ETV Bharat / bharat

కేరళ తీరంలో అరుదైన సముద్ర జీవి గుర్తింపు- కొత్త స్కేట్ చేప జాతికి ఏం పేరు పెట్టారంటే?

అరేబియా సముద్రంలో 400-600 మీటర్ల లోతులో కొత్త సముద్ర జీవి గుర్తింపు- కేరళ తీరానికి సమీపంలో గుర్తించిన శాస్త్రవేత్తలు- డిప్టురస్ ధ్రుతియే అని ZSI తొలి మహిళా డైరెక్టర్ పేరుతో నామకరణం

Scientists discover new sea creature
శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త సముద్ర జీవి (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : September 2, 2026 at 10:49 PM IST

3 Min Read
Choose ETV Bharat

New Skate Species Kerala Coast : భారతదేశ సముద్ర జీవవైవిధ్యంలో మరో అరుదైన ఆవిష్కరణ జరిగింది. అరేబియా సముద్రం ఆగ్నేయ ప్రాంతంలో కేరళ తీరం సమీపంలో(డీప్ సీ స్కేట్ చేప జాతి) కనుగొన్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ZSI), సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CMFRI), అంతర్జాతీయ పరిశోధకుల బృందం సంయుక్తంగా జరిపిన అన్వేషణలో ఈ కొత్త జాతి జీవి బయటపడింది. దీనిని కేంద్ర భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ (MoES) చేపట్టిన ప్రతిష్టాత్మక డీప్ ఓషన్ మిషన్‌ ప్రాజెక్టులో భాగంగా కనుగొన్నారు. ఇక ఈ కొత్త జాతి జీవికి డిప్టురస్ ధ్రుతియే అని శాస్త్రీయ నామకరణం చేశారు. ZSI డైరెక్టర్, సంస్థ తొలి మహిళా డైరెక్టర్ డాక్టర్ ధ్రుతి బెనర్జీని గౌరవిస్తూ ఈ పేరు పెట్టారు.

ఈ చేప జాతిని తాత్కాలికంగా అరేబియన్ స్కేట్‌గా పిలుస్తున్నారు. భారత ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) పరిధిలోని ఆగ్నేయ అరేబియా సముద్రంలో దీనిని గుర్తించారు. MoES డీప్ ఓషన్ మిషన్ ప్రాజెక్టు షార్కులు, రేలు, స్కేట్లు వంటి కార్టిలేజినస్ చేపలపై పరిశోధనలు నిర్వహిస్తోంది. భారతదేశానికి చెందిన లోతైన సముద్ర పర్యావరణ వ్యవస్థలు, సముద్ర జీవ వైవిధ్యంలోని చాలా ప్రాంతాలను ఇంకా పూర్తిగా అన్వేషించలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డిప్టురస్ ధ్రుతియే నమూనాలను సముద్ర మట్టానికి 400 నుంచి 600 మీటర్ల లోతులో సేకరించారు. కేరళ తీరానికి సమీపంలోని జలాలతో పాటు సముద్ర ఖండ వాలు ప్రాంతాల్లో కూడా వీటిని గుర్తించారు.

Scientists discover new sea creature
శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త సముద్ర జీవి (Source : ETV Bharat)

పరిశోధకుల ప్రకారం, ఈ స్కేట్ చేప గరిష్ఠంగా సుమారు 131.5 సెంటీమీటర్ల పొడవు పెరుగుతుంది. దీని తోక వెంట 5 ముళ్ల వరుసలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే దీని ప్రధాన ప్రత్యేకతల్లో ఒకటిగా ఉంది. ఈ ప్రత్యేక లక్షణమే ఇతర సంబంధిత స్కేట్ జాతుల నుంచి దీనిని వేరయ్యేలా చేసింది. కొత్త జాతి గుర్తింపును శాస్త్రవేత్తలు కేవలం శరీర నిర్మాణ పరిశీలన ఆధారంగా కాకుండా, మాలిక్యులర్ జెనెటిక్ విశ్లేషణతోనూ నిర్ధరించారు. పూర్తి మైటోకాండ్రియల్ జీనోమ్ విశ్లేషణలో డిప్టురస్ ధ్రుతియే తనకు అత్యంత దగ్గరి సంబంధం ఉన్న ట్రావెన్‌కోర్ స్కేట్ (డిప్టురస్ జోహాన్నిస్‌డేవిసీ) నుంచి జన్యుపరంగా భిన్నంగా ఉన్నట్లు తేలింది.

40 ఏళ్లుగా మరో చేపగా పొరపాటు
ఈ రెండు జాతుల మధ్య 3.8 శాతం నుంచి 4.7 శాతం వరకు జన్యుపరమైన వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. ప్రత్యేక శారీరక లక్షణాలతో పాటు జన్యు ఆధారాలు కూడా ఈ చేప ఇంతకుముందు శాస్త్రీయంగా గుర్తించని ప్రత్యేక జాతిగా నిలిచింది. ఈ ఆవిష్కరణలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కొత్తగా గుర్తించిన ఈ స్కేట్ జాతి పూర్తిగా కొత్తది కాదు. గత 40 ఏళ్లకుపైగా ఈ చేపకు సంబంధించిన నమూనాలను డిప్టురస్ స్ప్రింజెరిగా తప్పుగా గుర్తించినట్లు పరిశోధనకులు తెలిపారు. వాణిజ్య రొయ్యల ట్రాలర్ల వలలకు ఇవి అప్పుడప్పుడు బైక్యాచ్‌గా చిక్కేవి. తాజాగా నిర్వహించిన సమగ్ర పరిశోధనతో ఆ నమూనాలు వాస్తవానికి ప్రత్యేకమైన కొత్త జాతికి చెందినవని తేలింది.

Scientists discover new sea creature
'అరేబియన్ స్కేట్' అని పిలుస్తున్న కొత్త చేప జాతి (Source : ETV Bharat)

జెడ్‌ఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ ధ్రుతి బెనర్జీ చేసిన జీవి వైవిధ్య పరిశోధనలు, సంస్థకు అందించిన నాయకత్వాన్ని గుర్తిస్తూ ఈ కొత్త స్కేట్‌కు డిప్టురస్ ధ్రుతియే అని పేరు పెట్టారు. లోతైన సముద్రంలో ఇంకెన్నో అన్వేషించని జీవులు ఉన్నాయని, ఈ నూతన ఆవిష్కరణ సముద్ర జీవవైవిధ్యం పట్ల మన అవగాహనను మరింత పెంచుతుందని డాక్టర్ ధ్రుతి బెనర్జీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పరిశోధనలో భాగంగా కేరళ తీరంలోని కొల్లాం స్లోప్ ప్రాంతాన్ని ముఖ్యమైన షార్క్, రే ఏరియాగా (ISRA) శాస్త్రవేత్తలు మ్యాప్ చేశారు. ఈ లోతైన సముద్రపు జీవులు చాలా నెమ్మదిగా పెరుగుతాయని, వీటి సంతానోత్పత్తి రేటు కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల వీటి ఉనికికి త్వరగా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వాణిజ్యపరమైన చేపల వేటలో ఇవి అనుకోకుండా చిక్కుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

BLOలు ప్రజాస్వామ్యానికి పిల్లర్లు- మన ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకం: సీఈసీ

కెరీర్ అవకాశాలు కోల్పోతున్న జెన్​జీ- లింక్డిన్​ నివేదికలో వెల్లడి