ETV Bharat / bharat

నేపాల్‌ వరదలతో బయటపడిన చైనా డ్యామ్‌ 'ముప్పు'- భారత్‌కు ప్రమాదమెంత? కేంద్రం వ్యూహమేంటి?

టిబెట్‌లో విపత్తుపై ముందస్తు సమాచారం ఇవ్వలేదని నేపాల్‌ ఆరోపణ- భూకంప ముప్పు ఉన్న ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న మెగా డ్యామ్- బ్రహ్మపుత్రపై చైనా నియంత్రణతో ఈశాన్య రాష్ట్రాలకు వరదలు, నీటి కొరత ముప్పు

China Dam Effect On India
ప్రతీకాత్మక చిత్రాలు (GETTY IMAGES)
author img

By ETV Bharat Telugu Team

Published : August 27, 2026 at 11:46 AM IST

5 Min Read
Choose ETV Bharat

China Dam Effect On India : హిమాలయాల్లో ప్రకృతి విపత్తు సంభవిస్తే దాని ప్రభావం సరిహద్దులను దాటి దిగువ దేశాలపై ఎంత తీవ్రంగా ఉంటుందో నేపాల్‌లో జరిగిన జలప్రళయం మరోసారి స్పష్టం చేసింది. టిబెట్‌లో మంచు చరియలు, భారీగా మంచు-రాళ్లు కూలిపోవడం వల్ల ఒక్కసారిగా నీరు దిగువకు దూసుకురావడంతో నేపాల్‌లోని నదీ పరివాహక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగాస వందలాది మంది గల్లంతయ్యారు. అయితే ఈ విపత్తు ఇప్పుడు మరో కీలక అంశాన్ని తెరపైకి తెచ్చింది. టిబెట్‌లో జరిగిన పరిణామంపై సకాలంలో సమాచారం అందకపోవడం వల్ల నష్టం పెరిగిందన్న నేపాల్‌ ఆరోపణలు భారత్‌కూ ఆందోళన కలిగిస్తున్నాయి. కారణం- టిబెట్‌లోనే బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్తు ప్రాజెక్టు.

ముందస్తు సమాచారం ఎందుకు రాలేదు?
నేపాల్‌ వాదన ప్రకారం, టిబెట్‌లోని కెరుంగీ ప్రాంతంలో ఉదయం భారీ వరద సంభవించింది. అక్కడి నుంచి నీటి ప్రవాహం నేపాల్‌ వైపు రావడానికి కొంత సమయం ఉన్నప్పటికీ తమకు ముందస్తు హెచ్చరిక అందలేదని నేపాల్‌ అధికారులు చెబుతున్నారు. స్థానికుల నుంచి సమాచారం అందిన తర్వాతే విపత్తు నిర్వహణ అధికారులు అప్రమత్తమయ్యారు. అప్పటికే వరద ప్రవాహం దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. తర్వాత చైనా నుంచి నేపాల్‌కు సమాచారం వచ్చింది. టిబెట్‌ వైపు నదిలో మంచు, కొండచరియలు విరిగిపడటంతో భోటేకోషీ, త్రిశూలి నదులకు ప్రమాదం ఏర్పడిందన్నది ఆ సమాచార సారాంశం. అయితే ఈ సమాచారం ముందుగానే అందించి ఉంటే ప్రాణనష్టం కొంతైనా తగ్గించవచ్చని నేపాల్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే అంశం ఇప్పుడు భారత్‌ విషయంలోనూ కీలకంగా మారింది.

"నేపాల్​ విపత్తుకు చైనాను బాధ్యులను చేయలేం. ఇరు దేశాల మధ్య ఆ ఒప్పందం లేదు. కానీ సమాచారం అందించి ఉంటే ప్రాణ నష్టం తగ్గేది"
-- నిపుణులు

బ్రహ్మపుత్రపై చైనా మెగా ప్రాజెక్టు
టిబెట్‌లో యార్లంగ్‌ జాంగ్బోగా పిలిచే నది, అరుణాచల్‌ప్రదేశ్‌లోకి ప్రవేశించిన తర్వాత సియాంగ్‌గా, అనంతరం అస్సాంలో బ్రహ్మపుత్రగా మారుతుంది. ఈ నదిపైనే చైనా భారీ జలవిద్యుత్తు ప్రాజెక్టును నిర్మిస్తోంది. మెడోగ్‌ లేదా మోటువో జలవిద్యుత్తు ప్రాజెక్టుగా పిలుస్తున్న ఈ నిర్మాణం పూర్తయితే దాదాపు 60 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాలని బీజింగ్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 167 బిలియన్‌ డాలర్లు. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్తు ప్రాజెక్టుగా ఉన్న త్రీగోర్జెస్‌ డ్యామ్‌ కంటే కూడా ఇది భారీ స్థాయిలో ఉండనుంది. యార్లంగ్‌ జాంగ్బో నది టిబెట్‌లో భారీ వంపు తీసుకునే ప్రాంతంలో లోతైన లోయలోకి వేగంగా దిగుతుంది. ఈ సహజ భౌగోళిక పరిస్థితులనే విద్యుత్తు ఉత్పత్తికి ఉపయోగించుకోవాలని చైనా భావిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు పరిమాణం కంటే అది నిర్మిస్తున్న ప్రాంతమే భారత్‌ ఆందోళనకు ప్రధాన కారణం.

డ్యామ్‌ కింద యాక్టివ్‌ ఫాల్ట్‌?
చైనా ప్రభుత్వ భూగర్భ సర్వేకు అనుబంధంగా ఉన్న శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో మెడోగ్‌ ప్రాజెక్టు ప్రాంతంలో పైజెన్‌ ఫాల్ట్‌ ఉన్నట్లు గుర్తించినట్టు నివేదికలు వెల్లడించాయి. ఈ భౌగోళిక పగులు గతంలోనూ చురుగ్గా ఉన్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. హిమాలయ ప్రాంతం ఇప్పటికే భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతం. భారత, యురేషియా భూఫలకాలు ఢీకొంటున్న ప్రాంతంలోనే ఈ భారీ నిర్మాణం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భూకంపం సంభవిస్తే డ్యామ్‌ నిర్మాణంతో పాటు సొరంగాలు, రహదారులు, వంతెనలు, ఇతర మౌలిక వసతుల భద్రతపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇటీవల నేపాల్‌లో చోటుచేసుకున్న ఘటన ఈ భయాలను మరింత పెంచింది. తొలుత భూకంపం వల్లే వరద సంభవించిందని భావించినప్పటికీ అమెరికా భూగర్భ సర్వే ప్రకారం హిమనీ ప్రాంతం కూలిపోవడం, దాని వెంట మంచు, మట్టి, రాళ్ల భారీ ప్రవాహం దిగువకు రావడం విపత్తుకు కారణమైంది. అంటే హిమాలయాల్లో భూకంపమే కాకుండా మంచు చరియలు, హిమనీ సరస్సుల బద్ధలవడం, కొండచరియలు వంటి పరిణామాలు కూడా ఒక్కసారిగా భారీ వరదలకు దారితీయవచ్చు.

భారత్‌కు వరద ముప్పు మాత్రమే కాదు
మెడోగ్‌ డ్యామ్‌పై భారత్‌ ఆందోళన కేవలం వరదలకే పరిమితం కాదు. బ్రహ్మపుత్ర నీటి ప్రవాహంపై ఎగువ ప్రాంతంలో చైనాకు నియంత్రణ పెరగడమే అసలు వ్యూహాత్మక సమస్య. భారీ వర్షాలు కురిసే సమయంలో రిజర్వాయర్‌ నుంచి ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువన ఉన్న అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాం ప్రాంతాల్లో వరద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు పొడి కాలంలో నీటి విడుదలను తగ్గిస్తే సాగునీరు, తాగునీరు, చేపల వేట, స్థానిక పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం పడవచ్చు. అయితే బ్రహ్మపుత్ర నదికి భారత్‌లోకి వచ్చిన తర్వాత అనేక ఉపనదులు కలుస్తాయి. అందువల్ల నది మొత్తం నీటి పరిమాణంపై టిబెట్‌ నుంచి వచ్చే ప్రవాహం ఒక్కటే ఆధారం కాదు. అయినప్పటికీ ఎగువ ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని ప్రభావితం చేసే సామర్థ్యం చైనాకు ఉండటం భారత్‌కు వ్యూహాత్మకంగా ఆందోళన కలిగించే అంశమే.

సమాచార మార్పిడే కీలకం
ఇక్కడ మరో సమస్య భారత్‌-చైనా మధ్య నదీజల సమాచార మార్పిడి. ఇరు దేశాల మధ్య సమగ్ర నదీజల భాగస్వామ్య ఒప్పందం లేదు. కొన్ని జలశాస్త్ర సమాచారాన్ని పంచుకునే అవగాహన వ్యవస్థ ఉన్నప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో రియల్‌టైమ్‌ హెచ్చరికలు ఇచ్చే సమగ్ర యంత్రాంగం లేదు. నేపాల్‌లో జరిగిన ఘటనతో ఈ లోపం మరోసారి స్పష్టమైంది. టిబెట్‌లో ఏదైనా ప్రకృతి విపత్తు జరిగితే దాని ప్రభావం భారత్‌కు చేరడానికి ముందే సమాచారం అందడం అత్యంత కీలకం. ముఖ్యంగా బ్రహ్మపుత్ర వంటి అంతర్జాతీయ నదిపై భారీ డ్యామ్‌ నిర్మాణం జరుగుతున్న సమయంలో నీటి మట్టాలు, ప్రవాహం, డ్యామ్‌ నుంచి విడుదల, భూకంప కార్యకలాపాలు వంటి సమాచారాన్ని నిరంతరం పంచుకోవాల్సిన అవసరం ఉంది.

భారత్‌ ముందస్తు వ్యూహం
చైనా ప్రాజెక్టు నేపథ్యంలో భారత్‌ కూడా తనవంతు వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో సియాంగ్‌ అప్పర్‌ మల్టీపర్పస్‌ ప్రాజెక్టును నిర్మించేందుకు భారత్‌ ముందుకు సాగుతోంది. దాదాపు 11 వేల మెగావాట్ల సామర్థ్యంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు విద్యుత్తు ఉత్పత్తితో పాటు నీటి ప్రవాహాన్ని నిర్వహించడంలో వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే రెండు దేశాలు పోటాపోటీగా భారీ డ్యామ్‌లు నిర్మించడం ఒక్కటే పరిష్కారం కాదని నిపుణుల అభిప్రాయం. సరిహద్దు నదులపై పారదర్శక సమాచార మార్పిడి, ముందస్తు హెచ్చరిక వ్యవస్థ, భూకంప పర్యవేక్షణ, హిమనీ ప్రాంతాల నిరంతర అధ్యయనం, అత్యవసర పరిస్థితుల్లో సమన్వయం వంటి అంశాలపై భారత్‌-చైనా మధ్య స్పష్టమైన వ్యవస్థ అవసరం.

నేపాల్‌ జలప్రళయం ఒక ప్రాంతీయ ప్రకృతి విపత్తుగా మొదలై ఇప్పుడు హిమాలయాల్లో నీటి భద్రత, విపత్తు నిర్వహణ, చైనా భారీ డ్యామ్‌ ప్రాజెక్టులపై అంతర్జాతీయ చర్చకు దారితీసింది. ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా ఆపడం ఎవరి చేతుల్లోనూ ఉండదు. కానీ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి సమాచారం పంచుకుని, దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేయడం మాత్రం సాధ్యమే. అందుకే నేపాల్‌లో జరిగిన ఘటన భారత్‌కు ఒక స్పష్టమైన హెచ్చరికగా నిలుస్తోంది. బ్రహ్మపుత్రపై చైనా నిర్మిస్తున్న మెగా డ్యామ్‌ భవిష్యత్తులో ఎంతటి ప్రభావం చూపుతుందన్నది పక్కన పెడితే ఆ ప్రాజెక్టు చుట్టూ ఉన్న భౌగోళిక ప్రమాదాలు, నీటి ప్రవాహంపై నియంత్రణ, సమాచార పారదర్శకత వంటి అంశాలపై ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం స్పష్టమవుతోంది.

నేపాల్‌ వరదలకు భూకంపం కారణం కాదు- హిమానీనదం కూలిపోవడమే: అమెరికా సర్వే

నేపాల్​లో వరద బీభత్సం- సుమారు 100 మంది మృతి- 133 మంది భారతీయులు గల్లంతు!