనీస వసతులు లేకపోవడం వల్ల మృతదేహాన్ని గౌరవప్రదంగా, సురక్షితంగా తరలించలేని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల వైఫల్యానికి ఇది నిదర్శనమని స్థానికులు అంటున్నారు.

దశాబ్దాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్న స్థానికులు
భాస్కేరి వాగుపై శాశ్వత వంతెన, గ్రామానికి రహదారిని నిర్మించాలని స్థానికులు దశాబ్దాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే, వివిధ సాంకేతిక కారణాలు, వివాదాల సాకుతో పనులు ప్రతిసారీ వాయిదా వేస్తున్నారు. "మేము ఇక్కడ వందల ఏళ్లుగా నివసిస్తున్నాం. కానీ ప్రతి వర్షాకాలంలో ప్రాణభయంతో గడపాల్సి వస్తోంది. పిల్లల చదువు, ఉపాధి, ఆరోగ్య సేవలు అన్నీ దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం మా కోసం వెంటనే శాశ్వత వంతెన, రహదారిని నిర్మించాలి." అని స్థానికుడు బలరామ నాయక్ డిమాండ్ చేశారు.
స్థానికులే వంతెన నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు : ఎమ్మెల్యే దినకర్ శెట్టి
"ఆ వంతెన నిర్మాణం కోసం నేను స్వయంగా గ్రామాన్ని సందర్శించాను. అధికారులు కూడా సర్వే నిర్వహించారు. అయితే, అక్కడ నివసించే కొందరు వంతెన నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ప్రజలు కోరిన చోటల్లా నేను వంతెనలను నిర్మించాను. కానీ ఇక్కడ ప్రైవేట్ భూమి ఉండటం వల్ల, వంతెనకు ఇరువైపులా తగినంత స్థలం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. ఈ పనికి రాజకీయ అడ్డంకులు కూడా ఉన్నాయి." అని హోన్నావర బీజేపీ ఎమ్మెల్యే దినకర్ శెట్టి అన్నారు.
ఇదిలా ఉండగా, పశ్చిమ కనుమల్లో గత కొద్ది రోజులుగా కుండ పోత వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా తుంగ, భద్ర, షరావతి, హేమావతి, కావేరీ, కృష్ణ, దూద్గంగా, ఘటప్రభ తదితర నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. వేసవి కాలమంతా ఎండిపోయిన నదులు ప్రస్తుతం జలకళ సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే వాగులు పొంగిపోర్లుతూ ఇలాంటి ఘటనలకు దారి తీస్తున్నాయి.
ముంబయిలో వర్ష బీభత్సం- విరిగిపడిన కొండచరియలు- రైల్వే సరీస్వులు రద్దు
భారీ వర్షాలతో ముంబయి అతలాకుతలం- పలు విమానాలు రద్దు- అంబానీ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం

