పశ్చిమాసియా సంక్షోభం- విమాన సర్వీసులపై కేంద్రం అలర్ట్
పశ్చిమాసియాలో ఇరాన్ vs ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఘర్షణ- అలర్ట్ అయిన పౌరవిమానయాన శాఖ

Published : February 28, 2026 at 7:27 PM IST
DGCA Review Aviation Preparedness : పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడే ప్రభావంపై కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డీజీసీఏ, ఇతర భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రయాణికుల భద్రత, విమాన కార్యకలాపాల కొనసాగింపుపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
పశ్చిమాసియాలో గగనతల ఆంక్షలు, నోటమ్స్ (NOTAMs) జారీ అయిన నేపథ్యంలో, ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు, రియల్‌టైమ్ సమన్వయం చేసుకునేందుకు ఈ సమీక్ష సమావేశం నిర్వహించినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఓసీఏ) తెలిపింది. కాగా, అంతర్జాతీయ సర్వీసులు నడుపుతున్న భారతీయ విమానయాన సంస్థలు ఆయా దేశాల గగనతల అడ్వైజరీలను, రూట్ ఆంక్షలను నిరంతరం పర్యవేక్షించాలని రామ్మోహన్ నాయుడు సూచించారు. అంతేకాదు ముందస్తు ప్రణాళికలు, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ప్రకారం విమానాలను దారి మళ్లించడం లేదా రీ-రూటింగ్ చేయడం లాంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
In view of the evolving situation in the Middle East and its potential impact on international air operations, Minister of Civil Aviation Ram Mohan Naidu has undertaken a comprehensive review of preparedness and response measures with all concerned stakeholders.
— ANI (@ANI) February 28, 2026
The review… pic.twitter.com/PAiVbWBuxw
ఫుల్ అలర్ట్
ప్రస్తుతం దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాలను అపరేషనల్ అలర్ట్‌లో ఉంచారు. విమానాల మళ్లింపు, అన్షెడ్యూల్డ్ ల్యాండింగ్‌లు సహా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్లకు సూచించారు. గ్రౌండ్ హ్యాండ్లింగ్, పార్కింగ్ బేస్, ఇమ్మిగ్రేషన్ సపోర్ట్, క్రూ లాజిస్టింక్స్ విషయంలో విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు.
ఇక విదేశాల్లో ఉన్న భారత పౌరులు, విమానయాన సంస్థల అత్యవసరాల కోసం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పౌర విమానయాన శాఖ నిరంతరం సంప్రదింపులు చేస్తోంది. మరోవైపు ప్రయాణికులు తగు సమాచారం కోసం నిరంతరం విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించింది. అలాగే విమానాల జాప్యం, రద్దు మొదలైన వాటి గురించి ప్రయాణికులకు ముందుగానే సమాచారం అందించాలని ఆయా విమానయాన సంస్థలకు స్పష్టం చేసింది.
విమాన సర్వీసులు బంద్!
పశ్చిమాసియాలో ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికాల మధ్య భీకరంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, సిబ్బంది భద్రత రీత్యా ఎయిర్ ఇండియా తన విమాన సర్వీసులన్నింటినీ నిలిపివేసింది. మరోవైపు దుబాయ్, జెడ్డా, దోహా, అబుదాబి, దమ్మామ్, బహ్రెయిన్, షార్జా, కువైట్, రస్ అల్-ఖైమా నగరాలకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఇండిగో తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకే తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఇండిగో స్పష్టం చేసింది.
వాస్తవానికి భారత్‌తోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, టర్కీ సహా పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్, దోహా వంటి అంతర్జాతీయ విమాన విమానాశ్రయాల్లోనే భారీ సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఖతార్ గగనతలం మూసివేతతో, ఖతార్ ఎయిర్వేస్- దోహాకు వెళ్లే సర్వీసులను తాత్కాలికంగా ఆపేసింది. లెబనాన్, సిరియా, ఇరాక్, ఇరాన్,జోర్డాన్ దేశాలకు సోమవారం వరకు విమానాలను నిలిపివేసినట్లు టర్కిష్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. లండన్ నుంచి దుబాయ్‌కి వెళ్లే విమానాలను వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్ రద్దు చేసింది. డచ్ విమానయాన సంస్థ కేఎల్ఎం ఆదివారం నుంచి టెల్ అవీవ్‌కు విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మరింత ముదిరితే, రానున్న రోజుల్లో మరిన్ని విమాన సంస్థలు సర్వీసులను నిలిపివేసే అవకాశం ఉంది.
భీకర యుద్ధం తప్పదా?
ఇరాన్ సైనిక, అణు స్థావరాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా 'ఆపరేషన్ రోరింగ్ లయన్'ను చేపట్టాయి. దీనితో ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. యుద్ధభయాలతో ఇరాన్, ఇజ్రాయెల్ సహా చాలా పశ్చిమాసియా దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. దీనితో అంతర్జాతీయ విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

