ఇరాన్ దాడులను ఖండించిన ప్రధాని మోదీ- బహ్రయిన్, సౌదీ రాజులకు ఫోన్‌కాల్స్- భారతీయుల బాగోగులపై ఆరా
బహ్రయిన్ రాజు, సౌదీ యువరాజులకు మోదీ ఫోన్‌కాల్స్- యూఏఈలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటన

Published : March 2, 2026 at 7:22 PM IST
Modi Phone Calls To Bahrain King : పశ్చిమాసియాలో సైనిక ఘర్షణ వేళ బహ్రయిన్ రాజు హమాద్ బిన్ ఈసా అల్ ఖలీఫా, సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్‌లతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం మాట్లాడారు. ఆ రెండు దేశాలపై ఇరాన్ దాడులను మోదీ ఖండించారు. ఇక ఇదే సమయంలో బహ్రయిన్, సౌదీ అరేబియా దేశాల్లో నివసిస్తున్న భారతీయుల బాగోగులపై ప్రధాని ఆరా తీశారు. బహ్రయిన్ రాజు, సౌదీ యువరాజుకు మోదీ చేసిన ఫోన్ కాల్ సంభాషణల వివరాలను భారత ప్రభుత్వ అధికార వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అంతకుముందు ఆదివారం రోజు యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు కూడా భారత ప్రధాని ఫోన్ కాల్ చేశారు. యూఏఈపై ఇరాన్ దాడులను మోదీ ఖండించారు. ఆ దాడుల వల్ల యూఏఈలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. ఈ కష్టకాలంలో యూఏఈకి అండగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రవాస భారతీయుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నందుకు యూఏఈ ప్రెసిడెంట్‌కు ధన్యవాదాలు తెలిపారు. సైనిక ఉద్రిక్తతలను తగ్గించాలని, ప్రాంతీయ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రధాని పిలుపునిచ్చారు.
అందుకే ఆ దాడులను ఖండించాం
"పశ్చిమాసియా ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై బహ్రయిన్ రాజు, సౌదీ యువరాజులతో చర్చించాను. ఆ రెండు దేశాలపై ఇటీవలే ఇరాన్ చేసిన దాడులను ఖండించాను. ఈవిధంగా దాడులు చేయడం అనేది ఇతర దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలకు భంగం కలిగించినట్లు అవుతుంది. అందుకే ఆ దాడులను భారత్ ఖండించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రవాస భారతీయుల యోగ, క్షేమాలను పర్యవేక్షిస్తున్నందుకు బహ్రయిన్ రాజు, సౌదీ యువరాజులకు ధన్యవాదాలు చెప్పాను" అని పేర్కొంటూ ప్రధాని మోదీ ఒక ట్వీట్ చేశారు.
Discussed the evolving situation in West Asia with Crown Prince and PM of Saudi Arabia, HRH Prince Mohammed bin Salman. India condemns the recent attacks on Saudi Arabia in violation of its sovereignty and territorial integrity. We agreed that earliest restoration of regional…
— Narendra Modi (@narendramodi) March 2, 2026
ఈ కష్టకాలంలో బహ్రయిన్‌కు అండగా నిలుస్తాం
"బహ్రయిన్ రాజుతో ఫోన్ కాల్‌లో నా చర్చలు ఫలవంతంగా జరిగాయి. ఆ దేశంపై ఇరాన్ చేసిన దాడులను భారత్ ఖండిస్తోంది. బహ్రయిన్ ప్రజలకు భారత్ సంఘీభావాన్ని ప్రకటిస్తోంది. ఈ కష్టకాలంలో వారికి అండగా మేం నిలుస్తాం. ప్రవాస భారతీయుల భద్రతకు పెద్దపీట వేస్తున్నందుకు భారత్ తరఫున నా ధన్యవాదాలు" అని పేర్కొంటూ ప్రధాని మోదీ మరొక ట్వీట్ చేశారు.
Had a productive telephone conversation with the King of Bahrain, His Majesty King Hamad Bin Isa Al Khalifa. India condemns the attacks on Bahrain and stands in solidarity with its people in this difficult hour. I thank him for the steadfast support extended to the Indian…
— Narendra Modi (@narendramodi) March 2, 2026
శాంతియుత పరిష్కారాలే ఉత్తమం
సోమవారం ఉదయం న్యూదిల్లీలో కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో కలిసి భారత ప్రధాని మోదీ సంయుక్త మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులోనూ మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న సైనిక సంఘర్షణల విషయంలో భారత్‌కు ఒక స్పష్టమైన వైఖరి ఉందని ఆయన తెలిపారు. భారత్ ఎల్లప్పుడూ శాంతి, సుస్థిరతలకే ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ఘర్షణలకు దిగడం కంటే శాంతియుత పరిష్కారాలను వెతుక్కోవడమే మంచిదని మోదీ సూచించారు. అటువంటి ప్రయత్నాలకు సదా భారత్ మద్దతు లభిస్తుందన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలోని భారతీయుల భద్రత కోసం అక్కడి దేశాలతో కలిసి పనిచేస్తున్నామని ప్రధాని వెల్లడించారు. భారత్, కెనడా లాంటి ప్రజాస్వామ్య దేశాలు జట్టు కడితే, ప్రపంచ శాంతి గళం మరింత బలాన్ని పొందుతుందన్నారు.
ఇజ్రాయెల్ ప్రధాని, ఒమన్ విదేశాంగ మంత్రికీ కాల్స్
అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూకు కూడా ప్రధాని మోదీ ఫోన్ కాల్ చేశారు. ఆదివారం రోజు ఒమన్ విదేశాంగ మంత్రి బద్ర్ అల్ బుసైదీకి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఫోన్ చేసి మాట్లాడారు. అణ్వస్త్ర కార్యక్రమంపై స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికగా ఇరాన్- అమెరికా జరిపిన చర్చలకు ఒమన్ దేశమే మధ్యవర్తిగా వ్యవహరించారు. ఈనేపథ్యంలో ఆ చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన కీలక అంశాల గురించి ఎస్ జైశంకర్ తెలుసుకున్నారు. ప్రస్తుతం ఇరాన్, అమెరికా - ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న సైనిక ఘర్షణ పర్యవసానాలపైనా వారిద్దరు డిస్కస్ చేశారు.

