సుప్రీం ఆదేశాలతో దిగొచ్చిన NCERT- 8వ తరగతి సోషల్ సైన్స్‌లో న్యాయ వ్యవస్థ అధ్యాయంలో పూర్తిగా మార్పులు
8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకాన్ని సవరించిన NCERT- న్యాయ వ్యవస్థపై వివాదాస్పద అంశాలు పూర్తిగా తొలగింపు- సుప్రీం కోర్టు జోక్యంతో మార్పులు

Published : July 7, 2026 at 5:49 PM IST
NCERT Revised Class 8 Social Science Textbook : న్యాయవ్యవస్థపై వివాదానికి దారితీసిన 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకాన్ని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) పూర్తిగా సవరించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వివాదాస్పద అంశాల్ని తొలగించి కొత్త అధ్యాయాన్ని విడుదల చేసింది. న్యాయ వ్యవస్థలో అవినీతి, కోర్టుల్లో భారీగా కేసుల పెండింగ్, కీలక తీర్పులకు సంబంధించిన అంశాల్ని తొలగించగా- ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL), ట్రైబ్యునల్స్, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలపై కొత్త సమాచారాన్ని చేర్చింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలోని ఛాప్టర్ 4 అయిన 'ది రోల్ ఆఫ్ ది జ్యుడిషియరీ ఇన్ సొసైటీ (సమాజంలో న్యాయ వ్యవస్థ పాత్ర)' అధ్యాయంలో న్యాయ వ్యవస్థలో అవినీతి, కేసుల పెండింగ్, మౌలిక వసతుల కొరత, న్యాయమూర్తుల కొరత వంటి అంశాలు ఉండటంతో తీవ్ర వివాదం చెలరేగింది. ఈ అధ్యాయం- న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపైనే సుప్రీం కోర్టు సుమోటాగా విచారణ చేపట్టింది. అనంతరం సోషల్ సైన్స్ బుక్‌కు సంబంధించిన ముద్రణ పూర్తయిన అలాగే డిజిటల్ కాపీలు అన్నింటినీ వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఇంకా ఆ పుస్తకాన్ని మళ్లీ ముద్రించడం, డిజిటల్ రూపంలో ప్రచురించడం లేదా పంపిణీ చేయడంపై పూర్తి నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో NCERT కూడా క్షమాపణలు చెప్పింది.
కొత్త పుస్తకంలో ఏం మారింది?
సవరించిన పాఠ్య పుస్తకంలో పలు కీలక మార్పులు చేశారు. 'స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఎందుకు అవసరం?' అనే ప్రారంభ ప్రశ్నను తొలగించి 'న్యాయబద్ధమైన, సామరస్యపూరకమైన సమాజం కోసం అసలు న్యాయం ఎందుకు అవసరం? అనే కోణంలో కొత్త అంశాన్ని చేర్చారు. ఇంకా 'న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు (Challenges Faced by the Judicial System)' అనే విభాగాన్ని పూర్తిగా తొలగించారు. ఇందులో కోర్టుల్లో కేసుల భారీ పెండింగ్‌కు న్యాయమూర్తుల కొరత, క్లిష్టమైన న్యాయ ప్రక్రియ, బలహీనమైన మౌలిక వసతులే కారణమని పేర్కొన్నారు. ఈ అంశాలు ఇప్పుడు పుస్తకంలో లేవు. అసలు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో అవినీతి (Corruption in Judiciary) అనే విభాగాన్ని కూడా పూర్తిగా తొలగించారు. ఈ భాగంలో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ- 'న్యాయ వ్యవస్థలో అవినీతి, దుర్వినియోగం జరిగే సందర్భాలు ఉన్నాయని' పేర్కొన్నారు. ఈ అంశాలే తీవ్ర వివాదానికి దారితీశాయి.
కొత్తగా చేర్చిన అంశాలివే
తాజా ఎడిషన్‌లో విద్యార్థులకు న్యాయ వ్యవస్థపై సమగ్ర అవగాహన కల్పించే ఉద్దేశంతో పలు కొత్త అంశాల్ని చేర్చారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (PIL- పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్), ప్రజలకు న్యాయం అందుబాటులోకి తీసుకురావడంలో న్యాయ వ్యవస్థ పాత్ర, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలు (ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్- ADR), ట్రైబ్యునల్స్ వంటి అంశాల్ని వివరంగా పొందుపరిచారు. కొత్త పుస్తకంలోని ప్రచురణ గమనికలో - 'సుప్రీం కోర్టు సుమోటో రిట్ పిటిషన్ (సివిల్) నం.1/2026 లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం సమీక్ష నిర్వహించి ఈ పుస్తకాన్ని విడుదల చేసినట్లు ఎన్‌సీఈఆర్‌టీ పేర్కొంది. కేంద్ర విద్యా శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మార్చి 16న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 'ది రోల్ ఆఫ్ ది జ్యుడీషియరీ ఇన్ సొసైటీ' అధ్యాయాన్ని పూర్తిగా రీరైట్ చేసినట్లు వెల్లడించింది.
ముగ్గురు నిపుణుల పేర్లు తొలగింపు
గతంలో విడుదలైన పుస్తక రూపకల్పన బృందంలో మొత్తం 51 మంది సభ్యులు ఉండగా, తాజా సవరించిన ఎడిషన్‌లో 48 మంది మాత్రమే ఉన్నారు. వివాదాస్పద అధ్యాయానికి బాధ్యత వహించినట్లు భావించిన మిషెల్ డానినో, సుపర్ణా దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్ పేర్లను జాబితా నుంచి NCERT తొలగించింది. ఈ మార్పులతో 8 వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలోని న్యాయ వ్యవస్థ అధ్యాయాన్ని పూర్తిగా కొత్త రూపంలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

