ETV Bharat / bharat

18 ఏళ్ల తర్వాత ఇంటికి చేరిన యువకుడు- అప్పుడెలా దూరమయ్యాడు? ఇప్పుడెలా చేరుకున్నాడు?

13 ఏళ్ల వయసులో తల్లిదండ్రులకు దూరం -18 ఏళ్ల తర్వాత ఇంటికి చేరిన వైనం- కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందం!

Purushottam returns home after 18 years
Purushottam returns home after 18 years (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : February 26, 2026 at 7:34 PM IST

3 Min Read
Choose ETV Bharat

Man Returns Home After 18 Years : విధి ఎప్పుడు, ఏం నిర్ణయిస్తుందో ఎవరం చెప్పలేం. ఒడిశాకు చెందిన ఓ 13 ఏళ్ల బాలుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మభ్యపెట్టి తీసుకుపోయారు. అతని చేత వెట్టిచాకిరీ చేయించారు. ఈ విధంగా 18 ఏళ్లపాటు తన తల్లిదండ్రులకు దూరమైపోయాడు. చివరికి 31 ఏళ్ల వయసులో నానాకష్టాలుపడి తన సొంతూరుకు చేరుకున్నారు. దీంతో యువకుడి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అయితే తమ కుమారుడిని చూడడానికి తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోవడం విచారకరం.

అసలేం జరిగిందంటే?
సుందర్‌గఢ్ జిల్లాలోని గంజుతోలా గ్రామానికి చెందినవాడు పురుషోత్తం గౌడ. 2008లో అతనికి 13 ఏళ్ల వయసున్నప్పుడు కొందరు వ్యక్తులు డ్రైవింగ్ నేర్పిస్తామని చెప్పి అతడిని తమతో తీసుకెళ్లారు. దీని తర్వాత అతనిని జమ్మూకశ్మీర్​లోని సాంబా జిల్లాలో వెట్టిచాకిరీ చేయిస్తూ బందీగా ఉంచారు. ఇలా 18 ఏళ్లపాటు అతను తన కుటుంబానికి దూరమయ్యాడు. మరోవైపు కనిపించకుండాపోయిన పురుషోత్తం కోసం వారి తల్లిదండ్రులు ఎంతో గాలించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు కూడా పెట్టారు. అయినా యువకుడి జాడ కనిపించలేదు. దీంతో పురుషోత్తం తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనలో మునిగిపోయారు. ఎందుకంటే వారికున్న ఏకైక సంతానం పురుషోత్తమే. ఆ తర్వాత తమ కుమారుడు కోసం బాధపడుతూ పురుషోత్తం తల్లిదండ్రులిద్దరూ ప్రాణాలు విడిచారు.

Purushottam returns home after 18 years
18 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగివచ్చిన పురుషోత్తం (ETV Bharat)

ఫోన్ నంబరు సాయంతో
18 ఏళ్ల క్రితం ఇంటికి దూరమైన పురుషోత్తం, ఇండో-పాక్ సరిహద్దు సమీపంలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో ఇన్నాళ్లూ పని చేశాడు. అయితే అతడ్ని సొంత ఊరుకి తీసుకొచ్చింది మాత్రం ఫోన్ నెంబరే. ఎందుకంటే పురుషోత్తం తన చిన్నతనంలో తమ కుటుంబ సభ్యులు వాడిన ఫోన్ నెంబరు గుర్తొచ్చి 2022లో కాల్ చేశాడు. తాను జమ్ముకశ్మీర్‌లో నివసిస్తున్నట్లు తెలియజేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది.

దీంతో మళ్లీ ఈ ఏడాది జనవరిలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. తనను రక్షించమని వేడుకున్నాడు. దీంతో పురుషోత్తం పిన్ని స్థానిక సర్పంచ్, రఘునాథ్‌పల్లి ఎమ్మెల్యే దుర్గా చరణ్ తంతిని సంప్రదించింది. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే అధికారులకు సమాచారం అందించారు. దీంతో రూర్కెలాలోని తంగర్‌పల్లి పోలీసులు, సాంబా జిల్లాలోని రాజ్‌పురా పోలీసులతో మాట్లాడారు. ఈ క్రమంలో పురుషోత్తం గౌడ మంగళవారం రూర్కెలా చేరుకున్నాడు. అతడ్ని కుటుంబం సభ్యులు స్వాగతించారు.

Purushottam returns home after 18 years
18 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగివచ్చిన పురుషోత్తం (ETV Bharat)

కూలీ పనులు చేయమని బలవంతం చేశారు : పురుషోత్తం
18 ఏళ్ల తర్వాత సొంతూరికి రావడం పట్ల పురుషోత్తం సంతోషం వ్యక్తం చేశాడు. తన కుటుంబాన్ని కలవడం చాలా ఆనందంగా ఉందన్నాడు. తనకు అంతా కొత్తగా అనిపిస్తుందని తెలిపాడు. తాను ఎప్పుటి నుంచో ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నానని, కానీ తన దగ్గర డబ్బు, ఐడెంటిటీ ఫ్రూప్ లేదని చెప్పాడు. 13 ఏళ్ల వయసులో తనను జమ్ముకశ్మీర్‌కు అక్రమంగా తరలించారని పేర్కొన్నాడు. అక్కడ తనను కూలీగా పనిచేయమని బలవంతం చేశారని భావోద్వేగానికి గురయ్యాడు.

"నేను జమ్ము సాంబా జిల్లాలోని ఇండో-పాక్ సరిహద్దు సమీపంలో ఒక వ్యాపారవేత్త ఇంట్లో ఉన్నాను. అక్కడ అన్ని రకాల ఇంటి పనులు చేశాను. ట్రక్కులు, ఇతర వాహనాలను నడపమని కూడా నన్ను అడిగారు. వారు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఆహారం పెట్టారు. బట్టలు ఇచ్చారు. ఇతర అవసరాలను తీర్చారు. కానీ నాకు ఎప్పుడూ డబ్బు ఇవ్వలేదు. నేను ఇంటికి తిరిగి రావడానికి చాలాసార్లు ప్రయత్నించాను. కానీ విఫలయ్యాను" అని పురుషోత్తం తెలిపాడు.

మాతృభాషను మర్చిపోయిన పురుషోత్తం
చాలా ఏళ్లుగా ఇంటికి దూరంగా ఉండడం వల్ల పురుషోత్తం తన మాతృభాష ఒడియాను మర్చిపోయాడు. ఇప్పుడు హిందీ, జమ్మూ స్థానిక మాండలికాన్ని మాత్రమే మాట్లాడగలుగుతున్నాడు. "నేను నా కుటుంబంతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. నాకొచ్చిన పనితో ఇక్కడ జీవనోపాధి పొందేందుకు ప్రయత్నిస్తాను. ఇక్కడి ఆహారపు అలవాట్లు, భాష కాస్త ఇబ్బందిగా ఉంది. కానీ నెమ్మదిగా ఒడియా నేర్చుకుంటాను" అని పురుషోత్తం పేర్కొన్నాడు.

పురుషోత్తం మళ్లీ తమ వద్దకు తిరిగి వస్తాడనే ఆశను తాము కోల్పోయామని ఆయనకు సోదరి వరుసైన అనితా గౌడ తెలిపింది. పురుషోత్తం ఇన్నాళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చినందుకు తాము చాలా సంతోషంగా ఉన్నామని పేర్కొంది. జమ్ముకశ్మీర్ నుంచి రావడానికి ప్రయత్నిస్తే టెర్రరిస్ట్ అని ముద్రవేసి చంపేస్తామని పురుషోత్తంను బెదిరించారని వెల్లడించింది. రూర్కెలా రైల్వే స్టేషన్‌లో మమ్మల్ని చూసిన తర్వాత పురుషోత్తం బాధతో ఏడ్చాడని గుర్తు చేసుకుంది. తన సోదరుడు ఇంటికి తిరిగి రావడానికి సహాయం చేసిన పోలీసులకు, స్థానిక ఎమ్మెల్యేకు ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది.