ముంబయి ఫ్యామిలీ డెత్ కేసు- 'పుచ్చకాయలో కల్తీ లేదు'- విషప్రయోగంపై అనుమానాలు!
ఇటీవల బిర్యానీ తర్వాత పుచ్చకాయ తిని ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన కేసులో కొత్త ట్విస్ట్- పుచ్చకాయలో ఎలాంటి కల్తీ జరగలేదని తేల్చిన ఎఫ్‌డీఏ అధికారులు- బ్యాక్టీరియా లేదా విషప్రయోగం జరగొచ్చని అనుమానాలు

Published : May 2, 2026 at 9:46 AM IST
Watermelon Death Case : మహారాష్ట్రలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనపై మిస్టరీ మరింత ముదురుతోంది. బిర్యానీ, పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే వారు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారగా, తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలు కేసుకు కొత్త మలుపు తీసుకొచ్చాయి. వాళ్లు తిన్న పుచ్చకాయలో ఎలాంటి కల్తీ జరగలేదని పరీక్షల్లో తేలింది.
ముంబయికి చెందిన అబ్దుల్లా డోకాడియా, ఆయన భార్య నస్రీన్, ఇద్దరు కుమార్తెలు ఆదివారం (ఏప్రిల్ 25) తెల్లవారుజామున వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై వరుసగా మృతి చెందారు. మరణానికి ముందు వారు బిర్యానీ, పుచ్చకాయ తీసుకోవడంతో ఫుడ్ పాయిజనింగ్ అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) అధికారులు ఆహార నమూనాలను పరీక్షించారు. మరణానికి ముందు వారు తిన్న ఆహారంలో కల్తీ జరగలేదని ఎఫ్‌డీఏ పరీక్షల్లో తేలింది. ముఖ్యంగా పుచ్చకాయలో సింథటిక్ రంగులు లేదా కృత్రిమ తీపి పదార్థాల ఆనవాళ్లు లభించలేదని స్పష్టం చేశారు. కృత్రిమ రసాయనాల ఆనవాళ్లు గానీ లభించలేదని అధికారులు వెల్లడించారు. అయితే బ్యాక్టీరియా పరీక్షలు జరపలేదని, అందువల్ల సూక్ష్మజీవులు కారణమై ఉండొచ్చని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు, విషపదార్థాల వినియోగం కోణాన్ని కూడా తోసిపుచ్చలేమని తెలిపారు.
అవయవాలు రంగు మారడంపై అనుమనాలు
ఇక పోస్టుమార్టం నివేదికలో కొన్ని అనుమానాస్పద అంశాలు బయటపడ్డాయి. మృతుల్లో కొందరి మెదడు, గుండె, జీర్ణాశయంలో భాగాలు ఆకుపచ్చగా మారినట్లు గుర్తించారు. సాధారణ ఫుడ్ పాయిజనింగ్‌లో ఇలా జరగడం అరుదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఏదైనా విషప్రయోగానికి సంకేతం కావచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అదనంగా, అబ్దుల్లా డోకాడియా శరీరంలో మార్ఫిన్ ఆనవాళ్లు లభించడం మరో కీలక అంశంగా మారింది. సాధారణంగా ఈ శక్తివంతమైన పెయిన్‌కిల్లర్‌ను వైద్యుల పర్యవేక్షణలోనే ఉపయోగిస్తారు. చికిత్సలో భాగంగా తీసుకున్నారా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇచ్చారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి నివేదికలు వెలువడిన తర్వాతే అసలు కారణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇదీ జరిగింది
ముంబయిలోని పైధోనీ ప్రాంతంలో నివసిస్తున్న అబ్దుల్లా అబ్దుల్ కాదర్ మొబైల్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవారు. ఆయన భార్య నస్రీన్, ఇద్దరు కుమార్తెలతో కలిసి కుటుంబం నివసించేది. శనివారం రాత్రి బంధువులు ఏర్పాటు చేసిన విందుకు ఈ కుటుంబం హాజరైంది. అక్కడ బిర్యానీ తిన్నారు. అనంతరం ఇంటికి చేరుకున్న తర్వాత అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో పుచ్చకాయ తిన్నట్లు సమాచారం. ఆదివారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో కుటుంబ సభ్యులందరికీ ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అబ్దుల్లా వెంటనే స్థానిక వైద్యుడిని ఇంటికి పిలిపించారు. అయితే అప్పటికే వారి ఆరోగ్యం మరింత విషమించడంతో వెంటనే సమీపంలోని జేజే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం చిన్న కుమార్తె మరణించగా, ఆ వెంటనే తల్లి నస్రీన్, ఆ తర్వాత పెద్ద కుతూరు ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు రాత్రి 10:30 గంటల సమయంలో తండ్రి అబ్దుల్లా కూడా కన్నుమూశాడు. ఈ ఘటనపై పోలీసులు అసహజ మరణం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారు తిన్న పుచ్చకాయ ముక్కలను స్వాధీనం చేసుకుని ల్యాబ్ పరీక్షలకు పంపారు. పుచ్చకాయలో ఏమైనా కల్తీ జరిగిందా? లేదా బిర్యానీ తిన్న తర్వాత వెంటనే పుచ్చకాయ తినడం వల్ల ఏదైనా రసాయనిక చర్య జరిగిందా అన్న కోణంలో పరీక్షలు చేపట్టారు. నివేదికలో పుచ్చకాయలో కల్తీ జరగలేదని తేలింది. దీంతో మిగతా కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
పూజారితో వివాదం- సామాజిక బహిష్కరణకు గురైన కుటుంబం? గ్రామస్థుల వాదన మరోలా!

