ETV Bharat / bharat

బిహార్​ రాజకీయాల్లోకి మరో వారసుడు- జేడీయూలోకి సీఎం కొడుకు

నిశాంత్​ కుమార్​కు పార్టీలో కీలక బాధ్యతలను ఇవ్వనున్నట్లు బిహార్ మంత్రి వెల్లడి

Nitish Kumar Son in Politics
Nitish Kumar Son in Politics (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : March 3, 2026 at 1:05 PM IST

3 Min Read
Choose ETV Bharat

Nitish Kumar Son in Politics : బిహార్​ రాజకీయాల్లోకి మరో వారసుడు రానున్నారు. ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్​ కుమారుడు నిశాంత్​ కుమార్​ రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. హోలీ సందర్భంగా పార్టీలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. నిశాంత్​ కుమార్​కు పార్టీలో కీలక బాధ్యతలను ఇవ్వనున్నట్లు బిహార్ మంత్రి శ్రవణ్​ కుమార్​ వెల్లడించారు. బిహార్ ప్రజలు, జేడీయూ కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్​ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.

"హోలీ పండగ సందర్భంగా బిహార్​ యువత, జేడీయూ కార్యకర్తల కోరిక మేరకు నిశాంత్ కుమార్​ పార్టీలో చేరనున్నారు. ఆయనకు ఏ పదవి ఇవ్వాలో పార్టీ నిర్ణయిస్తుంది. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఆయనకు పార్టీ చాలా కీలకమైన బాధ్యతలను అప్పగించనుంది. ఇది మాకు ఎంతో ఆనందంగా ఉంది."

--శ్రవణ్ కుమార్​, బిహార్​ మంత్రి

మరోవైపు నిశాంత్​ కుమార్​ పార్టీలో చేరడంపై బిహార్ మంత్రి అశోక్ చౌదరీ స్పందించారు. విద్యావంతుడు ఇంజినీర్ అయిన నిశాంత్​ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆయన చెప్పారు. నీతీశ్ కుమార్​ సింప్లిసిటీ, వ్యవహార శైలి నిశాంత్​లోనూ ఉన్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తల ఒత్తడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.

"నిశాంత్​ కుమార్​ క్రియాశీల రాజకీయాల్లో ఉండాలి. ఆయన ఇంజినీర్​ మాత్రమే కాకుండా నీతీశ్​ పోలికలు చాలా ఉన్నాయి. ఇదంతా పార్టీ కార్యకర్తల మద్దతు, ఒత్తిడి వల్లే జరుగుతుంది. ఇందులో నీతీశ్​ కుమార్​ నిర్ణయం ఏం లేదు. నిశాంత్​ పార్టీలో చేరాలని చాలా రోజుల నుంచి పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. హోలీ పండగకు ఇదొక అద్భుతమైన బహుమతి."

--అశోక్​ చౌదరి, బిహార్ మంత్రి

బిహార్ రాజకీయాల్లో నిశాంత్​ కుమార్​ తప్పనిసరిగా ప్రవేశించాలని జేడీయూ నేత నీరజ్ కుమార్ అన్నారు. రాజ్యసభకు నిశాంత్​ కుమార్​ అర్హత గల వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. "నిశాంత్ లాంటి వ్యక్తి పార్టీలో చేరాలని కార్యకర్తలు, మద్దతుదారు కోరుకున్నారు. అయితే ఎవరు రాజ్యసభకు వెళ్లాలని విషయాన్ని పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది. ఎవరైనా ఆయన అర్హతను ప్రశ్నిస్తే నిశాంత్​పై ఏదైనా అవినీతి మరకలు ఉన్నాయా? ఎలాంటి మచ్చ లేని వ్యక్తులు రాజకీయాల్లోకి ప్రజా జీవితంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు నిశాంత్​ను తేజస్వీ యాదవ్​తో పోలిస్తే, ఆయనపై నాలుగు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. నిశాంత్ కుమార్​ చదువులోనూ చాలా మందున్నారు. కాబట్టి వీరిద్దరి మధ్య ఎలాంటి పోలిక లేదు. ఇప్పుడు బిహార్​ యువత నిశాంత్​ రాజకీయ ప్రవేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది." అని నీరజ్ కుమార్ అన్నారు.

నిశాంత్​ కుమార్​ రాజకీయ ఎంట్రీపై చాలా రోజుల నుంచే ప్రచారం జరుగుతోంది. 2025 బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమి ఘన విజయం సాధించినప్పుడు ఈ ప్రచారం ఊపందుకుంది. గతేడాది డిసెంబర్​లో దీనిపై స్పందించిన జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్​ సంజయ్ ఝా, రాజకీయ ప్రవేశంపై నిశాంత్​ నిర్ణయం తీసుకుంటారన్నారు. నిశాంత్​ పార్టీ కోసం పని చేయాలని కార్యకర్తలు, మద్దతుదారులు కోరుకుంటున్నారని తెలిపారు. " పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ప్రతీ ఒక్కరూ నిశాంత్​ రావాలని కోరుకుంటున్నారు. మా అందరికీ నిశాంత్​ పార్టీ చేరాలని ఉంది. ఇక ఆయన దీనిపై నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడు పార్టీలో చేరాలని ఆయనే నిర్ణయించుకోవాలి." అని అన్నారు.

మరోవైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్​ సంజయ్ ఝా స్పందించారు. "ఇది నీతీశ్ కుమార్​ ఏర్పాటు చేసిన పార్టీ. ఈ ఎన్నికల తర్వాత ఈ అంశంపై ఆయన నిర్ణయం తీసుకుంటారు. నీతీశ్​ కుమార్​ నిర్ణయం తీసుకుంటే పార్టీ మొత్తం దానిని అంగీకరిస్తుంది." అని అన్నారు.