ETV Bharat / bharat

ఉగ్రవాదుల కొత్త వ్యూహం- సీక్రెట్ చాట్ కోసం అశ్లీల యాప్స్​ వినియోగం

రహస్యంగా మాట్లాడేందుకు అశ్లీల వెబ్‌సైట్లు, ప్రత్యేకమైన ఎన్‌క్రిప్టెడ్ అప్లికేషన్లను ఉపయోగిస్తున్నారని గుర్తించిన భద్రతా సంస్థలు

New JK Terror Tactic
ప్రతీకాత్మక చిత్రం ((ETV Bharat))
author img

By ETV Bharat Telugu Team

Published : August 30, 2026 at 5:39 PM IST

3 Min Read
Choose ETV Bharat

New JK Terror Tactic : ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉగ్రవాద సంస్థలు దుర్వినియోగం చేస్తున్న ఉదంతాన్ని ఛేదించిన భద్రతా సంస్థలు, తాజాగా మరో కొత్త వ్యూహాన్ని కనిపెట్టాయి. వీరంతా ఇప్పుడు రహస్యంగా మాట్లాడేందుకు అశ్లీల వెబ్‌సైట్లు, ప్రత్యేకమైన ఎన్‌క్రిప్టెడ్ అప్లికేషన్లను ఉపయోగిస్తున్నారని గుర్తించారు. సంప్రదాయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిఘాను తప్పించుకుంటూ జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు, పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐ (ISI) తమ రిక్రూట్లతో ఈ మార్గాల్లో మాట్లాడుతున్నారని వెల్లడించారు.

భద్రతా సంస్థల నిఘా నుంచి తప్పించుకోవడానికి ఈ పోర్నోగ్రఫీ ప్లాట్‌ఫారమ్‌లో ఉండే 'రియల్-టైమ్ చాట్' టూల్స్‌ను ఉగ్రవాదులు వాడుకుంటున్నారని అధికారులు గుర్తించారు. డేటింగ్ ముసుగులో చుట్టుపక్కల ఉన్న ఒంటరి వ్యక్తులను కనిపెట్టి, ఈ చాట్ రూమ్స్‌ ద్వారా హ్యాండ్లర్లు తమ అనుచరులకు ఆదేశాలు ఇస్తున్నట్లు తేల్చారు. ఉగ్రవాద కార్యకలాపాలను సమన్వయం చేయడానికి, జమ్మూ కాశ్మీర్‌లోని యువతను ఆకర్షణకు, తీవ్రవాదం వైపు మళ్లించడానికి ఈ పద్ధతిని వాడుతున్నట్లు అధికారులు నిర్ధరించారు.

వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, సిగ్నల్ వంటి సాధారణ యాప్‌లను వాడకుండా, ఉగ్రవాదులు ప్రత్యేక డిజిటల్ టూల్స్‌పై ఆధారపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్‌క్రిప్టెడ్ నోడ్‌ల ద్వారా డేటాను పంపడానికి, వినియోగదారుల గుర్తింపులను దాచేందుకు కోటెక్స్, కోనియన్ వంటి టోర్-ఆధారిత మెసేజింగ్ అప్లికేషన్‌లపై ఆధారపడుతున్నట్లు తేల్చారు. ఈ డేటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేర్వేరు సర్వర్ల (నోడ్స్) ద్వారా ప్రయాణించడం వల్ల పంపినవారిని, అందుకున్నవారిని గుర్తించడం చాలా కష్టం. అయితే, భారత్‌లో 'కోనియన్' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వీలు లేదు. ఇలాంటి యాప్​లపై భారత్​లో ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయి.

వీటితో పాటు ఫ్రాన్స్‌కు చెందిన రహస్య యాప్​లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది సిమ్ కార్డ్ లేదా ఫోన్ నంబర్ అవసరం లేకుండా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్‌ను అనుమతిస్తుందని వివరించారు. తద్వారా వినియోగదారుని గుర్తించడం కష్టతరం అవుతుందని చెప్పారు. వియత్నాంకు చెందిన యాప్‌లతో పాటు మూన్‌చాట్ వంటి అనామక ప్లాట్‌ఫారమ్‌లను కూడా భద్రతా సంస్థలు పర్యవేక్షిస్తున్నాయి. ఇందులో సంప్రదాయ రిజిస్ట్రేషన్‌ను దాటవేసే, చైనా మూలాలతో ఉన్న PGP-ఎన్‌క్రిప్టెడ్ వెర్షన్‌లు ఉన్నాయి.

పోర్న్ అప్లికేషన్‌లో చాలా వరకు భారతదేశంలో నిషేధించినప్పటికీ, వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) ఉపయోగించి వాటిని చట్టవిరుద్ధంగా డౌన్‌లోడ్ చేస్తున్నారు. VPN సహాయంతో ఐపీ అడ్రస్‌లను మార్చి వీటిని అక్రమంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. VPN వల్ల ఇంటర్నెట్ ప్రోటోకాల్ చిరునామాలను మాస్క్ చేయడం, ఆన్‌లైన్ ట్రాఫిక్‌ను ఎన్‌క్రిప్ట్ చేయడం ద్వారా ఇంటర్నెట్‌లో సురక్షితమైన, ఎన్‌క్రిప్టెడ్ కనెక్షన్‌ను సృష్టిస్తుంది. ఫలితంగా ఆన్‌లైన్ కార్యకలాపాలను ట్రాక్ చేయడం, వారి డేటాను యాక్సెస్ చేయడం మరింత కష్టతరం అవుతుంది.

కొన్ని యాప్‌లు ప్రాథమిక ఎన్‌క్రిప్షన్ ఫీచర్లను అందిస్తుండగా, మరికొన్ని ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, సెల్ఫ్-డిస్ట్రక్ట్ మెసేజ్‌లు, RSA-2048 ఎన్‌క్రిప్షన్ అల్గారిథమ్‌ను ఉపయోగిస్తున్నాయి. మరికొన్నింటిలో అమెరికాకు చెందిన నెట్‌వర్క్ సెక్యూరిటీ సంస్థ రూపొందించిన 'RSA-2048' అనే అత్యంత క్లిష్టమైన ఎన్‌క్రిప్షన్ అల్గారిథమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ఏ మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా కేవలం వినియోగదారుడి డివైజ్‌లోనే డేటాను ప్రాసెస్ చేస్తుంది. గుర్తింపు దొరకకుండా ఉండేందుకు కొన్ని యాప్‌ల్లో మెసేజ్ చదివిన వెంటనే దానంతట అదే డిలీట్ అయ్యే సదుపాయాన్ని వాడుతున్నట్లు అధికారులు కనిపెట్టారు.

వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, సిగ్నల్ వంటి సంప్రదాయ సోషల్ మీడియా యాప్‌లను ఉగ్రవాదులు వినియోగించడం లేదని అధికారులు తెలిపారు. నెమ్మదిగా ఉండే 2G లేదా EDGE నెట్‌వర్క్ వేగం ఉన్నప్పటికీ పనిచేసే నిర్దిష్ట అప్లికేషన్‌లపై జమ్ము కశ్మీర్​లోని హ్యాండ్లర్లు, రిక్రూట్‌లు ఇద్దరూ ఆధారపడుతున్నారని భద్రతా అధికారులు గుర్తించారు. ఈ యాప్​ల్లో కొన్నింటిలో రిజిస్టర్ చేసుకునేటప్పుడు వినియోగదారుడి ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ కూడా అవసరం లేదు. ఈ ఆఫ్-గ్రిడ్ కమ్యూనికేషన్ ఛానెళ్లను గుర్తించడానికి, వాటిని అరికట్టేందుకు భద్రతా సంస్థలు తమ సైబర్-నిఘా వ్యవస్థలను నిరంతరం మెరుగుపరుచుకుంటున్నాయని తెలిపారు.

విదేశాల్లో తయారైన వర్చువల్ సిమ్ కార్డుల వాడకాన్ని ఎదుర్కోవడానికి భద్రతా దళాలు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ కొత్త వ్యూహాలు వెలుగులోకి వచ్చాయి. విదేశీ కంపెనీలు అభివృద్ధి చేసిన వర్చువల్ సిమ్ కార్డులు, కంప్యూటర్ ద్వారా ఫోన్ నంబర్లను రూపొందించడానికి వీలు కల్పిస్తాయి. ఈ నంబర్లను నిర్దిష్ట అప్లికేషన్‌ల ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించడం వల్ల డిజిటల్ ఆనవాళ్లు దాదాపుగా లేకుండా పోతాయి. 2019 పుల్వామా ఉగ్రదాడిపై జరిపిన దర్యాప్తులో ఈ విషయం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో జైష్-ఎ-మొహమ్మద్ ఆత్మాహుతిదారుడు, అతడి సహచరులు 40కి పైగా వర్చువల్ సిమ్ కార్డులను ఉపయోగించినట్లు ఎన్ఐఏ జరిపిన సమగ్ర దర్యాప్తులో తేలింది.

PGలో యువతుల లోదుస్తులు, శానిటరీ ప్యాడ్లు చోరీ- వాటితో లైంగిక సంతృప్తి- కట్​ చేస్తే పోలీసుల చేతిలో!

పాక్ హ్యాండ్లర్లకు భారత్​ సిమ్ కార్డులు- బార్డర్​లో సోలార్ కెమెరాల ఏర్పాటుకు ప్లాన్​- నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు