ETV Bharat / bharat

మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌కు ప్రతిష్టాత్మక 'ప్రొఫెసర్ జె.ఫిలిప్ లీడర్‌షిప్ అవార్డు'- భవిష్యత్ నాయకత్వంపై కీలక కామెంట్స్

ఏఐ, ఆటోమేషన్ యుగానికి అనుగుణంగా మేనేజ్మెంట్ విద్య మారాలన్న మార్గదర్శి చిట్‌ఫండ్ ఎండీ శైలజా కిరణ్- సక్సెస్ కంటే క్యారెక్టర్, నైతికత, మానవత్వమే గొప్ప నాయకత్వానికి పునాది అని స్పష్టీకరణ

Margadarsi MD Sailaja Kiron Receives Prof. J. Philip Leadership Award
మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌కు ప్రతిష్టాత్మక 'ప్రొఫెసర్ జె.ఫిలిప్ లీడర్‌షిప్ అవార్డు' (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : August 29, 2026 at 8:04 PM IST

4 Min Read
Choose ETV Bharat

Sailaja Kiron Management Education : కృత్రిమ మేధ (AI), ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీ నేటి ప్రపంచాన్ని వేగంగా మారుస్తున్న నేపథ్యంలో దీనికి అనుగుణంగా మేనేజ్మెంట్ విద్య కూడా మారాలని మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శైలజా కిరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ కేవలం తరగతి గదులు, పుస్తకాలకే పరిమితం కాకూడదని అభిప్రాయపడ్డారు. శనివారం బెంగళూరులోని XIME లో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ స్కూల్స్ (AIMS) 37వ వ్యవస్థాపక దినోత్సవం వైభవంగా జరిగింది. 'మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ భవిష్యత్తు- దూర దృష్టి గల నాయకత్వం పాత్ర' అనే థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆమె విశిష్ట అతిథిగా హాజరై ప్రసంగించారు. పలువురు విద్యావేత్తలు, పరిశ్రమ ప్రతినిధులు, విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శైలజా కిరణ్‌కు ప్రతిష్టాత్మక 'ప్రొఫెసర్ జె. ఫిలిప్ ఉమెన్ లీడర్‌షిప్ అవార్డు'ను ప్రదానం చేశారు. ఈ గుర్తింపును తన సహచరులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తన ప్రతి విజయానికి సమష్టి కృషే కారణమని తెలిపారు. సామర్థ్యం, వ్యక్తిత్వం, మానవత్వంతో కూడిన నాయకులను సమాజానికి అందించాలనే దిశగా కృషి చేసిన విద్యావేత్త ప్రొఫెసర్ జె. ఫిలిప్ పేరిట ఈ అవార్డు అందుకోవడం ఎంతో గర్వకారణమని శైలజా కిరణ్ పేర్కొన్నారు.

టెక్నాలజీ మనుషుల్ని భర్తీ చేయొద్దు
విద్యాసంస్థలు కేవలం గత విజయాలపైనే ఆధారపడకుండా మారుతున్న అవసరాలకు అనుగుణంగా నిరంతరం అభివృద్ధి చెందాలని శైలజా కిరణ్ అన్నారు. సేవల్ని మరింత మెరుగుపర్చడానికి డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు పెట్టడం అవసరమని అన్నారు. 'టెక్నాలజీ మనుషులను భర్తీ చేయకూడదు. అది వారికి మరింత శక్తిని ఇవ్వాలి (సమర్థుల్ని చేయాలి). మేనేజ్మెంట్ సంస్థలు టెక్నాలజీని స్వీకరిస్తూనే సానుభూతి, సమగ్రత, బాధ్యత వంటి మానవ విలువల్ని బలోపేతం చేయాలి.' అని శైలజా కిరణ్ వ్యాఖ్యానించారు. 30 ఏళ్ల వయసులో 12 బ్రాంచ్‌లు, రూ. 100 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తన అనుభవాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. ఇతరులకు సమస్యలు, అడ్డంకులు కనిపించే చోట, నాయకులు సరికొత్త అవకాశాల్ని సృష్టించడానికి వారి దూరదృష్టి (ముందుచూపు) తోడ్పడుతుందని వివరించారు.

ఏఐ ద్వారా సమాచారం సులభంగా అందుబాటులోకి వచ్చిన సమయంలో ఉపాధ్యాయుల పాత్ర మరింత కీలకమవుతుందని శైలజా కిరణ్ అన్నారు. విద్యార్థులకు కేవలం సమాచారం అందించడం కాకుండా- ఎలా ఆలోచించాలి, ఎలా విశ్లేషించాలి, ప్రశ్నించడం ఎలా, కొత్తగా ఎలా ఆలోచించాలి? నైతిక నిర్ణయాలు ఎలా తీసుకోవాలనే అంశాలను నేర్పించాలని సూచించారు. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ లక్ష్యం- నైతిక విలువలతో కూడిన నిర్ణయాలు తీసుకునేవారిని, సరికొత్తగా ఆలోచించే ఆవిష్కర్తలను, సమస్యల్ని పరిష్కరించే లీడర్లను, పారిశ్రామిక వేత్తలను, దేశ నిర్మాణంలో భాగస్వాములైన నాయకులను, మానవీయ విలువల్ని పెంపొందించేలా తయారు చేయడమేనని స్పష్టం చేశారు. నేటి విద్యార్థులే రేపటి నాయకులు అని, వారిని సరైన మార్గంలో తీర్చిదిద్దే బాధ్యత విద్యాసంస్థలదేనని ఆమె అన్నారు. ఇదే సమయంలో పర్యావరణ విపత్తులు పెరుగుతున్న నేపథ్యంలో భూమిని సంరక్షించేందుకు మరింత పరిశోధన, కార్యచరణ అవసరం అని కూడా సూచించారు.

తరగతి గదిలో నేర్చుకునే విద్యకు, పరిశ్రమలో అవసరమైన నైపుణ్యాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు విద్యాసంస్థలకు కీలక సూచనలు చేశారు శైలజా కిరణ్. ఇందుకోసం ఇంటర్న్‌షిప్‌లు, లైవ్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీ మెంటరింగ్‌ కార్యక్రమాల్ని మరింత విస్తరించాలని కోరారు. భారత్‌లోని స్టార్టప్ ఉద్యమం యువత సాధారణ సమస్యలకు కూడా పరిష్కారాల్ని కనుగొని, వాటిని వ్యాపారాలుగా మార్చగలదని నిరూపించినట్లు చెప్పారు. యువ ఆవిష్కర్తలు ఓంకార్ సింగ్ బాత్రా, సామ్ సంగి, అద్వైత్ ఠాకూర్‌లను ప్రస్తావిస్తూ- వ్యాపారవేత్తలకు ధైర్యం, పట్టుదల, సృజనాత్మకత ముఖ్యమని పేర్కొన్నారు. విషిత ఉమా శంకర్ రూపొందించిన సోలార్‌తో పనిచేసే మొబైల్ ఇస్త్రీ వాహనం గురించి కూడా శైలజా కిరణ్ ప్రస్తావించారు. బొగ్గుతో పనిచేసే ఇస్త్రీ పెట్టెల వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యల్ని గమనించి ఆమె ఈ పరిష్కారాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు.

నాయకత్వం అంటే కేవలం ఒక పదవిని చేపట్టడం కాదని శైలజా కిరణ్ అన్నారు. భవిష్యత్తు అవకాశాల్ని గుర్తించడం, పాత విధానాల్ని ప్రశ్నించడం, కొత్త సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం ఉండటం కూడా నాయకత్వంలో భాగమని చెప్పారు. నైతికత లేకుండా సాధించిన విజయం ఎక్కువ కాలం నిలవదని ఆమె ఈ సందర్బంగా స్పష్టం చేశారు.

"మీ కింద ఎంత మంది చేస్తున్నారనేది నాయకత్వానికి ప్రామాణికం కాదు. మీ వల్ల ఎంత మంది ఎదుగుతున్నారనేదే నాయకత్వానికి నిజమైన అసలైన కొలమానం. గొప్ప నాయకులు అనుచరులను మాత్రమే కాదు. మరింత మంది నాయకుల్ని తయారు చేస్తారు."

- శైలజా కిరణ్, మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ

చివరగా విద్యార్థులు భయపడకుండా కలలు కనాలని, నిజాయతీగా పనిచేయాలని, నిరంతరం నేర్చుకోవాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్ని గౌరవించాలని శైలజా కిరణ్ సూచించారు. విజయంతో గుర్తింపు రావొచ్చని, అయితే వ్యక్తిత్వంతోనే (క్యారెక్టర్) అసలైన గౌరవం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి NAAC కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్ర గ్రూప్, GRG ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్, ఫౌండర్ ట్రస్టీ నందిని రంగస్వామి కూడా పాల్గొన్నారు.

పర్యటకులకు గుడ్‌న్యూస్- IRCTC ఈఎంఐ టూర్ ప్యాకేజ్- రామోజీ ఫిల్మ్ సిటీ, అయోధ్య, రిశికేశ్‌ను చుట్టేయొచ్చు!

'అమరావతి ఈ ఛాంపియన్స్​' - విమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్​లో రామోజీ గ్రూపు జట్టు టైటిల్