స్కూల్‌కు డుమ్మా కొడితే మ్యూజిక్కే మ్యూజిక్- విద్యార్థుల ఇళ్లకు మేళతాళాలతో టీచర్
మారుమూల పల్లెలో విప్లవాత్మక మార్పు- టీచర్ ఇమ్రోజ్ అలీ మెరుపు ఐడియాతో సీన్ రివర్స్- ప్రభుత్వ స్కూలులో పెరిగిన అడ్మిషన్స్- గైర్హాజరయ్యే విద్యార్థుల ఇళ్లకు మేళతాళాలతో టీచర్ ఇమ్రోజ్- పేరెంట్స్ ఎదుటే కౌన్సెలింగ్

Published : February 28, 2026 at 9:46 AM IST
Students Counseling With Music : విద్యార్థులు స్కూలుకు డుమ్మా కొడితే, ఉపాధ్యాయులు దండించడాన్ని, మందలించడాన్ని మనం చూస్తుంటాం. కానీ ఒక ఊరిలో విద్యార్థులు స్కూలుకు డుమ్మా కొడితే, వెంటనే మ్యూజిక్ మోత మోగుతుంది. స్కూలు ఏర్పాటు చేసిన రైడ్ టీమ్ విద్యార్థి ఇంటికి వచ్చి మరీ డోలు, హార్మోనియం, చిడతలు, గిలక్కాయలు, పిల్లనగ్రోవిని మోగిస్తుంది. తమతో పాటు విద్యార్థిని స్కూలుకు తీసుకెళ్తుంది. ఇంతకీ ఇలా ఎక్కడ జరుగుతోంది ? నిరుపేద, అణగారిన వర్గాల విద్యార్థుల డ్రాపౌడ్ రేటును గణనీయంగా తగ్గించిన ఈ మెరుపు ఐడియా ఎవరిది ? దీని గురించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు ? ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆ టీచర్ చొరవ- సీన్ రివర్స్
విద్యార్థుల డ్రాపౌడ్ రేటును తగ్గించేందుకు వినూత్న పద్ధతిని అనుసరిస్తున్న ఆ స్కూలును చూడాలంటే మనం బిహార్‌లోని గయ జిల్లా కొర్మతు గ్రామానికి వెళ్లాలి. ఈ ఊరిలోని ఒక వాడలో పూర్తిగా మహాదళిత వర్గం ప్రజలే నివసిస్తుంటారు. ఈ వర్గం ప్రజలు నేటికీ కడు బీదరికంలో జీవిస్తున్నారు. మహాదళితులు నివసించే ఈ వాడను స్థానికులు మహాదళిత్ టోలా అని పిలుస్తుంటారు. ఈ ఏరియాలోని 80కిపైగా కుటుంబాల పిల్లల కోసం ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. రెండేళ్ల క్రితం, ఈ స్కూలులోని మొత్తం విద్యార్థుల సంఖ్య 100కు లోపే. చదువును మధ్యలోనే మానేసే డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 138కి పెరిగింది. డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఈ మార్పుకు కారణం ఓ టీచర్. ఆయన పేరు ఇమ్రోజ్ అలీ.

విద్యార్థులతో రైడ్ టీమ్
టీచర్ ఇమ్రోజ్ అలీ తొలుత మహాదళిత్ టోలా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరినప్పుడు, పిల్లల డ్రాపౌట్ రేట్ చాలా ఎక్కువగా ఉండేది. ఏటా పిల్లల అడ్మిషన్లు తగ్గిపోతుండేవి. ఆ సమయానికి స్కూలులో సంగీత పరికరాలు కూడా ఉండేవి కావు. దీంతో విద్యార్థుల హాజరును పెంచడానికి టీచర్ ఇమ్రోజ్ అలీ, ఇతర టీచర్లతో కలిసి పిల్లల ఇళ్లకు వెళ్లేవారు. పిల్లలను రోజూ బడికి పంపాలని పేరెంట్స్‌కు కౌన్సెలింగ్ చేసేవారు. చదువు ప్రాధాన్యతను పిల్లలకు వివరించేవారు. ఈక్రమంలో విద్యా శాఖ నుంచి పాఠశాలకు సంగీత పరికరాలు అందాయి. వాటిని వాయించడాన్ని విద్యార్థులకు టీచర్ ఇమ్రోజ్ అలీ నేర్పించారు. అనంతరం స్కూలులోని ఒక్కో క్లాస్‌కు ఒక్కో విద్యార్థి చొప్పున మానిటర్‌లను నియమించారు. ప్రతినెలా క్లాస్ మానిటర్‌ను మార్చే ఏర్పాట్లు చేశారు. స్కూలులోని అన్ని క్లాసులకు చెందిన 15 మంది పిల్లలతో ఒక రైడ్ టీమ్‌ను ఇమ్రోజ్ అలీ ఏర్పాటు చేశారు. మహాదళిత్ టోలా పాఠశాలలో చదివే విద్యార్థులందరి ఇళ్లు అర కిలోమీటరు దూరంలోనే ఉంటాయి. ఒకవేళ ఇద్దరు, ముగ్గురు విద్యార్థులే స్కూలుకు గైర్హాజరైతే, ఈ రైడ్ టీమ్‌లోని 15 మంది విద్యార్థులు కలిసి ఆ పిల్లల ఇళ్లకు వెళ్తారు. సంగీత పరికరాలను కాసేపు వాయించి, ఆ పిల్లలను తమతో పాటు స్కూలుకు తీసుకొస్తారు.

టీచర్ ఇమ్రోజ్ అలీ ఏం చేస్తారో తెలుసా?
ఒకవేళ పెద్దసంఖ్యలో విద్యార్థులు స్కూలుకు గైర్హాజరైతే స్వయంగా టీచర్ ఇమ్రోజ్ అలీ రంగంలోకి దిగుతారు. ఆయన మెడలో డోలు వేసుకొని బయలుదేరుతారు. మిగతా పిల్లల్లో కొంతమంది మెడలో హార్మోనియం వేసుకుంటారు. ఇంకొందరు చిడతలు వాయిస్తారు. మరికొందరు గిలక్కాయలు కొడుతుంటారు. పలువురు స్టూడెంట్స్ ఫ్లూటును ఊదుతారు. ఈవిధంగా డుమ్మా కొట్టిన స్టూడెంట్స్ ఇళ్లలోకి టీచర్ ఇమ్రోజ్ అలీ అండ్ రైడ్ టీమ్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఈవిధంగా మేళతాళాలను వాయించడం అనేది గౌరవ చిహ్నం. వీటిని చూసి గైర్హాజరైన విద్యార్థి సంతోషిస్తాడు. అనంతరం ఆ విద్యార్థికి టీచర్ ఇమ్రోజ్ కౌన్సెలింగ్ చేసి స్కూలుకు తీసుకెళ్తారు. క్లాస్‌రూంలోకి వెళ్లాక, ఆ విద్యార్థి చేతికి చిడతలు ఇచ్చి వాయించమని చెబుతారు. ఈవిధంగా స్కూలుకు డుమ్మా కొట్టే విద్యార్థులను ప్రేమపూర్వకంగా చదువుకు చేరువ చేయడంలో టీచర్ ఇమ్రోజ్ అలీ సక్సెస్ అయ్యారు. ఈ రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటున్నప్పటికీ, ఆయన స్కూలు పిల్లల కోసం ఇంటింటికి వెళ్తున్నారు. వారిని మళ్లీ బడికి తీసుకొస్తున్నారు.

టీచర్ ఇమ్రోజ్ అలీ వల్లే ఈ మార్పు
'టీచర్ ఇమ్రోజ్ అలీ వల్ల మా స్కూలులో డ్రాపౌట్ రేటు తగ్గింది. అడ్మిషన్లు పెరిగాయి. పిల్లలను స్కూలుకు రప్పించేందుకు ఆయన అనుసరిస్తున్న పద్ధతి వినూత్నమైంది. వినోదపూర్వకంగా పిల్లలను చదువుకు చేరువ చేయాలనే ఇమ్రోజ్ అలీ కాన్సెప్ట్ అమోఘం' అని మహాదళిత్ టోలా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేశ్ చౌధరీ తెలిపారు.

పోలీస్ ఆఫీసర్ అవుతా
'టీచర్ ఇమ్రోజ్ అలీ వల్లే నేను స్కూలుకు రోజూ వెళ్తున్నాను. ఇప్పుడు నేను శ్రద్ధగా చదువుతున్నాను. పోలీసు ఆఫీసర్ కావాలనేది నా జీవిత లక్ష్యం' అని విద్యార్థి వికాస్ కుమార్ తెలిపాడు.
పిల్లలను సాదరంగా స్కూలుకు తీసుకెళ్తున్నారు
'టీచర్ ఇమ్రోజ్ అలీ పిల్లలకు బాధ్యతాయుత ప్రవర్తనను వినోదపూర్వకంగా నేర్పిస్తున్నారు. స్కూలులో సమగ్ర జీవిత శిక్షణ లభిస్తుందని ఆయన చాటిచెబుతున్నారు. ఆ సార్ ప్రభావంతో మా పిల్లలకు చదువుపై శ్రద్ధ పెరిగింది. స్కూలుకు రాని పిల్లలను, ఇళ్లకు వచ్చి మరీ సాదరంగా తీసుకెళ్తున్నారు' అని విద్యార్థి తండ్రి రాజేంద్ర మండల్ తెలిపారు.

నా ఐడియా మంచి ఫలితాలను ఇస్తోంది
'పిల్లలను రోజూ బడికి పంపమని నేను చెబితే, చాలామంది పేరెంట్స్ గతంలో వినేవారు కాదు. ఇప్పుడు వారిలో కొంత మార్పు వచ్చింది. ఎందుకంటే వాళ్లంతా చదువు ప్రాధాన్యతను గ్రహించారు. స్కూలుకు గైర్హాజరైన విద్యార్థులను మేళతాళాలతో గౌరవపూర్వకంగా స్కూలుకు తీసుకురావాలనే నా ఐడియా మంచి ఫలితాలను ఇస్తోంది. అందరు పిల్లల ఇళ్లు, మా స్కూలుకు సమీపంలోనే ఉండటం కలిసొస్తోంది. మా స్కూలులో పిల్లలకు క్రీడలు, సంగీతం వంటివి కూడా నేర్పిస్తున్నాం' అని టీచర్ ఇమ్రోజ్ అలీ తెలిపారు.

