ETV Bharat / bharat

కార్పొరేట్ జాబ్​కు గుడ్​బై- 45 డిగ్రీల ఎండలో యాపిల్​ సాగు- ఎకరాకు రూ.2.5లక్షల సంపాదన!

నెలకు రూ.50 వేల జీతం వచ్చే ఉద్యోగానికి నో చెప్పి వ్యవసాయం- ఒకే ఎకరంలో సుమారు 1,500 ఆపిల్ మొక్కలతో తోట-

Apple Farming Haryana
Apple Farming Haryana (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 10, 2026 at 11:01 PM IST

3 Min Read
Choose ETV Bharat

Apple Farming Haryana : సాధారణంగా యాపిల్ పండ్లు అంటే హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ వంటి చల్లని ప్రాంతాలే గుర్తుకు వస్తాయి. కానీ హరియాణాలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే మండుటెండలోనూ యాపిల్ తోటను విజయవంతంగా పెంచి అందరినీ ఆశ్చర్యపరిచారు ఓ యువ రైతు. కంప్యూటర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న ఆయన వేల జీతాన్ని వదిలి వ్యవసాయాన్ని ఎంచుకుని ఇప్పుడు లక్షల రూపాయల ఆదాయం పొందుతూ ఆదర్శ రైతుగా నిలుస్తున్నారు. అసలు ఎవరా రైతు? ఎందుకు హరియాణా వంటి తీవ్రమైన ఎండలు ఉండే ప్రాంతంలో ఆపిల్స్​ను పండిస్తున్నారు? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రూ.50 వేల జీతం వదిలి వ్యవసాయం
హరియాణాలోని కురుక్షేత్ర జిల్లా బాబక్‌పుర్ గ్రామానికి చెందిన విక్రమ్‌జిత్ సింహ్​ కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో ఎం.టెక్ పూర్తి చేశారు. అనంతరం ఓ ప్రతిష్టాత్మక ప్రైవేట్ కంపెనీలో నెలకు రూ.50 వేల జీతంతో ఉద్యోగం ప్రారంభించారు. అయితే ఆయన ఆ ఉద్యోగ జీవితంతో ఎటువంటి సంతృప్తి చెందలేదు. అందుకే చేస్తున్న ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి, స్వగ్రామానికి తిరిగి వచ్చేశారు. అనంతరం వ్యవసాయ రంగంలో కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు.

Apple Farming Haryana
విక్రమ్‌జిత్ సింహ్ తోటలోని ఆపిల్​ చెట్టు (ETV Bharat)

వేల నుంచి లక్షల్లోకి ఆదాయం
అలా విక్రమ్‌జిత్ నాలుగు సంవత్సరాల క్రితం యాపిల్​ పండ్ల తోటను స్థాపించారు. ఆ తోట ఇప్పుడు ఎర్ర యాపిల్ పండ్ల చెట్లతో నిండి, పూర్తి స్థాయిలో దిగుబడిని ఇస్తోంది. ప్రస్తుతం ఒక్కో చెట్టు నుంచి సుమారు 5 కిలోల పండ్లు వస్తున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లో కిలోకు రూ.120, రిటైల్ మార్కెట్లో రూ.160 నుంచి రూ.200 వరకు ధర పలుకుతోంది. ఈ సీజన్‌లో ఒక్క ఎకరం నుంచి సుమారు రూ.2.5 లక్షల ఆదాయం వస్తుందని విక్రమ్‌జిత్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Apple Farming Haryana
8 ఎకరాల్లో జామ, లిచ్చి, పియర్ వంటి పండ్లను పండిస్తున్న విక్రమ్​జిత్​ (ETV Bharat)

ఒకే ఎకరంలో 1,500 ఆపిల్ మొక్కలు
ప్రస్తుతం విక్రమ్‌జిత్ 1.5 ఎకరాల్లో యాపిల్ తోటను ఏర్పాటు చేయడంతో పాటు మరో 8 ఎకరాల్లో జామ, లిచ్చి, పియర్ వంటి పండ్లను కూడా సాగు చేస్తున్నారు. అత్యధిక సాంద్రత వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ ఒకే ఎకరంలో సుమారు 1,500 యాపిల్ మొక్కలను నాటారు. వాటి మధ్య 6 అడుగులు వెడల్పు, 4 అడుగుల పొడవు దూరాన్ని ఏర్పాటు చేశారు. బిందు సేద్యం ద్వారా నీటిని ఆదా చేస్తూ మెరుగైన దిగుబడులు సాధిస్తున్నారు. హరియాణాలోని వాతావరణానికి అనుకూలంగా ఉండే 'అన్నా', 'గోల్డెన్ డోర్సెట్' రకాల ఆపిల్ మొక్కలను హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ నుంచి తెప్పించి సాగు చేస్తున్నారు. ఈ రెండు రకాలు వేడిని తట్టుకుని మంచి దిగుబడిని ఇస్తాయని ఆయన తెలిపారు.

Apple Farming Haryana
ముఖ్యమంత్రి నయాబ్ సింగ్​ సైనీతో విక్రమ్‌జీత్‌ను (ETV Bharat)

"మండుటెండలోనూ నాణ్యమైన యాపిల్ పంటను పండించడం ఇతర రైతులకు స్ఫూర్తిదాయకం. సంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా ఆలోచించి, ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలో వినియోగిస్తే రైతులు అధిక ఆదాయం పొందవచ్చని విక్రమ్‌జిత్ నిరూపించారు."
- డాక్టర్ శివేందు ప్రతాప్ సోలం, కురుక్షేత్ర జిల్లా ఉద్యానవన అధికారి

కుమారుడి విజయంపై తండ్రి గర్వం
"ఈ విజయం నాది మాత్రమే కాదు. హరియాణా వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులది. ఆధునిక పద్ధతులు అనుసరిస్తే రైతులు కూడా మంచి ఆదాయం పొందవచ్చని నిరూపించాలనుకున్నాను" అని విక్రమ్‌జిత్ తెలిపారు. తన కొడుకు సాధించిన విజయంపై తండ్రి గుర్మీత్ సింహ్​ గర్వం వ్యక్తం చేశారు. కుటుంబం తరతరాలుగా వరి, గోధుమ పంటలు సాగు చేస్తోందని, అయితే విక్రమ్‌జిత్ కొత్తగా ఆలోచించి ఉద్యానవన సాగును ఎంచుకున్నాడని ఆయన చెప్పారు. ప్రస్తుతం విక్రమ్​జిత్​ ఇతర రైతులకు కూడా యాపిల్ సాగుపై శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు.

Apple Farming Haryana
8 ఎకరాల్లో జామ, లిచ్చి, పియర్ వంటి పండ్లను పండిస్తున్న విక్రమ్​జిత్​ (ETV Bharat)

3.3 కిలోల 'బాహుబలి కీర'- సేంద్రీయ పద్ధతుల్లోనే సాగు చేసిన రైతు

ఒకప్పటి నక్సల్ కంచుకోటలో ఖరీదైన మామిడి సాగు- కిలో పండ్ల ధర రూ.లక్షల్లోనే!