ETV Bharat / bharat

కొత్త ప్రైవేటు స్కూళ్ల ఏర్పాటు సులభతరం- రాష్ట్రాలకు నీతి ఆయోగ్ కీలక సూచనలు

ప్రైవేటు స్కూళ్ల ఏర్పాటుకు ఫాస్ట్ ట్రాక్‌‌ అనుమతులు- అనవసర నిబంధనలు, ఎన్‌ఓసీ సర్టిఫికెట్లను తొలగించాలి- రాష్ట్రాల విద్యాశాఖలతో సమీక్షలో నీతి ఆయోగ్ సూచనలు- త్వరలోనే కేంద్రానికి సమగ్ర సిఫారసులు

Private School
Private School (ETV Bharat (Representative Image))
author img

By ETV Bharat Telugu Team

Published : May 1, 2026 at 3:53 PM IST

3 Min Read
Choose ETV Bharat

NITI Aayog On Private Schools : దేశంలో ప్రైవేటు స్కూళ్లు ఏర్పాటు చేసే ప్రక్రియను మరింత సులభతరం, వేగవంతం చేసే దిశగా నీతి ఆయోగ్ కసరత్తు చేస్తోంది. అనవసర నిబంధనలన్నీ తొలగించి, ప్రైవేటు స్కూళ్ల ఏర్పాటుకు ఫాస్ట్ ట్రాక్‌‌ అనుమతుల మంజూరుకు చర్యలను చేపట్టాలని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచించింది. తాజాగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాఠశాల విద్యాశాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో నీతి ఆయోగ్ అధికారులు ఈమేరకు సూచనలు చేశారు.

ఆ సర్టిఫికెట్లకు బదులుగా ప్రత్యక్ష పరిశీలన
కొత్తగా ప్రైవేటు స్కూలు ఏర్పాటు చేయాలని భావించే వారు సమర్పించాల్సిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ల(ఎన్‌ఓసీ) సమాచారంపై అన్ని రాష్ట్రాలను నీతి ఆయోగ్ అధికార వర్గాలు ఆరాతీశాయి. స్కూలు పెట్టేవాళ్లు పోలీసు, మున్సిపల్, అగ్నిమాపక, ఆర్‌అండ్‌బీ, ఇతరత్రా విభాగాల నుంచి ఎన్‌ఓసీ సర్టిఫికెట్లను తీసుకొని తమకు సమర్పిస్తారని రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు వివరించారు. వారితో నిర్దిష్ట మొత్తంలో పోస్టాఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ కూడా చేయించుకుంటామని చెప్పారు. ఈవివరాలన్నీ తెలుసుకున్న నీతి ఆయోగ్ అధికారులు, ప్రైవేటు స్కూళ్ల ఏర్పాటు అనుమతులతో ముడిపడిన అనవసర నిబంధనలు, అనవసర సర్టిఫికెట్లను తొలగించాలని రాష్ట్రాల విద్యాశాఖలకు సూచించారు. ఇందుకు బదులుగా ప్రైవేటు స్కూలు ప్రారంభమైన తర్వాత నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నారా? విద్యా బోధనా ప్రమాణాలను అనుసరిస్తున్నారా? అనేది ప్రత్యక్ష పరిశీలనలతో తెలుసుకోవాలని వాటికి నిర్దేశించారు. ఈ అంశంపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సమగ్ర సిఫారసులను అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రైవేటు స్కూలు ఏర్పాటుకు ఏమేం కావాలి?

  • తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు స్కూలు ఏర్పాటు చేయాలని భావించే వారు పలు అనుమతులు, ఎన్‌ఓసీ సర్టిఫికెట్లను పొందాల్సి ఉంటుంది.
  • విద్యాశాఖ, పోలీసు, మున్సిపల్, అగ్నిమాపక, ఆర్‌అండ్‌బీ, ఇతరత్రా విభాగాల నుంచి ఎన్‌ఓసీ సర్టిఫికెట్లను తీసుకోవడం తప్పనిసరి.
  • ప్రైవేేటు స్కూలు ఏర్పాటుకు అనుమతిని కోరుతూ విద్యాశాఖకు దరఖాస్తు, పత్రాలను సమర్పించే క్రమంలో రూ.25వేల నుంచి రూ.50వేల పోస్టాఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను కూడా చూపించాలి. స్కూలు నడిచినంత కాలం ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌‌ను విత్‌డ్రా చేయడానికి వీలుండదు.
  • తెలంగాణలో ప్రైవేటు స్కూలు ఏర్పాటు కోసం కనీసం 1000 చదరపు మీటర్ల క్రీడా మైదానం ఉండాలి. అయితే ఈ నిబంధనలో కీలక మార్పు చేశారు. దీని ప్రకారం, క్రీడా మైదానం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నుంచి స్థలాన్ని లీజుకు తీసుకున్నా స్కూలు ఏర్పాటుకు అనుమతి ఇస్తారు.
  • రాష్ట్రంలో స్కూలు ఏర్పాటు కోసం పెద్దగా స్థలాన్ని కలిగి ఉండాల్సిన అవసరం కూడా లేదు.
  • ఈమేరకు రెండు కీలక నిబంధనలను సరళతరం చేసినందుకు తెలంగాణ రాష్ట్రాన్ని నీతి ఆయోగ్ అధికార వర్గాలు అభినందించాయి.

ప్రైవేటు స్కూళ్లపై ఫోకస్ అందుకోసమే
ప్రస్తుతం మనదేశంలో మొత్తం 14.72 లక్షల స్కూళ్లు ఉన్నాయి. వీటిలో ప్రైవేటు స్కూళ్లు కేవలం 23 శాతమే. అందుకే రాబోయే కొన్నేళ్లలో ప్రైవేటు స్కూళ్ల సంఖ్య వీలైనంత మేరకు పెరిగేలా అన్ని రాష్ట్రాల్లో అనుకూల వాతావరణాన్ని సృష్టించాలని నీతిఆయోగ్ భావిస్తోంది. ఇందులో భాగంగానే వాటికి అనుమతులను మంజూరు చేసే ప్రక్రియను సులభతరం, వేగవంతం చేయాలని రాష్ట్రాలకు సూచిస్తోంది. 2035 సంవత్సరంకల్లా ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (GER)ని ప్రస్తుతమున్న 30 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని జాతీయ విద్యా విధానం సిఫారసు చేస్తోంది. దేశంలో పాఠశాల విద్య ఎంత బలంగా ఉంటే, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల అడ్మీషన్లు అంతగా పెరుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల భాగస్వామ్యం లేకుండా 50 శాతం లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమని కేంద్ర సర్కారు భావిస్తోంది.

సిలిండర్ల ధరలు పెరుగుతాయని నేను ముందే చెప్పాను : రాహుల్​ గాంధీ

'అసెంబ్లీకి సీఎం తాగొచ్చారు'- విపక్షాల సంచనల ఆరోపణలు