ETV Bharat / bharat

నెతన్యాహుకు ప్రధాని మోదీ ఫోన్- ఉగ్రవాదంపై పోరు, ప్రాంతీయ పరిస్థితులపై చర్చలు

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు మోదీ ఫోన్ కాల్- భారత్, ఇజ్రాయెల్ సంబంధాల గురించి చర్చలు- నెతన్యాహు, ఇజ్రాయెల్ వాసులకు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన భారత ప్రధాని

PM MODI & BENJAMIN NETANYAHU
PM MODI & BENJAMIN NETANYAHU (IANS& AP)
author img

By ETV Bharat Telugu Team

Published : January 7, 2026 at 3:31 PM IST

3 Min Read
Choose ETV Bharat

Modi Netanyahu Phone Call : ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్​లో మాట్లాడారు. ఈ క్రమంలో నెతన్యాహు, ఇజ్రాయెల్ దేశ ప్రజలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఇద్దరు నాయకులు కూడా తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

"నా స్నేహితుడు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్​లో మాట్లాడాను. ఆయనకు, ఇజ్రాయెల్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం గురించి మేము చర్చించాం. ప్రాంతీయ పరిస్థితులపై పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నాం. ఉగ్రవాదాన్ని మరింత దృఢ సంకల్పంతో ఎదుర్కోవాలనే మా ఉమ్మడి సంకల్పాన్ని పునరుద్ఘాటించాం." అని మోదీ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలు
భారత్- ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇటీవలి కాలంలో మరింత బలోపేతమయ్యాయి. గాజాపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేపట్టిన చర్యలకు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన వేళ దిల్లీ నెతన్యాహు, ఆయన ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. అలాగే కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ గతేడాది నవంబర్​లో ఇజ్రాయెల్‌లో పర్యటించారు. అక్కడ ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపారు.

ఇజ్రాయెల్ జైశంకర్ పర్యటన
గతేడాది డిసెంబర్ 17న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇజ్రాయెల్​లో పర్యటించారు. జెరూసలేంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును కలిశారు. ఈ క్రమంలో సాంకేతికత, ఆర్థిక వ్యవస్థ, నైపుణ్యాలు, ప్రతిభ, కనెక్టివిటీ, భద్రత సహా అనేక రంగాల్లో భారత్, ఇజ్రాయెల్ మధ్య సహకారాన్ని పెంచుకోవడం గురించి చర్చించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌ ను కూడా జైశంకర్ కలిశారు. అక్కడ ఇరువురు భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం, దాని నిరంతర పురోగతిని సమీక్షించారు.

మోదీకి నెతన్యాహు ఫోన్ కాల్
అలాగే గతేడాది డిసెంబర్ 10న ప్రధాని మోదీకి నెతన్యాహు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అమెరికా రూపొందించిన గాజా కాల్పుల విరమణ ప్రణాళిక సహా ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ పరిణామాలను సమీక్షించడానికి ప్రధాని మోదీకి నెతన్యాహు ఫోన్ చేశారు. ఈ క్రమంలో మోదీ, నెతన్యాహు ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం స్థిరంగా ముందుకు సాగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పరస్పర ప్రయోజనం కోసం కీలక రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని నిర్ణయించారు.

అలాగే మోదీ, నెతన్యాహు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇండియా-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే మార్గాల గురించి చర్చించారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు గురించి మాట్లాడుకున్నారు.

మోదీ, నెతన్యాహు మధ్య స్నేహబంధం
ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య యుద్ధం ముగింపునకు శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఆ సమయంలో హమాస్‌తో ఒప్పందానికి సంబంధించి చర్చించేందుకు ఇజ్రాయెల్‌ భద్రతా క్యాబినెట్‌ భేటీ జరుగుతోంది. ఈ మీటింగ్​కు నెతన్యాహు సహా పలు కీలక అధికారులు హాజరయ్యారు. అంతలోనే భారత ప్రధాని మోదీ నుంచి నెతన్యాహుకు ఫోన్‌ కాల్ వచ్చింది. నెతన్యాహు వెంటనే సమావేశాన్ని తాత్కాలికంగా ఆపి మరీ మోదీతో కాసేపు సంభాషించారు. అంతలా మోదీ- నెతన్యాహు మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటన వాయిదా!
ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు గతేడాది చివర్లో భారత్‌ పర్యటనకు రావాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల ఆయన ఆ టూర్​ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. చివరిసారిగా 2018లో నెతన్యాహు ఇండియాకు వచ్చారు. 2025లో మరోసారి పర్యటించాలనుకున్నారు. కాగా అది పలుమార్లు వాయిదా పడింది. ఈ ఏడాది ఆయన భారత్​లో పర్యటించనున్నట్లు సమాచారం. 2017లో భారత ప్రధాని మోదీ ఇజ్రాయెల్​లో పర్యటించారు. ఆ తర్వాత నెతన్యాహు భారత్‌లో పర్యటించారు. మోదీ- నెతన్యాహుల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

2026లో కొత్త శిఖరాలకు భారత్- ఐరోపా బంధం: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్

చట్టాలను ఉల్లంఘిస్తే సాగనంపుతాం : భారతీయ విద్యార్థులకు అమెరికా హెచ్చరిక