'ఆపరేషన్ సిందూర్‌లో చైనా పాత్రపై గందరగోళం'- మాజీ CDS వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రశ్నలు
ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా-పాక్ పాత్రపై భిన్న వ్యాఖ్యలు- దేశ ప్రజల్లో అయోమయం నెలకొందన్న జైరాం రమేశ్- కథనాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోందా అంటూ మోదీ ప్రభుత్వంపై ప్రశ్నలు

Published : August 27, 2026 at 7:38 PM IST
Congress On General Chauhan Remarks : ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా- పాకిస్థాన్ మధ్య సైనిక సహకారంపై మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రశ్నలు వర్షం కురిపించింది. గతంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు, తాజాగా అనిల్ చౌహాన్ చెప్పిన అంశాలకు పొంతన లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు గతేడాది రాహుల్ సింగ్ చేసిన వ్యాఖ్యలు, తాజాగా అనిల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను జైరాం రమేశ్ ఎక్స్‌లో షేర్ చేశారు. చైనా- పాక్ సైనిక సహకారంపై భిన్నమైన వాదనలు ఎందుకు వినిపిస్తున్నాయని ప్రశ్నించారు.
2025 జులై 4న లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా-పాకిస్థాన్ మధ్య ఉన్న సహకారం గురించి తీవ్రంగా ప్రస్తావించారని జైరాం రమేశ్ గుర్తుచేశారు. అయితే 2026 ఆగస్టు 25న మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. ఇక్కడ ఏం జరుగుతోంది? కథనాన్ని మార్చేందుకు ఏదైనా లోతైనా ప్రణాళిక ఉందా? దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. చైనాతో సంబంధాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కూడా ఆయన విమర్శలు చేశారు. చైనా విషయంలో మోదీ ప్రభుత్వం రాజీ ధోరణిని అనుసరిస్తోందా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.
On July 4 2025, the Deputy Chief of Army Staff Lt. Gen Rahul Singh had revealed the very disturbingly deep nature of the Pakistan-China jugalbandi during Operation Sindoor.
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 27, 2026
On Aug 25, 2026, the former Chief of Defence Staff Gen. Anil Chauhan made his own revelations on this… pic.twitter.com/E5QAbOsapN
'చైనా పాక్‌కు అన్ని విధాలా సహకరించింది'
2025లో లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ చేసిన వ్యాఖ్యలను జైరాం రమేశ్ ప్రస్తావించారు. మే 7 నుంచి 10 వరకు భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఘర్షణను చైనా ఆయుధ వ్యవస్థలను పరీక్షించుకునే 'లైవ్ ల్యాబ్'గా ఉపయోగించుకుందని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు చైనా అన్ని విధాలా మద్దతు అందించిందని, తుర్కియే కూడా ఆయుధ సామగ్రిని సరఫరా చేసిందని ఆయన పేర్కొన్నారు. పాక్ ముందుండి పోరాడుతున్నప్పటికీ, చైనా, తుర్కియే మద్దతుతో భారత్ ఒకేసారి కనీసం ముగ్గురు ప్రత్యర్థులను ఎదుర్కొందని తెలిపారు. పాకిస్థాన్ సైన్యానికి చైనా ఉపగ్రహాల ద్వారా భారత సైనిక మోహరింపులపై సమాచారం అందిందని కూడా రాహుల్ సింగ్ అప్పట్లో పేర్కొన్నట్లు గుర్తు చేశారు.
'చైనా సిబ్బంది ఉండటం సహజమే'
అయితే తాజాగా అనిల్ చౌహాన్ దీనిపై భిన్నమైన వివరణ ఇచ్చారు. పాకిస్థాన్ వద్ద ఉన్న సైనిక ప్లాట్ఫామ్ల్లో దాదాపు 70 నుంచి 80 శాతం చైనా తయారీకి చెందినవేనని తెలిపారు. విదేశీ ఆయుధ వ్యవస్థలను ఒక దేశం కొనుగోలు చేసినప్పుడు వాటి నిర్వహణ, మరమ్మతులు, సాంకేతిక సేవల కోసం ఆయా తయారీ సంస్థల ప్రతినిధులు అక్కడ ఉండటం సాధారణమేనని వివరించారు. యుద్ధ సమయంలో ఆయుధ వ్యవస్థలు పనిచేసేలా చూసే బాధ్యత ఆయా సంస్థలపై ఉంటుందని చెప్పారు. పాకిస్థాన్‌లో చైనా ఆయుధ తయారీ సంస్థల ప్రతినిధులు ఉండటం విషయాన్ని చైనా కూడా అంగీకరించిందని, ఇందులో కొత్త విషయం ఏమీ లేదని చౌహాన్ అన్నారు. ఇదే విధంగా భారత్‌లోనూ రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్‌కు చెందిన ఆయుధ సంస్థల ప్రతినిధులు తమ పరికరాల నిర్వహణ కోసం ఉండే అవకాశం ఉందని వివరించారు.
ఉపగ్రహ చిత్రాలపై చౌహాన్ వివరణ
చైనా పాకిస్థాన్ ఉపగ్రహ చిత్రాలను అందించిందన్న అంశంపైనా చౌహాన్ స్పందించారని జైరాం రమేశ్ తెలిపారు. ప్రస్తుతం ఉపగ్రహ చిత్రాలు వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అందువల్ల చైనా ఉపగ్రహ చిత్రాను పాక్‌కు అందించడం ద్వారా ప్రత్యేకంగా ఏదైనా గూఢచార సమాచారాన్ని అందించిందని చెప్పడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై గతంలో సైనిక అధికారులు చేసిన వ్యాఖ్యలతో తాజాగా మాజీ సీడీఎస్ ఇచ్చిన వివరణ మధ్య తేడాలను జైరాం రమేశ్ ఎత్తిచూపారు. ఈ భిన్నమైన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్యనే మరో 25 ఏళ్లు పాటు కొనసాగించాలి'-డీలిమిటేషన్‌పై మోదీకి ఖర్గే లేఖ
రూ.22వేల కోట్ల బకాయిలకు రూ.6.5కోట్ల చెల్లింపు- ఇది హెయిర్ కట్ కాదు, పూర్తి గుండు: కాంగ్రెస్

