ETV Bharat / bharat

ఆకస్మిక వరద ముప్పు- అప్రమత్తమైన ఎన్​డీఆర్‌ఎఫ్ బృందాలు- ఆ రాష్ట్రాల్లో హై అలర్ట్​!

నేపాల్‌లో గ్లోఫ్‌ కారణంగా దిగువ ప్రాంతాలకు వరద ముప్పు- బిహార్, యూపీ అప్రమత్తమైన అధికారులు- గండక్ నదిలో వరద నీటి ప్రవాహంపై నిశితంగా పర్యవేక్షణ

High Alert In Nepal
నేపాల్​లో వరదలు (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : August 27, 2026 at 7:30 AM IST

4 Min Read
Choose ETV Bharat

High Alert At Nepal Floods : నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు, హిమానీనద సరస్సు ఉప్పొంగడం (గ్లోఫ్‌)తో గండక్ నదికి వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. బిహార్, ఉత్తరప్రదేశ్​ రాష్ట్రాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్​డీఆర్‌ఎఫ్‌) బృందాలను మోహరించారు. ఈ రెండు రాష్ట్రా​ల్లో మొత్తం 20 బృందాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. గండక్ నది ద్వారా వరద నీరు దిగువ ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉండటంతో నది ప్రవాహాన్ని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

నేపాల్‌లో ఒక్కసారిగా వచ్చిన వరదతో పాటు నేపాల్- చైనా సరిహద్దుకు సమీపంలోని హిమానీనద సరస్సు ఉప్పొంగి వరద రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల నేపాల్‌లో వరద నీరు దిగువ ప్రాంతాలకు ప్రవహిస్తోంది. ఈ నీరు గండక్ నదిలోకి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సిద్ధంగా ఉన్న సహాయక చర్యలు
వరద ముప్పును దృష్టిలో ఉంచుకుని ఎన్​డీఆర్‌ఎఫ్ తన బృందాలను అత్యంత అప్రమత్తంగా ఉంచింది. వరద పరిస్థితి తీవ్రతకు అనుగుణంగా మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఎన్​డీఆర్‌ఎఫ్ కమాండెంట్ జ్ఞానేశ్వర్ సింగ్ మాట్లాడుతూ, టిబెట్- నేపాల్ సరిహద్దు ప్రాంతాన్ని గ్లోఫ్ ప్రభావితం చేసిందని తెలిపారు. అనంతరం వరద నీరు నేపాల్‌లోని దిగువ ప్రాంతాల వైపు ప్రవహిస్తోందని చెప్పారు.

"ఒక గ్లోఫ్ (హిమానీనద సరస్సు వరద) టిబెట్-నేపాల్ సరిహద్దును, ఆ తర్వాత నేపాల్‌లోని దిగువ ప్రాంతాలను తాకింది. ఇది గండక్‌ను కూడా తాకే అవకాశం ఉంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనిని పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిస్థితిని అంచనా వేస్తోంది."
- జ్ఞానేశ్వర్ సింగ్, ఎన్​డీఆర్‌ఎఫ్ కమాండెంట్

ఆ రెండు రాష్ట్రాల్లో హై అలర్ట్​!
ఎన్​డీఆర్‌ఎఫ్ ప్రకారం, భారత సరిహద్దుకు సుమారు 160 కి.మీల దూరంలో ఉన్న నేపాల్‌లోని ఫుర్కే ఖోలా వద్ద త్రిశూలి నది నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగింది. నేపాల్- చైనా సరిహద్దు సమీపంలో గ్లోఫ్ కార్యకలాపాలు జరుగుతున్నాయని అనుమానిస్తున్న నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. గండక్ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న బిహార్‌లోని పశ్చిమ చంపారన్, ముజఫర్‌పుర్ జిల్లాలకు రెండు ఎన్​డీఆర్‌ఎఫ్ బృందాలను పంపారు. యూపీలో ప్రభావితమయ్యే అవకాశం ఉన్న కుషీనగర్ ప్రాంతం గండక్ నది ఒడ్డున ఉంది. బిహార్‌లో తొమ్మిది ఎన్​డీఆర్‌ఎఫ్ బృందాలను, ఉత్తరప్రదేశ్‌లో మరో 11 బృందాలను మోహరించినట్లు ఎన్​డీఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ నరేంద్ర సింగ్ బుందే తెలిపారు.

ఎస్ఎస్‌బీ కూడా అప్రమత్తం
నేపాల్‌లో ఆకస్మికంగా సంభవించిన వరదల నేపథ్యంలో, భారత్- నేపాల్ సరిహద్దు వెంబడి మోహరించిన తమ దళాలను సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) అప్రమత్తం చేసింది. తక్షణ సహాయక చర్యల కోసం ఈ దళానికి చెందిన 11 రెస్క్యూ అండ్ రిలీఫ్ టీమ్‌లను (ఆర్ఆర్​టీ) అప్రమత్తం చేయగా, అదనంగా మరో ఏడు బృందాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

వరదలో 384 మంది గల్లంతు
నేపాల్‌లోని రసువా ప్రాంతంలో భోటే కోసి నదిలో అకస్మాత్తుగా సంభవించిన వరదలో సుమారు 105 మంది భారతీయులు గల్లంతైనట్లు నేపాల్ టూరిజం బోర్డు తెలిపింది. పర్యాటక, ప్రయాణ సంస్థల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ఆధారంగా ప్రభావిత ప్రాంతాల నుంచి 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ జాతీయులు కలిపి మొత్తం 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు పర్యాటక బోర్డు తెలిపింది. ఇందులో 37 మంది ప్రవాస భారతీయుల వివరాలు కూడా ఉన్నట్లు పేర్కొంది.

పౌరులకు అండగా ఉంటాం: సీఎం
ఇదిలా ఉండగా, నేపాల్‌లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజల పరిస్థితిపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం దృష్టి సారించింది. సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తన పౌరులకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తెలిపారు. చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అలాగే నేపాల్‌లో చిక్కుకుపోయిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రజలు లేదా వారి కుటుంబ సభ్యులు సహాయం, సమాచారం కోసం విపత్తు నిర్వహణ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. 1070 లేదా +91-771-2223471 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

బిహార్‌తో సమన్వయం ముమ్మరం
ఈ పరిణామాల నేపథ్యంలో బిహార్‌తో సమన్వయాన్ని ముమ్మరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరితో ఫోన్‌లో మాట్లాడారు. వరద సంబంధిత అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి సాధ్యమైనంత సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం నేపాల్‌లో వరద పరిస్థితి, గండక్ నదిలో నీటి ప్రవాహాన్ని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. అవసరానికి అనుగుణంగా సహాయక చర్యలను మరింత విస్తరించేందుకు ఎన్​డీఆర్‌ఎఫ్, ఎస్ఎస్‌బీ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

ఈ వరదల కారణంగా 162 మంది మృతి చెందగా, 750 మందికిపైగా గల్లంతయ్యారు. వారిలో 130 మందికిపైగా భారతీయులు ఉన్నారు. ఇందులో 77 మంది ఈశా ఫౌండేషన్ యాత్రికులు ఉన్నారు. కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్లిన 59 మంది, వారితో ఉన్న కోల్‌కతాకు చెందిన 32 మంది సహా పశ్చిమ బంగాల్‌కు చెందిన అనేక మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. తమిళనాడుకు చెందిన 57 మంది పర్యాటకుల్లో 37 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని, మిగిలిన 20 మంది సురక్షితంగా ఉన్నారని రాష్ట్ర అధికారులు తెలిపారు. కేరళకు చెందిన 36 మంది సభ్యుల బృందం సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. నేపాల్​లో చిక్కుకున్న మాహారాష్ట్రకు చెందిన ఏడుగురిలో నలుగురు క్షేమంగా ఉన్నారని సమాచారం. అలాగే సిక్కిం, ఒడిశాకు చెందిన పలువురి కోసం కూడా ఆయా ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టి, బాధితుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచాయి.

ఐరాస కమిటీ ఆరోపణల్ని ఖండించిన భారత్- రోహింగ్యా, మైనార్టీ హక్కుల నివేదికపై తీవ్ర ఆగ్రహం!

2000ఏళ్ల నాటి 'సోనా మోతీ' గోధుమ సాగు- క్వింటాల్ ధర రూ.12,000- యువ రైతులకు లాభాలపంట!