ETV Bharat / bharat

SIRపై అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళతాం : మమతా బెనర్జీ

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై మమతా బెనర్జీ మండిపాటు

Mamata Banerjee on SIR
Mamata Banerjee on SIR (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : January 5, 2026 at 4:40 PM IST

2 Min Read
Choose ETV Bharat

Mamata Banerjee on SIR : బంగాల్​లో జరుగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై (SIR) మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. SIR ప్రక్రియను అమానవీయ ప్రవర్తనగా అభివర్ణించిన ఆమె, దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. అధికారుల వేధింపులు, భయంతో అనేక మంది మరణించడంతో పాటు ఆస్పత్రి పాలవుతున్నట్లు చెప్పారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మురిగంగాలో వంతెన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఎస్​ఐఆర్​కు వ్యతిరేకంగా వ్యక్తిగతంగా పిటిషన్ దాఖలు చేస్తారా లేకా ప్రభుత్వ పరంగా అన్న విషయాన్ని మమతా బెనర్జీ వివరించలేదు.

SIR ప్రక్రియలో భాగంగా అనుసరిస్తున్న అమానవీయ ప్రవర్తన వల్ల అనేక మంది మరణిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మంగళవారం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అవసరమైతే సుప్రీం కోర్టుకు కూడా వెళ్లి సాధారణ పౌరురాలిగా వాదిస్తా. ఇంకా నేను శిక్షణ పొందిన న్యాయవాదిని కూడా. గంగాసాగర్ సేతు డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. ఈ క్రమంలోనే గంగసాగర్​, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది. దీని టెండర్​ ఎల్​ అండ్ టీ సంస్థకు అప్పగించాం. ఈ రోజు శంకుస్థాపన చేశాం. వచ్చే 2-3 ఏళ్లలో ఈ వంతెన పూర్తి అవుతుందని ఆశిస్తున్నాం. ఈ అత్యాధునిక బ్రిడ్జికి సుమారు రూ. 1700 కోట్లు ఖర్చు అవుతుంది.

--మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు తమ ఓటు హక్కును పొందేందుకు తప్పనిసరిగా లైన్లలో నిలబడాల్సి వస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే బీజేపీపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బంగాలీలో మాట్లాడుతున్న వలస కార్మికులపై దాడులు చేస్తూ హింసకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. తనను చంపినా సరే, బంగాలీలో మాట్లాడడాన్ని ఆపివేయనని స్పష్టం చేశారు. "ఒకవేళ బీజేపీకి చెందిన నేతల తల్లిదండ్రుల వారి ఓటు హక్కును, గుర్తింపును పొందేందుకు ఇలా లైన్లలో నిలబడితే వారికి ఎలా ఉంటుంది? ఎస్​ఐర్​ ప్రక్రియ మొదలైన నాటి నుంచి అనేక మంది భయంతో చనిపోతున్నారు. బీజేపీకి ఏ మతంపై కూడా నమ్మకం లేదు. అది కేవలం అబద్దాలను ప్రచారం చేయడంపైనే నమ్మకం పెట్టుకుంది. ఎన్నికల ముందు వారు రూ. 10,000 ఇస్తారు. కానీ, ఎన్నికల ముగిసిన తర్వాత బుల్డోజర్లు తీసుకువస్తారు." అని అన్నారు.

బంగాల్‌లో SIR నిలిపివేయాలని ఈసీకి విజ్ఞప్తి
అంతకుముందు ఎన్నికల సంఘంపై బంగాల్ సీఎం మమత బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏకపక్షంగా, లోపభూయిష్టంగా ఉన్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కసరత్తు (SIR)ను బంగాల్‌లో నిలిపివేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌కు విజ్ఞప్తిచేశారు. ప్రస్తుత రూపంలో సర్‌ను కొనసాగిస్తే అనేకమంది తమ ఓటుహక్కును కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పునాదులపై ఇదొక దాడిగా అభివర్ణించారు. ఈ మేరకు ఘాటైన పదజాలంతో సీఈసీకి లేఖ రాశారు. ఏమాత్రం ప్రణాళిక, సన్నద్ధత లేకుండా తాత్కాలిక పద్ధతుల్లో, తీవ్ర అవకతవకలతో, విధాన ఉల్లంఘనలతో సర్‌ను ఈసీ కొనసాగిస్తోందని విరుచుకుపడ్డారు. ఇప్పటికే రెండు లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్నాయని పేర్కొన్నారు. సరిదిద్దలేనంత నష్టం జరగడానికి ముందే ఈ కసరత్తును ఆపాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయిలో సర్ లక్ష్యాలేమిటో తెలియని స్థితిలో ఈసీ ఉందని మమత విమర్శించారు. ఐటీ వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి ఓటర్ల పేర్లను తొలగిస్తున్న దాఖలాలు ఉన్నాయని, దీనంతటికీ ఈసీయే జవాబుదారీ కావాలన్నారు.