ETV Bharat / bharat

దుప్పటి నుంచి లేవలేక కొత్త ఆవిష్కరణ! వాయిస్ కమాండ్‌తో ఫ్యాన్లు, లైట్లు బంద్- ఇంటికో 'స్మార్ట్ బ్రెయిన్'

నలంద విద్యార్థి 'స్మార్ట్' ప్రయోగం- వాయిస్ కమాండ్‌తో ఫ్యాన్లు, లైట్లు బంద్ - చలికాలం బద్ధకమే ప్రేరణ అంటున్న యువ శాస్త్రవేత్త

Etv BharatNALANDA STUDENT ANIL ALOK
Bihar Student Invents Smart Brain (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 5, 2026 at 10:00 PM IST

3 Min Read
Choose ETV Bharat

Bihar Student Invents Smart Brain : 'అవసరమే ఆవిష్కరణకు తల్లి' అని అంటారు పెద్దలు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. 'బద్ధకమే ఓ అద్భుతానికి నాంది' పలికింది. చలికాలంలో దుప్పటి ముసుగులోంచి బయటకు రావడానికి బద్ధకించి, ఏకంగా ఇంటికే ఒక 'స్మార్ట్ బ్రెయిన్' తయారుచేశాడు ఓ విద్యార్థి. మనిషిలాగే ఇక ఇళ్లు కూడా సొంతగా ఆలోచిస్తాయని, యజమాని మాట వింటాయని అంటున్నాడు. స్విచ్ బోర్డు దగ్గరకు వెళ్లే పని లేకుండా, కూర్చున్న చోట నుంచే ఇంటిని కంట్రోల్ చేసేలా ఒక పరికరాన్ని ఆవిష్కరించాడు బిహార్‌కు చెందిన అనిల్ అలోక్. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఈ కుర్రాడి ప్రతిభకు కేంద్రం కూడా ఫిదా అయ్యింది.

హాస్టల్ కష్టాలే పాఠాలుగా
నలంద బిహార్ షరీఫ్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన అనిల్ అలోక్ ప్రస్తుతం రాంచీలోని ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. అతడికి హాస్టల్‌లో ఉంటున్నప్పుడు చలికాలంలో ఒక సమస్య వచ్చింది. చలికి దుప్పటి కప్పుకుని పడుకున్నాక, లైట్ లేదా ఫ్యాన్ ఆపాలంటే లేవడానికి చాలా బద్ధకంగా ఉండేది. ఆ చిన్న బద్ధకమే అతడిని ఆలోచింపజేసింది. తన ఇంజినీరింగ్ చదువును, కోడింగ్ నైపుణ్యాన్ని వాడి దీనికి పరిష్కారం వెతికాడు. అదే ఇప్పుడు 'స్మార్ట్ బ్రెయిన్' ఆవిష్కరణకు పునాది వేసింది.

అసలేంటి ఈ 'స్మార్ట్ బ్రెయిన్'?
అనిల్ రూపొందించిన ఈ పరికరానికి 'రోబో' అని పేరు పెట్టాడు. ఇది మన ఇళ్లలో ఉండే పాత స్విచ్ బోర్డుల్లోనే ఇట్టే అమరిపోతుంది. దీని కోసం ఇళ్లంతా వైరింగ్ మార్చాల్సిన పని లేదు. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. 'హే రోబో, ఫ్యాన్ ఆపు' అని మనం అనగానే, అందులోని మైక్రోఫోన్లు మన గొంతును గుర్తుపడతాయి. వెంటనే మైక్రో కంట్రోలర్ ద్వారా సిగ్నల్ పంపి ఫ్యాన్ లేదా లైట్‌ను ఆపేస్తాయి.

ఫీచర్లు అదుర్స్
ఈ పరికరం కేవలం వాయిస్ కంట్రోల్ మాత్రమే కాదు, అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో వై-ఫై, బ్లూటూత్ సదుపాయాలు ఉన్నాయి. మీరు ఆఫీసులో ఉన్నా, లేదా వేరే ఊరు వెళ్లినా, ఇంట్లో గీజర్ లేదా లైట్లు మర్చిపోతే ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనా ఆపేయొచ్చు. ఇది కరెంట్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తుంది. దీనివల్ల విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చు.

RANCHI STUDENT INNOVATION
నలంద విద్యార్థి 'స్మార్ట్' ప్రయోగం (ETV Bharat)

ఎన్నో సవాళ్లను దాటి
ఈ విజయం అనిల్‌కు అంత సులభంగా రాలేదు. ఈ ప్రోటోటైప్ తయారు చేయడానికి నెల రోజులకు పైగా సమయం పట్టింది. మొదట్లో కోడింగ్ ఎర్రర్స్ రావడం, వైరింగ్ తప్పుగా ఇచ్చి పరికరాలు కాలిపోవడం జరిగాయి. అనేక షార్ట్ సర్క్యూట్లను తట్టుకుని, సుమారు రూ.5000 నుంచి రూ.6000 సొంత డబ్బు ఖర్చు చేసి దీన్ని సాధించాడు. 5 వోల్టుల మైక్రో కంట్రోలర్ సాయంతో 220 వోల్టుల గృహోపకరణాలను నియంత్రించడం దీని ప్రత్యేకత. ఝార్ఖండ్‌లో జరిగిన 'యూత్ ఇన్నోవేషన్ ఛాలెంజ్'లో అనిల్ పాల్గొన్నాడు. అక్కడ 57 మంది పోటీదారులను వెనక్కి నెట్టి మొదటి బహుమతి సాధించాడు.

RANCHI STUDENT INNOVATION
నలంద విద్యార్థి 'స్మార్ట్' ప్రయోగం (ETV Bharat)

ఉద్యోగం వద్దు, ఉపాధి ముద్దు
నేటి ఇంజినీరింగ్ విద్యార్థులు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో లక్షల ప్యాకేజీల కోసం కలలు కంటారు. కానీ అనిల్ రూటే సెపరేటు. "నా ఆలోచనలు ఒక పారిశ్రామికవేత్తలా ఉంటాయి. నేను ఉద్యోగం అడిగేవాడిలా కాకుండా, పది మందికి ఉద్యోగం ఇచ్చేవాడిలా ఉండాలనుకుంటున్నాను. నా సొంత స్టార్టప్ పెట్టడమే నా లక్ష్యం" అని అనిల్ చెప్పాడు. ఈ టెక్నాలజీని కేవలం ధనికులకే పరిమితం చేయకుండా, సామాన్య మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి తేవాలన్నది అతని ఆశయం.

NALANDA STUDENT ANIL ALOK
ఈటీవీ భారత్​తో మాట్లాడుతున్న అనిల్ అలోక్ (ETV Bharat)

భవిష్యత్తులో ఏఐతో
అనిల్ ఆవిష్కరణ ఇక్కడితో ఆగిపోలేదు. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించే పనిలో ఉన్నాడు. భవిష్యత్తులో ఈ పరికరం మన అలవాట్లను, బయటి వాతావరణాన్ని అర్థం చేసుకుంటుంది. ఉదాహరణకు, బయట చలిగా ఉంటే, మీరు ఇంటికి వచ్చే సమయానికి అదే ఆటోమేటిక్‌గా గీజర్ ఆన్ చేసి వేడి నీళ్లు సిద్ధం చేస్తుంది. అనిల్ తండ్రి శైలేంద్ర ప్రసాద్, తల్లి ఆశా సిన్హా (టీచర్) తమ కొడుకు సాధించిన విజయం చూసి మురిసిపోతున్నారు. ప్రధాని మోదీ కలలు కన్న 'డిజిటల్ ఇండియా'లో తన వంతు పాత్ర పోషిస్తానని అనిల్ అలోక్ స్పష్టం చేశాడు.

జనావాసాల్లోకి 12 అంగుళాల అరుదైన​ పాము- దాని ప్రత్యేకత ఏమిటంటే?

'అక్కడ పొలం పని జరగాలంటే తుపాకీ పట్టాల్సిందే బ్రో!'- ఎందుకలా? ఏం జరిగింది?