ETV Bharat / bharat

హెల్త్​ అవేర్​నెస్​పై సైకిల్ యాత్ర- 22 రోజుల్లోనే కశ్మీర్ టు కన్యాకుమారి- 3,650 కి.మీ రైడింగ్

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మైసూర్ సైక్లిస్టుల సైకిల్ యాత్ర- 22 రోజుల్లోనే పూర్తి

Kashmir To Kanyakumari Cycle Ride
Kashmir To Kanyakumari Cycle Ride (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : November 2, 2025 at 1:04 PM IST

3 Min Read
Choose ETV Bharat

Kashmir To Kanyakumari Cycle Ride : ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి కర్ణాటకలోని మైసూర్​కు చెందిన 11 మంది సైక్లిస్టుల బృందం నడుం బిగించింది. ఈ మేరకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టింది. రాయల్ రైడర్స్ మైసూర్ సైక్లిస్టుల బృందం కేవలం 22 రోజుల్లోనే 3,650 కిలోమీటర్ల సైకిల్ రైడ్ ను పూర్తి చేసింది. 11 రాష్ట్రాల గుండా ఈ యాత్ర సాగింది.

22 రోజుల్లోనే సైకిల్ యాత్ర కంప్లీట్
మైసూర్ నగరానికి చెందిన రాయల్ రైడర్ మైసూర్ సైక్లిస్టుల బృందం 'వన్ నేషన్ వన్ రైడ్' పేరుతో ఈ ఏడాది సెప్టెంబరు 22న జమ్ముకశ్మీర్​లో సైకిల్ యాత్ర ప్రారంభించింది. 22 రోజుల్లో 3,650 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కన్యాకుమారికి చేరుకుని యాత్రను పూర్తి చేసింది. ఈ సైకిల్ రైడ్ జమ్ముకశ్మీర్, పంజాబ్, హరియాణా, దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా 11 రాష్ట్రాల గుండా సాగింది. కన్యాకుమారిలోని వివేకానంద మోమోరియల్ వద్దకు చేరుకోవడంతో సైకిల్ యాత్ర ముగిసింది. ఈ యాత్ర సమయంలో సైక్లిస్టులు రోజుకు 10 గంటలపాటు సైకిల్ తొక్కేవారు.

Kashmir To Kanyakumari Cycle Ride
రాయల్ రైడర్స్ మైసూర్ సైకిస్టుల బృందం (ETV Bharat)

అన్ని రంగాలవారు ఈ బృందంలో భాగం
అయితే ఈ సైకిల్ యాత్ర చేసిన బృందంలో డెంటిస్ట్ డాక్టర్ బృంద సుహాస్ ఉన్నారు. ఆమె ఈ సైకిల్ రైడ్​లో నోటి ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ రైడ్​కు వెళ్లినవారందరూ 40-55 ఏళ్ల మధ్య వయసున్నవారే. ఈ బృందంలో వైద్యులు, వ్యాపారవేత్తలు సహా మరిన్ని రంగాలకు చెందిన వారు ఉన్నారు. గత ఎనిమిదేళ్లుగా ఈ బృందం దేశంలోని వివిధ ప్రాంతాలకు వార్షిక సైక్లింగ్ యాత్రలను చేపడుతోంది. ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవం నాడు సైకిల్ యాత్ర చేస్తూ ఐక్యత, శాంతి, ఫిట్‌ నెస్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

Kashmir To Kanyakumari Cycle Ride
డెంటిస్ట్ డాక్టర్ బృంద సుహాస్ (ETV Bharat)

'ఈ రైడ్ చిరస్మరణీయం '
అయితే రాయల్ రైడర్స్ మైసూర్ సైక్లింగ్ బృందంలో ఒకరైన డాక్టర్ బృంద సుహాస్ తన అనుభవాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు. ఈ సైకిల్ యాత్ర తమకు చిరస్మరణీయమైన ప్రయాణమని కొనియాడారు. తాము ఈ రైడ్ కోసం ఎనిమిది నెలలు శిక్షణ పొందామని వెల్లడించారు. 22 రోజుల్లో రైడ్​ను పూర్తి చేశామని తెలిపారు.

Kashmir To Kanyakumari Cycle Ride
సైకిల్ ప్రయాణంలో డాక్టర్ బృంద సుహాస్ (ETV Bharat)

'కశ్మీర్ టు కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేశాం'
ఈ సైకిల్ యాత్ర సైక్లింగ్ కోసం మాత్రమే కాదని, దేశంలోని విభిన్న సంస్కృతులు, వాతావరణాలు, ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడిందని డాక్టర్ బృంద సుహాస్ అన్నారు. ఈ రైడ్ సమయంలో తాము సవాళ్లను ఎదుర్కొన్నామని చెప్పారు. "మైసూర్ రాయల్ రైడర్ మైసూర్ బృందం కశ్మీర్ నుంచి కన్యాకుమారికి సైకిల్ రైడ్​ను చేపట్టింది. ఆ బృందంలో సభ్యురాలిగా ఉన్న నాకు ఇది మంచి ఎక్స్​పీరియన్స్. సెప్టెంబర్ 22న మేము కశ్మీర్​లో సైకిల్ యాత్రను ప్రారంభించి కన్యాకుమారిలో పూర్తి చేశాం" అని డాక్టర్ బృంద సుహాస్ వెల్లడించారు.

నోటి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన
ఈ సైకిల్ యాత్ర సమయంలో డాక్టర్ బృంద సుహాస్ ప్రజలకు నోటి ఆరోగ్య అవగాహన సెషన్​లను నిర్వహించారు. ముఖ్యంగా గ్రామీణ పాఠశాలలు, కాలేజీ విద్యార్థులకు నోటి ఆరోగ్యం ఆవశ్యకతను తెలియజేశారు. అలాగే రోడ్డు పక్కన తినుబండారాల దుకాణాల వద్ద ఉన్న ట్రక్ డ్రైవర్లు, స్థానికులతో దంత పరిశుభ్రతను కాపాడుకోవడం గురించి అవగాహన కల్పించారు.

Kashmir To Kanyakumari Cycle Ride
ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న సైకిలిస్ట్ (ETV Bharat)

అలాగే క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల శరీరంగా ఫిట్​గా ఉంటుందని, అలాగే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని డాక్టర్ బృంద సుహాస్ తెలిపారు. నేటి యువత రెగ్యులర్ సైక్లింగ్ చేయాలని పిలుపునిచ్చారు. మంచి నోటి ఆరోగ్యానికి క్రమం తప్పకుండా బ్రష్ చేయడం, దంతాల సంరక్షణ చాలా అవసరమన్నారు. యువత ఫిట్‌ నెస్, మంచి అలవాట్లను స్వీకరించడం ద్వారా ఆరోగ్యంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
28 రాష్ట్రాలు- లక్ష కి.మీల సైకిల్ యాత్ర- యంగ్ సైక్లిస్ట్ సుభోద్ సోలో సాహసం వెనక కారణమిదే!

పచ్చళ్ల బిజినెస్ టు 'పద్మ శ్రీ'- సైకిల్​పై తిరుగుతూ వందలాది మందికి ఉపాధి- 73ఏళ్ల వృద్ధురాలు సక్సెస్ స్టోరీ