యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు కుట్ర- దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ దాడులు- 11 మంది అరెస్టు
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు- ఆన్‌లైన్‌లో యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షిస్తున్నారనే ఆరోపణలు- పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్న ఎన్‌ఐఏ అధికారులు- 11మంది నిందితులతోపాటు ఒక బాలుడిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

Published : July 8, 2026 at 8:58 PM IST
NIA Conducts Pan India Searches : ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోసి, జిహాద్ ద్వారా ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలనే కుట్రలపై జాతీయ దర్యాప్తు సంస్థ-NIA దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, బంగాల్, బిహార్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలతోపాటు దిల్లీలోని మొత్తం 20ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో పలు కీలక డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ ఉగ్రవాదానికి సంబంధించిన కేసులో NIA ఇప్పటివరకు 11మంది నిందితులతోపాటు ఓ బాలుడిని అరెస్టుచేసింది. మార్చిలో ప్రధాన నిందితుడు రెహ్మతుల్లా షరీఫ్ మహ్మద్ నివాసంలో విజయవాడ పోలీసులు సోదాలు నిర్వహించగా ఐసిస్, అల్-ఖైదాలకు చెందిన కీలకపత్రాలు లభ్యమయ్యాయి. మే నెలలో ఈ కేసు దర్యాప్తును NIA చేపట్టింది. నిందితుల కాల్ డేటా, సీజ్ చేసిన పరికరాల విశ్లేషణ ఆధారంగా ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
జీశాన్ ఇంట్లో నాలుగు గంటల పాటు సోదాలు
ఐసిస్ సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై జోధ్‌పుర్‌లో జీశాన్ అనే యువకుడిని గతంలో ఆంధ్రప్రదేశ్ ఉగ్రవాద నిరోధక బృందం అరెస్టు చేసింది. ఇటీవల ఈ కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. ఇందులో భాగంగా బుధవారం ఎన్‌ఐఏ బృందం జోధ్‌పుర్‌కు చేరుకుని అతని ఇంట్లో సోదాలు నిర్వహించింది. నిందితుడి నివాసంలో అధికారులు మూడు నుంచి నాలుగు గంటల పాటు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అతని కుటుంబ సభ్యులను సుదీర్ఘంగా విచారించి కీలక వివరాలు సేకరించారు. నిందితుడు ఉపయోగించిన మోటార్ సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఏడాది మార్చిలో ఏపీ ఏటీఎస్ అధికారులు జీశాన్‌ను అరెస్టు చేసారు. ఆ సమయంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. జీశాన్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ఐసిస్ హ్యాండ్లర్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు తేలింది. జోధ్‌పుర్‌లో ఐసిస్ నెట్‌వర్క్ గ్రూప్‌ను నడిపించే బాధ్యతను అప్పగించే ముందు, ఆ హ్యాండ్లర్ జీశాన్‌కు ఒక పరీక్ష నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. అందులో పాస్ అయిన తర్వాతే అతనికి గ్రూప్ అడ్మిన్ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది.
ఏపీలోని విజయవాడలో ఒక అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ నెట్‌వర్క్ గుట్టు రట్టయింది. విజయవాడలో తన సహచరుడు పట్టుబడినట్లు తెలియగానే జీశాన్ వెంటనే ఆ సోషల్ మీడియా గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యాడు. అయినప్పటికీ, పోలీసుల దర్యాప్తులో అతని లింకులు స్పష్టంగా బయటపడటంతో ఏపీ ఏటీఎస్ పోలీసులు జోధ్‌పుర్ వచ్చి స్థానిక పోలీసుల సహాయంతో అతడిని అరెస్ట్ చేశారు.

