'ఆ బుక్ ఎవరి దగ్గరైనా ఉంటే ఇచ్చేయండి- వివాదాస్పద అధ్యాయంపై ఆన్‌లైన్ పోస్ట్‌లను తొలగించండి'- NCERT అడ్వైజరీ జారీ
సుప్రీంకోర్టు తీర్పు ఎఫెక్ట్- కీలక నిర్ణయం తీసుకున్న NCERT- సుప్రీంకోర్టు నిషేధించిన బుక్ ఎవరి దగ్గరైనా ఉంటే తమకిచ్చేయాలని ఆడ్వైజరీ జారీ

Published : February 27, 2026 at 9:25 PM IST
NCERT Issues Advisory : న్యాయవ్యవస్థలో అవినీతికి సంబంధించిన అంశాలు ఉన్న ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి పాఠ్యపుస్తకంపై సుప్రీంకోర్టు పూర్తిస్థాయి నిషేధం విధించిన నేపథ్యంలో కీలక పరిణామం జరిగింది. సుప్రీంకోర్టు నిషేధించిన పాఠ్యపుస్తకం కాపీలు ఎవరి దగ్గరైనా ఉంటే వాటిని తమ ప్రధాన కార్యాలయానికి తిరిగి ఇవ్వాలని ఎన్‌సీఈఆర్‌టీ శుక్రవారం అడ్వైజరీ జారీ చేసింది. అలాగే ఈ పుస్తకంలోని నిషేధిత కంటెంట్‌ను కలిగి ఉన్న అన్ని సోషల్ మీడియా పోస్టులను తొలగించాలని కోరింది.
"'ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్' అనే పాఠ్యపుస్తకాన్ని కలిగి ఉన్న ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా దానిని ఎన్‌సీఈఆర్‌టీ ప్రధాన కార్యాలయానికి తిరిగి ఇవ్వాలి. సోషల్ మీడియాలో లేదా ఏదైనా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆ పుస్తకంలోని 'మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర' అనే అధ్యాయానికి సంబంధించిన కంటెంట్‌ను షేర్ లేదా పోస్టు చేస్తే దాన్ని వీలైనంత త్వరగా తొలగించండి" అని ఎన్‌సీఈఆర్‌టీ అడ్వైజరీ జారీ చేసింది.
అసలేంటీ వివాదం?
వివాదాస్పద ఎన్‌సీఈఆర్‌టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్య పుస్తకంలో అవినీతి, భారీగా పేరుకుపోయిన కేసులు, సరిపడా సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడం వంటివి న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లుగా అభివర్ణించారు. అంతేకాదు న్యాయ వ్యవస్థలో అవినీతి అనే సబ్ చాప్టర్‌ను పెట్టారు. ఇదే తీవ్ర వివాదానికి కారణమైంది. అందుకే ఈ పాఠ్య పుస్తకాన్ని సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది. అంతే కాదు ఫిజికల్, డిజిటల్ రూపంలో ఉన్న అన్ని కాపీలను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తాము రూపొందించిన 8వ తరగతి పాఠ్యపుస్తకంలో 'అనుచిత కంటెంట్ ఉండడం'పై ఎన్‌సీఈఆర్‌టీ కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు క్షమాపణలు తెలియజేసింది. అనుచిత కంటెంట్ ఉన్న సదరు పాఠ్యాంశాన్ని బుక్ నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. ఎన్‌సీఈఆర్‌టీ క్షమాపణలు చెప్పిన మరుసటి రోజే ఎన్‌సీఈఆర్‌టీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ విరుచుకుపడింది. "వారు తుపాకీతో కాల్చారు. న్యాయవ్యవస్థ రక్తమోడుతోంది" అంటూ ఎన్‌సీఈఆర్‌టీపై మండిపడింది.
వారికి షోకాజ్ నోటీసులు
పిల్లల పాఠ్యపుస్తకంలో 'న్యాయవ్యవస్థలో అవినీతి' అనే సబ్ చాప్టర్‌ను చేర్చినందుకు విద్యామంత్రిత్వశాఖ కార్యదర్శికి, ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీకి గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. కోర్టు ధిక్కార చర్యలు, ఇతర చట్టాల కింద వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వాస్తవానికి ఇప్పటికే ఎన్‌సీఈఆర్‌టీ క్షమాపణలు చెప్పినప్పటికీ, ఈ అంశంపై సుమోటోగా చేపట్టిన విచారణను నిలిపివేయడానికి నిరాకరించింది సుప్రీంకోర్టు. అంతేకాదు ఈ ఉత్తర్వులు ఉల్లంఘించే ఏ ప్రయత్నమైనా న్యాయ పరిపాలనలో నేరుగా జోక్యం చేసుకున్నట్లు, కోర్టు ధిక్కార చర్యలు చేపట్టినట్లే భావిస్తామని పేర్కొంది.
స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
అలాగే ఈ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం స్పందించారు. ఈ వివాదాస్పద అంశాన్ని పిల్లల పాఠ్యాంశంగా రూపొందించిన వారిని బాధ్యులుగా చేస్తామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గురువారం తెలిపారు. ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థపై పూర్తి గౌరవం ఉందన్నారు. న్యాయ వ్యవస్థను అగౌరవపరిచే ఉద్దేశం ఏమాత్రం లేదని తమ సర్కార్‌కు లేదని వెల్లడించారు.
ఆర్ఎస్ఎస్ చర్యలపై విచారణ జరపాలి : కాంగ్రెస్
అలాగే ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకంలో 'న్యాయవ్యవస్థలోని అవినీతి' అంశాన్ని చేర్చడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని కాంగ్రెస్ సమర్థించింది. గత దశాబ్ద కాలంగా పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఆర్‌ఎస్ఎస్ సాగించిన దుర్మార్గపు, ద్వేషపూరిత చర్యలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పాఠం- సుప్రీంకోర్టు సీరియస్- క్షమాపణలు చెప్పిన NCERT
'న్యాయ వ్యవస్థలో అవినీతి'పై NCERT బుక్‌లో ఛాప్టర్- సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

