ETV Bharat / bharat

పెరుగుతున్న సముద్ర మట్టాలు- కోల్‌కతా, ముంబయిలో లక్షలాది మందికి ముప్పు- ఐరాస హెచ్చరిక

సముద్ర మట్టాల పెరుగుదలతో కోల్‌కతా, ముంబయి సహా పలు నగరాలకు పొంచి ఉన్న ముప్పు- కోట్లాది మందికిపైగా ఇళ్లను కోల్పోయే ప్రమాదముందని ఐరాస హెచ్చరిక- ప్రజల వలసలు పెరగొచ్చని అంచనా

Representative Image
ప్రతీకాత్మక చిత్రం (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : September 1, 2026 at 10:03 PM IST

3 Min Read
Choose ETV Bharat

Kolkata Mumbai Sea Level Risk : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు తీర ప్రాంత నగరాలకు తీవ్రమైన ముప్పుగా మారాయని ఐక్యరాజ్యసమితి (UN) హెచ్చరించింది. సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతుండటం వల్ల భారతదేశంలోని కోల్‌కతా, ముంబయిలతో పాటుగా పొరుగున ఉన్న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని మిలియన్ల మంది ప్రజలు తమ నివాసాలను కోల్పోయే ప్రమాదంలో పడ్డారని స్పష్టం చేసింది. ముఖ్యంగా దక్షిణాసియాలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న కోట్లాది మంది తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారని పేర్కొంది. సముద్ర మట్టం పెరగడం ఇక భవిష్యత్తులో ఎదురయ్యే సమస్య కాదని, ఇప్పటికే దాని ప్రభావాలు కనిపిస్తున్నాయని యూఎస్ సెక్రటరీ జనరల్ నివేదిక స్పష్టం చేసింది. 'సముద్ర మట్టాల పెరుగుదల- ఎదురవుతున్న సవాళ్లు- పరిష్కారానికి మార్గాలు' పేరుతో విడుదల చేసిన రిపోర్టులో ఈ దిగ్భ్రాంతికర వివరాల్ని వెల్లడించారు.

సముద్ర మట్టాలు పెరగడం వల్ల తీర ప్రాంతాల్లో నివసించే ప్రజల ఇళ్లు, జీవనోపాధి మాత్రమే కాకుండా రహదారులు, రవాణా వ్యవస్థలు, విద్యుత్ గ్రిడ్లు, నీటి వనరులు, భవనాలు, భూగర్భ జలాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందని నివేదిక పేర్కొంది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలనే తేడా లేకుండా సముద్ర మట్టాల పెరుగుదల మానవాళికి పెద్ద సవాలుగా మారిందని రిపోర్టులో అంచనా వేసింది. అమెరికాలోని మియామి, న్యూయార్క్, చైనాలో గ్వాంగ్‌జౌ వంటి సంపన్న నగరాల్లో కోట్ల డాలర్ల విలువైన ఆస్తులు దెబ్బతినే ప్రమాదంలో ఉన్నాయని యూఎన్ తెలిపింది. ఈ నగరాల్లో ప్రమాదంలో ఉన్న తీర ప్రాంత మౌలిక వసతుల విలువ 2 ట్రిలియన్ డాలర్ల నుంచి 3.5 ట్రిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేసింది.

భారత్‌లోని ముంబయి, కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని ఢాకా వంటి నగరాల్లో 1.4 కోట్ల మందికిపైగా ప్రజలు శాశ్వతంగా నీట మునిగే పరిస్థితి కారణంగా తమ ఇళ్లను కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని, ఇది తక్షణమే ప్రభావం చూపించొచ్చని కూడా నివేదిక తెలిపింది. సముద్ర మట్టం పెరుగుదల వల్ల కేవలం ఆస్తి నష్టమే కాకుండా, ప్రజల వలసలు కూడా భారీగా పెరగొచ్చని, జీవనోపాధిపైనా ప్రభావం పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని హెచ్చరించింది.

రికార్డు స్థాయిలో పెరుగుతున్న సముద్ర మట్టాలు- కారణాలివే!
ముఖ్యంగా మానవ కార్యకలాపాల కారణంగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ సముద్ర మట్టాల పెరుగుదలకు ప్రధాన కారణమని యూఎన్ రిపోర్ట్ వెల్లడించింది. ముఖ్యంగా హిమనీనదాలు (గ్లేసియర్లు) కరుగుతుండటం, ఉష్ణోగ్రత పెరుగుతుండటం వంటి అంశాలు సముద్ర మట్టం పెరుగుదలకు దోహదపడుతున్నాయి. 2014-2023 మధ్య ప్రపంచ సముద్ర మట్టం సగటున సంవత్సరానికి 4.7 మిల్లీమీటర్లు పెరిగింది. 2024లో ఒక్క సంవత్సరంలోనే సముద్ర మట్టం 5.9 మిల్లీమీటర్లు పెరిగింది. ఇది సరికొత్త రికార్డుగా చెబుతున్నారు. 2023-24 మధ్య సుమారు 5 మిల్లీమీటర్ల పెరుగుదలకు అసాధారణ సముద్ర ఉష్ణోగ్రతలు, ఎల్ నినో ప్రభావం ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది. 2025లో కూడా సగటున ప్రపంచ సగటు సముద్ర మట్టం 2024 రికార్డు స్థాయికి దాదాపు సమానంగానే ఉంది.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 77 కోట్ల మంది, అంటే ప్రపంచ జనాభాలో సుమారు 10 శాతం మంది తీర ప్రాంతాల నుంచి 5 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని నివేదిక తెలిపింది. ఈ ప్రాంతాల్లో సముద్ర మట్టం పెరగడంతో తీర ప్రాంత వరదలు, మంచి నీటి వనరుల్లో ఉప్పునీరు చేరడం, పర్యావరణ వ్యవస్థలకు నష్టం వాటిల్లుతుండటం వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. సముద్ర మట్టం పెరుగుతున్న కొద్దీ ఉప్పునీరు భూభాగం లోపలికి చొచ్చుకుపోయే ప్రమాదం ఉంది. దీంతో తీర ప్రాంతాల్లోని భూగర్భ జలాలు, బావులు, నేల ప్రాంతాలు ఉప్పునీటితో కలుషితమయ్యే అవకాశం ఉంది. ఇంకా దీని ప్రభావం తాగునీటి సంరక్షణ, వ్యవసాయం, సాగునీటి వ్యవస్థలపైనా పడనుంది. ఇదే సమయంలో సముద్ర మట్టం పెరగడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయని యూఎన్ తెలిపింది. తీర ప్రాంతాల్లో పారిశుద్ధ్య, మౌలిక వసతులు దెబ్బతినడం, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పు పెరగడంతో మరణాల ప్రమాదం అధికంగా ఉండటంతో పాటు ప్రజల్లో మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అందుకే తీర ప్రాంతాల్లో రక్షణ కోసం ముందస్తు ప్రణాళికలు, దీర్ఘకాలిక చర్యలు అత్యవసరమని స్పష్టం చేసింది.

నేపాల్ విపత్తు నుంచి పాఠాలు- ఉత్తరాఖండ్‌లో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్- సైంటిస్టుల కీలక నిర్ణయం

'బీజేపీ, ఓట్ చోరీ ఆయోగ్ వ్యూహాలు మార్చుకుంటూనే ఉంటాయ్​'- మహారాష్ట్ర SIRపై రాహుల్ ఆరోపణలు