క్రెడిట్ కార్డు బిల్లులతో సైబర్ నేరగాళ్ల కొత్త మోసం-పశ్చిమాసియా సంక్షోభం పేరుతో మరో ఉచ్చు!
భారీ బకాయిలున్న క్రెడిట్ కార్డులను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు- మోసపూరిత డబ్బుతో బిల్లులు చెల్లించి నగదు తీసుకుంటున్న ముఠాలు-పశ్చిమాసియా ఉద్రిక్తతలను అడ్డంగా పెట్టుకుని నకిలీ ఎల్పీజీ ఆఫర్లతో మోసాలు

Published : June 14, 2026 at 11:27 AM IST
Credit Card Bill Cyber Scam : దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త రూపాలు దాలుస్తున్నాయి. ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలను 'మనీ మ్యూల్'లుగా ఉపయోగించిన సైబర్ నేరగాళ్లు, ఇప్పుడు క్రెడిట్ కార్డులను తమ అక్రమ డబ్బు మార్పిడి కేంద్రాలుగా మార్చుకుంటున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) హెచ్చరించింది. ఇదే సమయంలో పశ్చిమాసియా సంక్షోభాన్ని అడ్డం పెట్టుకుని ఎల్పీజీ బుకింగ్‌లు, ప్రభుత్వ సబ్సిడీల పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు కూడా పెరిగినట్లు వెల్లడించింది.
ముంబయిలో ఇటీవల వెలుగుచూసిన ఘటనలు అధికారులను అప్రమత్తం చేశాయి. భారీ స్థాయిలో క్రెడిట్ కార్డు బకాయిలు ఉన్న వ్యక్తులను సైబర్ నేరగాళ్లు గుర్తించి, వారి బిల్లులను తామే చెల్లిస్తామని ఆశ చూపుతున్నట్లు విచారణలో తేలింది. అయితే ఈ చెల్లింపులకు ఉపయోగిస్తున్న డబ్బు సాధారణ డబ్బు కాదు. ఫిషింగ్, పెట్టుబడి మోసాలు, ఇతర సైబర్ నేరాల ద్వారా దోచుకున్న సొమ్మును క్రెడిట్ కార్డు ఖాతాల్లో జమ చేస్తున్నారు. బిల్లులు క్లియర్ అయిన తర్వాత కార్డు యజమానుల నుంచి సమాన మొత్తంలో నగదును తీసుకుంటున్నారు. ఇలా డిజిటల్ రూపంలో దోచుకున్న డబ్బును నగదుగా మార్చుకుని అక్రమ లావాదేవీల జాడలను చెరిపివేస్తున్నారు. దీంతో అసలు నేరస్థులను గుర్తించడం దర్యాప్తు సంస్థలకు మరింత కష్టంగా మారుతోంది.
'ఆ యాప్‌లకు దూరంగా ఉండాలి'
ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఐ4సీ సూచించింది. ఇతరుల కోసం తమ క్రెడిట్ కార్డులను ఉపయోగించనివ్వకూడదని, బిల్లులు చెల్లిస్తామంటూ కమిషన్లు ఆఫర్ చేసే వ్యక్తులను నమ్మొద్దని హెచ్చరించింది. అలాగే తెలియని వ్యక్తులు పంపిన ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్ చేయడం, ధృవీకరించని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం ప్రమాదకరమని తెలిపింది.
పశ్చిమాసియా సంక్షోభం పేరుతో కొత్త మోసాలు
మరోవైపు వెస్ట్ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను కూడా సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. యుద్ధ పరిస్థితుల వల్ల ఇంధన కొరత వస్తుందని, ఎల్పీజీ ధరలు పెరుగుతాయని భయపెడుతూ ప్రజలకు నకిలీ సందేశాలు పంపిస్తున్నారు. ఎల్పీజీ సిలిండర్లపై భారీ తగ్గింపులు, అత్యవసర సరఫరా, ప్రాధాన్య డెలివరీ, ప్రత్యేక ప్రభుత్వ సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ సందేశాలు, సోషల్ మీడియా పోస్టులు వైరల్ చేస్తున్నారు.
నకిలీ వెబ్‌సైట్లు, క్యూఆర్ కోడ్‌ల ముప్పు
ఈ సందేశాల్లో ఇచ్చే లింకులు, క్యూఆర్ కోడ్‌లు లేదా ఏపీకే ఫైళ్ల ద్వారా వినియోగదారులను నకిలీ వెబ్‌సైట్లకు మళ్లిస్తున్నారు. అవి అసలైన గ్యాస్ ఏజెన్సీల వెబ్‌సైట్ల మాదిరిగానే కనిపించడం వల్ల చాలామంది మోసపోతున్నారు. సబ్సిడీ పొందాలంటే వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం ఇవ్వాలని లేదా చిన్న మొత్తాన్ని వెరిఫికేషన్ ఫీజుగా చెల్లించాలని కోరుతున్నారు. ఒకసారి ఆ వివరాలు ఇచ్చిన తర్వాత బాధితుల బ్యాంకు ఖాతాలు ఖాళీ కావడం లేదా వారి వ్యక్తిగత సమాచారాన్ని ఇతర నేరాలకు వినియోగించడం జరుగుతోంది.
సైబర్ నేరాల్లో కొత్త ధోరణి
ఇది సైబర్ నేరాల్లో కొత్త ధోరణి అని సైబర్ భద్రత నిపుణుడు పవన్ దుగ్గల్ తెలిపారు. అమాయక ప్రజలను ఉపయోగించుకుని మోసపూరిత డబ్బును ఒకచోట నుంచి మరోదగ్గరికి తరలిస్తున్నారని తెలిపారు. క్రెడిట్ కార్డుల ద్వారా అక్రమ సొమ్మును చట్టబద్ధమైనదిగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. కొవిడ్ మహమ్మారి, ప్రకృతి విపత్తులు, అంతర్జాతీయ ఘర్షణల సమయంలో కూడా ఇలాంటి మోసాలు జరిగినట్లు పవన్ దుగ్గల్ గుర్తు చేశారు. ప్రజల్లో భయం, అనిశ్చితి ఎక్కువగా ఉన్న సందర్భాల్లో నేరగాళ్లు అత్యవసర పరిస్థితిని సృష్టించి నిర్ణయాలు తీసుకునేలా ఒత్తిడి తెస్తారని చెప్పారు.
ఐసీఐసీఐ బ్యాంక్ అవగాహన కార్యక్రమం
ఈ తరహా మోసాల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, చమురు సంస్థలు, ప్రభుత్వ అధికారుల పేరుతో వచ్చే కాల్స్, సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని వినియోగదారులకు సూచించింది. ఓటీపీలు, పిన్ నంబర్లు, సీవీవీలు, పాస్‌వర్డులు, యూపీఐ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పొద్దని స్పష్టం చేసింది. ఎల్పీజీ బుకింగ్‌లు, సేవలకు సంబంధించిన సమాచారాన్ని కేవలం అధికారిక వెబ్‌సైట్లు లేదా అధికారిక మొబైల్ యాప్‌ల ద్వారానే పొందాలని సూచించింది. భయపెట్టేలా, వెంటనే చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేసే సందేశాలను అనుమానంతో చూడాలని పేర్కొంది.
ఫిర్యాదుకు హెల్ప్‌లైన్ నంబర్
సైబర్ మోసాలకు గురైనట్లు అనుమానం వచ్చినా, బాధితులైన వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలని లేదా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని ఐ4సీ సూచించింది. ప్రజల్లో అవగాహన, అప్రమత్తతే ఇటువంటి కొత్త తరహా సైబర్ నేరాలను అడ్డుకునే ప్రధాన ఆయుధమని అధికారులు చెబుతున్నారు.
అయోధ్య విరాళాల వివాదంపై సిట్ ఏర్పాటు- రామమందిర ఉద్యోగి ఇంట్లో రూ.10 లక్షలు స్వాధీనం!
పరీక్షలను పటిష్ఠంగా నిర్వహించేందుకు NTA కీలక నిర్ణయం- డిజిటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం

