ETV Bharat / bharat

దేశంలో స్కూల్ డ్రాప్‌అవుట్లు తగ్గుముఖం- విద్యారంగంలో కీలక పురోగతి- కేంద్రం నివేదిక

2025-26లో ప్రాథమిక నుంచి సెకండరీ వరకు డ్రాప్‌అవుట్ రేటు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర విద్యాశాఖ నివేదిక- దాటిన దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల సంఖ్య తొలిసారిగా 1.02కోట్ల మార్కు- పాఠశాల విద్య పనితీరు సూచీలో చండీగఢ్ అగ్రస్థానం

MOE Report
REPRESENTATIVE IMAGE (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : July 7, 2026 at 10:32 PM IST

3 Min Read
Choose ETV Bharat

MOE Report : దేశంలోని పాఠశాల విద్యా వ్యవస్థలో 2025-26 విద్యా సంవత్సరంలో కీలకమైన పురోగతి నమోదైంది. ముఖ్యంగా విద్యార్థుల స్కూల్ డ్రాప్‌అవుట్ రేటు గణనీయంగా తగ్గగా, సెకండరీ స్థాయిలో చేరికలు, కొనసాగింపు రేట్లు మెరుగుపడ్డాయి. అలాగే దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల సంఖ్య తొలిసారిగా 1.02 కోట్ల మార్కును దాటింది. ఈ వివరాలను కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన యూడైస్ ప్లస్ (UDISE+) 2025-26 నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం గత మూడు విద్యా సంవత్సరాలతో పోలిస్తే 2025-26లో విద్యార్థులు మధ్యలోనే చదువు మానేసే పరిస్థితి గణనీయంగా తగ్గింది.

డ్రాప్‌అవుట్ రేటులో స్పష్టమైన తగ్గుదల
ప్రిపరేటరీ స్థాయిలో 2024-25లో 2.3 శాతంగా ఉన్న డ్రాప్‌అవుట్ రేటు 2025-26లో 1.8 శాతానికి తగ్గింది. సెకండరీ స్థాయిలో ఇది 8.2 శాతం నుంచి 7 శాతానికి పడిపోయింది. అన్ని స్థాయిల్లోనూ ఈ తగ్గుదల కనిపించడం విద్యార్థులను చదువులో కొనసాగించే ప్రభుత్వ చర్యలు ఫలిస్తున్నాయని విద్యాశాఖ పేర్కొంది.

కొనసాగింపు రేటు మెరుగుదల
మిడిల్ స్థాయిలో విద్యార్థుల రిటెన్షన్ రేటు 82.8 శాతం నుంచి 83.7 శాతానికి పెరిగింది. సెకండరీ స్థాయిలో ఇది 47.2 శాతం నుంచి 51.9 శాతానికి చేరింది. అయితే ఫౌండేషన్, ప్రిపరేటరీ స్థాయిల్లో మాత్రం స్వల్ప తగ్గుదల నమోదైంది. అయినప్పటికీ గత మూడేళ్లలో నమోదైన పురోగతి కొనసాగుతోందని నివేదిక పేర్కొంది.

సెకండరీ పాఠశాలల పెరుగుదలతో ప్రయోజనం
దేశవ్యాప్తంగా సెకండరీ విద్య అందించే పాఠశాలల సంఖ్య పెరగడం వల్ల విద్యార్థులకు చదువు అందుబాటులోకి రావడంతో పాటు మధ్యలోనే చదువు మానేయకుండా కొనసాగించే అవకాశం పెరిగిందని విద్యాశాఖ తెలిపింది. ఇదే రిటెన్షన్ రేటు మెరుగుపడటానికి ప్రధాన కారణంగా పేర్కొంది. సెకండరీ స్థాయిలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (GER) కూడా గణనీయంగా పెరిగింది. 2024-25లో 68.5 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి 2025-26లో 71.7 శాతానికి చేరింది. దీంతో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నత తరగతుల్లో చేరుతున్నట్లు స్పష్టమవుతోంది.

1.02 కోట్లకు చేరిన ఉపాధ్యాయుల సంఖ్య
విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా పాఠశాల ఉపాధ్యాయుల సంఖ్య తొలిసారిగా 1.02 కోట్లను దాటింది. 2022-23తో పోలిస్తే 2025-26లో ఉపాధ్యాయుల సంఖ్య 8.3 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఉపాధ్యాయుల పెరుగుదలతో విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి మెరుగుపడటంతో పాటు ప్రాంతాల మధ్య ఉన్న కొరతను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుందని కేంద్ర విద్యాశాఖ తెలిపింది.

పాఠశాల విద్య పనితీరు సూచీలో చండీగఢ్ అగ్రస్థానం
ఇక కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పర్‌ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI) 2025-26 ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరులో చండీగఢ్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. చండీగఢ్ ఒక్కటే 'ఉత్తమ్-3' గ్రేడ్ సాధించింది. పంజాబ్, కేరళ, దిల్లీతో పాటు దాద్రా నగర్ హవేలీ-దమన్ అండ్ డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతం తదుపరి స్థాయిలో నిలిచాయి. అయితే ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం కూడా అత్యున్నత 'ఉత్కర్ష్', 'ఉత్తమ్-1', 'ఉత్తమ్-2' గ్రేడ్లను అందుకోలేకపోయింది.

జిల్లాల పనితీరులోనూ పురోగతి
జిల్లాల వారీగా పరిశీలించినప్పటికీ అత్యున్నత 'ఉత్కర్ష్' గ్రేడ్ ఏ జిల్లాకూ దక్కలేదు. అయితే ఒక జిల్లా 'ఉత్తమ్-1', 19 జిల్లాలు 'ఉత్తమ్-2' గ్రేడ్ సాధించాయి. గత ఏడాదితో పోలిస్తే మంచి గ్రేడ్ సాధించిన జిల్లాల సంఖ్య పెరిగినట్లు నివేదిక తెలిపింది. మొత్తం 462 జిల్లాలు తమ పనితీరును మెరుగుపరుచుకోగా, వాటిలో 50 జిల్లాలు ఒక గ్రేడ్ నుంచి మరో మెరుగైన గ్రేడ్‌కు చేరుకున్నాయి. ఉత్తమ్-2 గ్రేడ్ సాధించిన జిల్లాల్లో ఢిల్లీ నుంచి నాలుగు, పంజాబ్ నుంచి ఏడు, కేరళ నుంచి మూడు, మహారాష్ట్ర నుంచి రెండు జిల్లాలు ఉన్నాయి. చండీగఢ్, డయ్యూ, హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

70 సూచికల ఆధారంగా అంచనా
పెర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో విద్యా ఫలితాలు, పాఠశాలలకు చేరువ, మౌలిక వసతులు, సమాన అవకాశాలు, పరిపాలన, ఉపాధ్యాయుల శిక్షణ వంటి ఆరు ప్రధాన విభాగాల్లోని 70 సూచికల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును అంచనా వేశారు. జిల్లాల స్థాయిలో కూడా ఇదే తరహా ప్రమాణాలతో మూల్యాంకనం చేపట్టారు. ఏదేమైనా 2025-26 విద్యా సంవత్సరంలో డ్రాప్‌అవుట్ రేటు తగ్గడం, సెకండరీ స్థాయిలో చేరికలు పెరగడం, ఉపాధ్యాయుల సంఖ్య పెరగడం వంటి అంశాలు దేశ విద్యా రంగంలో సానుకూల మార్పులకు సంకేతాలుగా కేంద్ర విద్యాశాఖ నివేదిక పేర్కొంది.

తుదిదశలో అహ్మదాబాద్‌ విమాన ప్రమాద దర్యాప్తు- AAIB నివేదిక కోసమే ఎదురుచూస్తున్నాం : కేంద్రమంత్రి రామ్మోహన్‌

పాకిస్థాన్‌ కంటే భారత్‌ వద్ద అణ్వాయుధాలు ఎన్ని ఎక్కువ ఉన్నాయో తెలుసా?