మావోయిస్టుల లొంగుబాటు పర్వం: కారణాలు ఏమిటి? ప్రభావిత జిల్లాలు ఎలా తగ్గాయి? రాష్ట్రాలు, కేంద్రం వ్యూహాలు ఎలా ఫలించాయి?
పద్మవ్యూహంలో చిక్కుకున్న మావోయిస్టులు- అగ్రనేతలు దూరమవడంతో ఉద్యమానికి నాయకత్వ లేమి- నాయకత్వ స్థానాల కోసం అంతర్గత కలహాలు, వర్గ విభేదాలు- మావోయిస్టుల కంచుకోటలన్నీ బద్దలు!

Published : October 18, 2025 at 8:54 PM IST
Explainer On Mass Maoists Surrender : ఎంతోమంది మావోయిస్టులు ప్రస్తుతం లొంగు'బాట'లో ఉన్నారు. గత శుక్రవారం (2025 అక్టోబరు 17న) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో ఒకేసారి 210 మంది మావోయిస్టులు లొంగిపోవడం సంచలనం సృష్టించింది. గత పదేళ్ల పరిణామాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్, ఒడిశా, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రల్లో మావోయిస్టు ఉద్యమం బాగా బలహీనపడింది. మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య సైతం తగ్గిపోయింది. చాలామంది అగ్రనేతలను మావోయిస్టులు కోల్పోయారు.పెద్దసంఖ్యలో అగ్ర కమాండర్లు, కేంద్ర కమిటీ సభ్యులు సరెండర్ అయ్యారు. ఇంతకీ ఈ లొంగుబాట్ల పర్వానికి ప్రధాన కారణాలు ఏమిటి? దేశంలోని మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య ఎలా తగ్గింది? ఈ ఫలితాల కోసం ఏ రాష్ట్రం ఎలాంటి వ్యూహాన్ని అమలుచేసింది? మావోయిస్టుల ఏరివేత లక్ష్యాన్ని కేంద్ర సర్కారు ఎలా ఛేదించింది? ఈ కథనంలో తెలుసుకుందాం.
మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య డౌన్
కేంద్రంలోని మోదీ సర్కారు వ్యూహాలు ఫలించాయి. గత పదేళ్లలో మావోయిస్టుల కంచుకోటలన్నీ బద్దలయ్యాయి. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్, ఒడిశా, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రల్లోని అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు, దాడులు తగ్గిపోయాయి. 2017 సంవత్సరం వరకు ఈ రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 126. 2018 ఏప్రిల్ నాటికి ఈ సంఖ్య 90కి తగ్గిపోయింది. 2021 జులై నాటికి 70 జిల్లాలకు, 2024 ఏప్రిల్ నాటికి 38 జిల్లాలకు చేరింది. ఈ ఏడాది(2025) అక్టోబరు 15న కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎక్కువగా మావోయిస్టుల ప్రభావం కలిగిన జిల్లాల సంఖ్య 6 నుంచి 3కు తగ్గిందని వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, నారాయణ్‌పూర్‌లే ఆ 3 జిల్లాలని తెలిపింది. దేశంలోని మొత్తం మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 18 నుంచి 11కు తగ్గిందని కేంద్రం పేర్కొంది.
ఆ జిల్లాల కోసం బహుముఖ వ్యూహం
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలను చేయిస్తోంది. సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక ఫోకస్ పెడుతోంది. అక్కడి యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలను పెంచుతోంది. ఆయా జిల్లాల్లో టెలికాం నెట్‌వర్క్‌లు, రోడ్లు, విద్యుత్ సప్లై వ్యవస్థలు, విద్యాసంస్థలను ఏర్పాటు చేయిస్తోంది. తద్వారా అక్కడి ప్రజలు మావోయిస్టులతో ప్రభావితం కాకుండా జాగ్రత్తపడుతోంది. పర్యవసానంగా మావోయిస్టులలో చేరే యువత, మహిళల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇక ఇదే సమయంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లు చేపట్టే భద్రతా బలగాలను కేంద్ర ప్రభుత్వం ఆధునికీకరించింది. ఇందుకోసం కోట్లాది రూపాయలను వెచ్చించింది. మావోయిస్టులతో ఎక్కువగా ప్రభావితమైన జిల్లాలకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.30 కోట్ల సాయాన్ని అందిస్తోంది. మావోయిస్టుల ప్రభావం కలిగిన ఇతర జిల్లాలకు ఏటా రూ.10 కోట్ల నిధులను అందిస్తోంది. వీటితో ఆయా చోట్ల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ప్రజల జీవితాలను మెరుగుపర్చే చర్యలు చేపడుతున్నారు.
పద్మవ్యూహంలో మావోయిస్టులు
కేంద్ర సర్కారు పకడ్బందీగా రచించిన పద్మవ్యూహం నుంచి బయటపడ లేకే మావోయిస్టుల్లోని చిన్నస్థాయి క్యాడర్ నుంచి అగ్రనేతల దాకా లొంగుబాటు బాట పట్టారు. గత బుధవారం (అక్టోబరు 15న) మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు సహా 61 మంది మావోయిస్టులు మహారాష్ట్రలోని గడ్చిరోలిలో లొంగిపోవడాన్ని ఈ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. వేణుగోపాలరావు తలపై రూ.6 కోట్ల వరకు రివార్డు ఉంది. ఎన్‌కౌంటర్లు కావచ్చు, లొంగుబాట్లు కావచ్చు, కారణం ఏదైనా సరే అగ్రనేతలు దూరం అవుతుండటంతో మావోయిస్టు ఉద్యమానికి దిశానిర్దేశం చేసే నాయకత్వ లేమి ఏర్పడుతోంది. మరోవైపు మావోయిస్టుల ఆర్థిక మూలాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చిదిమేశాయి. వారికి సంబంధించిన కోట్లాది రూపాయలను సీజ్ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద పలువురిపై కేసులు నమోదు చేశారు. మావోయిస్టులకు నిధులు అందించే వారిని జైలులో పెట్టారు.
2014 - 2025 మధ్యకాలంలో ఏమేం మారాయి?
- 2014 నుంచి 2025 మధ్యకాలంలో దేశంలో మావోయిస్టు సంబంధిత సంఘటనలు గణనీయంగా తగ్గాయి. ఈ వ్యవధిలో 15 మంది మావోయిస్టు అగ్ర నేతలను భద్రతా దళాలు అంతం చేశాయి.
- ఛత్తీస్‌గఢ్ - జార్ఖండ్ సరిహద్దుల్లోని బుధ పహార్ అడవులు, బిహార్ - జార్ఖండ్ సరిహద్దుల్లోని చకర్బంధ అడవులపై మావోయిస్టులకు పట్టు లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు.
- 2014 నాటికి దేశంలో మావోయిస్టు సంబంధిత ఘటనలు చోటుచేసుకున్న 330 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇప్పుడు వాటి సంఖ్య 104 మాత్రమే.
- గతంలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం విస్తీర్ణం 18,000 చదరపు కిలోమీటర్లు. ఇప్పుడది 4,200 చదరపు కిలోమీటర్లే.
- 2004 నుంచి 2014 మధ్యకాలంలో దేశంలో మొత్తం 16,463 మావోయిస్టు హింస సంఘటనలు జరగగా, 2014 - 2024 మధ్యకాలంలో ఇలాంటి 7,744 ఘటనలే జరిగాయి. అంటే మావోయిస్టుల హింసాకాండ 53 శాతం తగ్గింది.
- గత పదేళ్లలో మావోయిస్టుల దాడుల్లో భద్రతా దళాల మరణాలు 73 శాతం తగ్గి 1,851 నుంచి 509కి చేరుకున్నాయి. మావోయిస్టుల దాడుల్లో మరణించిన భద్రతా దళాల సంఖ్య 2022లో 100లోపే ఉంది. ఈ సంఖ్య ఇంత తక్కువగా ఉండటం గత 30 ఏళ్లలో ఇదే తొలిసారి.
- మావోయిస్టుల దాడులను తట్టుకొని నిలువగల బలవర్థక పోలీసు స్టేషన్ల సంఖ్య 2014 నాటికి 66 మాత్రమే. ఇప్పుడు వీటి సంఖ్య 612.
- గత ఐదేళ్లలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో 302 కొత్త భద్రతా శిబిరాలను, 68 నైట్ ల్యాండింగ్ హెలిప్యాడ్‌లను కేంద్ర సర్కారు ఏర్పాటు చేయించింది.
ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్ల పర్వం
- 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు దేశంలో 312 మంది మావోయిస్టులను అంతం చేశారు. వీరిలో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి, ఎనిమిది మంది ఇతర పొలిట్‌బ్యూరో/కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. 836 మందిని అరెస్టు చేశారు. 1,639 మంది సరెండర్ అయ్యారు.
- 2024లో దేశంలో 290 మంది మావోయిస్టులు హతమయ్యారు. 1,090 మంది అరెస్టయ్యారు. 881 మంది సరెండర్ అయ్యారు.
- 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు బీజేపీ పాలిత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 477 మంది మావోయిస్టులు హతమయ్యారు. 1,785 మందిని అరెస్టు చేయగా, 2,100 మంది సరెండర్ అయ్యారు.
- 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్, ఇతర ప్రభావిత ప్రాంతాల్లో 13,000 మందికిపైగా మావోయిస్టు ఉద్యమం నుంచి బయటికొచ్చి జనజీవన స్రవంతిలో కలిశారు.
- 2023 సంవత్సరంలో దేశంలో 380 మంది మావోయిస్టులు అంతమయ్యారు. 1,194 మందిని అరెస్టు చేశారు. 1,045 మంది లొంగిపోయారు.
మావోయిస్టుల లొంగుబాటుకు ప్రధాన కారణాలు ఇవే!
- కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు తీవ్రవాదంపై కఠినమైన వైఖరిని అవలంభిస్తోంది. మావోయిస్టుల ఏరివేత కోసం భద్రతా కార్యకలాపాలను ముమ్మరం చేయడంపై ప్రత్యేక ఫోకస్ పెడుతోంది. దీనిపై భారీగా నిధులను వెచ్చిస్తోంది.
- మావోయిస్టుల పలువురు అగ్ర నేతలు ఎన్‌కౌంటర్ అయ్యారు. ఇంకొందరు సరెండర్ అయ్యారు. మరికొందరు వయసు కారణంగా ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈనేపథ్యంలో మావోయిస్టు ఉద్యమం నాయకత్వ లేమిని ఎదుర్కొంటోంది. నాయకత్వం కోసం నేతల నడుమ అంతర్గత కలహాలు, వర్గ విభేదాలు జరుగుతున్నాయి.
- లొంగిపోయే మావోయిస్టుల కోసం పునరావాస పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకోవడానికి మావోయిస్టులు ఆసక్తి చూపుతున్నారు.
- సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), కోబ్రా బెటాలియన్లు, రాష్ట్ర పోలీసులు నిరంతరం నిర్వహిస్తున్న ఆపరేషన్లు మావోయిస్టులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
- మావోయిస్టులకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఆహార సామగ్రి, నిధులు, ఇతర వనరులు అందే సప్లై చైన్లను భద్రతా బలగాలు, పోలీసులు కట్ చేశారు.
- ఏజెన్సీ ప్రాంతాల ప్రజల మద్దతును మావోయిస్టు ఉద్యమం కోల్పోతోంది. ఆయా చోట్ల డెవలప్‌మెంట్ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిర్వహిస్తోంది.
- పోలీసులకు లొంగిపోయే క్రమంలో మావోయిస్టులు తమతో పాటు ఆయుధ నిల్వలను కూడా తీసుకెళ్తున్నారు. దీంతో మావోయిస్టులకు ఆయుధాల కొరత సైతం ఏర్పడుతోంది. మావోయిస్టులు అప్పగించే ఆయుధాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా డబ్బులను పే చేస్తోంది.
- మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో కొత్త భద్రతా శిబిరాలు ఏర్పాటయ్యాయి. మావోయిస్టుల దాడిని తట్టుకోగలిగే ఫోర్టిఫైడ్ పోలీస్ స్టేషన్ల సంఖ్య పెరిగింది.
- మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి.
మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు - ఏ రాష్ట్రం, ఏ వ్యూహం?
తెలంగాణ :
- ఫోకస్ : సరిహద్దు భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. పొరుగు రాష్ట్రాలతో నిఘా భాగస్వామ్యం చేసుకొని ముందుకు సాగుతున్నారు.
- చొరవ : రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలలో ఛత్తీస్‌గఢ్‌తో కలిసి సంయుక్త ఆపరేషన్లు చేపడుతున్నారు.
- గిరిజన జిల్లాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు.
- అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద కదలికలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్ :
- ఫోకస్ : భద్రతా కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, గిరిజన సంక్షేమంపై ఈ రాష్ట్రం ఫోకస్ పెట్టింది.
- చొరవలు : డీఆర్‌జీ, కోబ్రా వంటి ప్రత్యేక దళాలను ఏజెన్సీ ప్రాంతాల్లో మోహరించారు. రోడ్ రిక్వైర్‌మెంట్స్ ప్లాన్-1 కింద రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులను చేపట్టారు.
- లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస పథకాలతో ప్రయోజనాలు కల్పించారు.
జార్ఖండ్ :
- ఫోకస్ : నిఘా ఆధారిత కార్యకలాపాలపై ఈ రాష్ట్రం ఫోకస్ పెట్టింది. యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలను పెంచింది.
- చొరవ : గిరిజన యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ఈ రాష్ట్రం అమలు చేసింది.
- స్థానిక పోలీసులకు అధునాతన ఆయుధ వ్యవస్థలను అందించింది.
- మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల నమ్మకాన్ని పొందేందుకు కమ్యూనిటీ పోలీసింగ్‌ను పెంచారు.
మహారాష్ట్ర :
- ఫోకస్ : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఆయా ప్రాంతాల్లో సామాజిక అభివృద్ధికి పలు కార్యక్రమాలను అమలు చేశారు.
- చొరవ : గడ్చిరోలి అడవుల్లో డ్రోన్లతో నిఘా వ్యవహారాలను చేపట్టింది. మావోయిస్టుల కదలికలను నిర్దిష్టంగా గుర్తించేందుకు శాటిలైట్ ఫొటోలను వాడుకుంటోంది.
- మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విద్య, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తోంది. ఈ ఏరియాల్లోని యువతకు వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ అందిస్తోంది.
- లొంగిపోయే మావోయిస్టులకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తున్నారు.
ఒడిశా :
- ఫోకస్ : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును వేగవంతం చేశారు. అర్హులు అందరికీ వీటి ఫలాలు దక్కేలా చూస్తున్నారు.
- చొరవలు : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీని పెంచారు. ప్రజలకు బ్యాంకింగ్ యాక్సెస్‌ను విస్తరించారు.
- ఆయా ప్రాంతాల ప్రజలకు జీవనోపాధి అవకాశాలను పెంచారు.
- సరిహద్దు భద్రత కోసం పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకున్నారు.
బిహార్ :
- ఫోకస్ : చట్టాల అమలు, గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
- చొరవ : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లను బలోపేతం చేశారు.
- ఆయా ఏరియాల్లోని మారుమూల పల్లెల్లో విద్యుద్దీకరణ ఏర్పాట్లు చేశారు. నీటి సరఫరా పథకాలను నిర్మించారు.
- లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసాన్ని కల్పించారు.
మావోయిస్టుల హింసాకాండ తగ్గింది- సరెండర్లు పెరిగాయ్!
| సంవత్సరం | మావోయిస్టు హింసాత్మక ఘటనలు | సరెండర్స్ |
| 2003 | 1 | 27 |
| 2005 | 3 | 188 |
| 2006 | 1 | 2 |
| 2007 | 4 | 83 |
| 2008 | 1 | 2 |
| 2009 | 1 | 2 |
| 2010 | 1 | 3 |
| 2011 | 5 | 9 |
| 2012 | 6 | 18 |
| 2013 | 12 | 32 |
| 2014 | 78 | 393 |
| 2015 | 39 | 282 |
| 2016 | 62 | 1232 |
| 2017 | 19 | 327 |
| 2018 | 28 | 358 |
| 2019 | 42 | 231 |
| 2020 | 38 | 238 |
| 2021 | 56 | 328 |
| 2022 | 44 | 184 |
| 2023 | 46 | 201 |
| 2024 | 57 | 332 |
| 2025 | 62 | 859 |
| మొత్తం | 606 | 5331 |
సరైన సమయంలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తాం: అమిత్ షా
బ్రహ్మోస్ పరిధిలోనే పాకిస్థాన్‌లోని ప్రతీ ఇంచు భూమి: రాజ్‌నాథ్ సింగ్

