ETV Bharat / bharat

దిల్లీలో హోటల్ అగ్నిప్రమాదం- యజమానిపై హత్య కేసు- మేనేజర్ కోసం గాలింపు

దిల్లీలోని మాలవీయ నగర్ హోటల్ అగ్నిప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం- హోటల్ యజమాని లవ్‌కేశ్ బజాజ్ అరెస్ట్- పరారీలో ఉన్న మేనేజర్ కోసం దిల్లీ పోలీసుల గాలింపు

Delhi Fire Accident Hotel Owner
Malviya Nagar Hotel owner, Lovkesh Bajaj (Delhi Police)
author img

By ETV Bharat Telugu Team

Published : June 4, 2026 at 11:45 AM IST

3 Min Read
Choose ETV Bharat

Delhi Fire Accident Hotel Owner : దిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో హోటల్ యజమాని లవ్‌కేశ్ బజాజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రస్తుతం పరారీలో ఉన్న హోటల్ మేనేజర్ కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

ఘటనపై మాలవీయ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు, హోటల్ యజమాని లవ్‌కేశ్ బజాజ్‌పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని 105, 326(g), 324(5), 125(a), 125(b), 287 సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. నేరపూరిత హత్యకు సమానమైన చర్యలు, అగ్నిప్రమాదం ద్వారా ఆస్తి నష్టం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించడం వంటి ఆరోపణలను చేర్చారు. ప్రమాదానికి కారణమైన నిర్లక్ష్యంపై ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగుతోంది.

'నిర్వహణ బాధ్యతలు వేరొకరికి అప్పగించాను'
అరెస్టు అనంతరం జరిగిన విచారణలో లవ్‌కేశ్ బజాజ్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. హోటల్ నిర్వహణను స్వయంగా పర్యవేక్షించే సమయం తనకు లేదని, రోజువారీ కార్యకలాపాలన్నీ మరో వ్యక్తికి అప్పగించినట్లు పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. బిల్లింగ్, ఖాతాలు, నిర్వహణ వ్యవహారాలు అన్నీ అదే వ్యక్తి చూసుకునేవాడని విచారణలో పేర్కొన్నట్లు సమాచారం. హోటల్‌లో గదుల పరిమాణం పెంచడం, ఇతర నిర్మాణ మార్పులు చేయాలని కొందరు సూచించారని, అలాంటి మార్పులు సాధారణమేనని తనకు చెప్పినట్లు బజాజ్ విచారణలో వెల్లడించినట్లు వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, హోటల్‌కు తప్పనిసరిగా ఉండాల్సిన ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) లేకపోయిన విషయాన్ని కూడా అంగీకరించినట్లు సమాచారం.

భద్రతా నిబంధనల ఉల్లంఘనపై అనుమానాలు
ప్రాథమిక విచారణలో భవనంలో తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతిథులు బయటకు వెళ్లేందుకు ఒకే ప్రవేశ, నిష్క్రమణ మార్గం మాత్రమే ఉండటం, కిటికీలు మూసివేయబడటం, ప్రధాన ద్వారం సెన్సార్ ఆధారంగా పనిచేయడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఇవే ప్రాణనష్టాన్ని మరింత పెంచినట్లు అధికారులు భావిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారా లేదా అన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.

రికార్డుల పరిశీలనలో పోలీసులు
ప్రస్తుతం హోటల్‌కు సంబంధించిన విద్యుత్ శాఖ, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ విభాగాల అనుమతులను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిర్మాణ మార్పులకు అధికారిక అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై కూడా విచారణ జరుగుతోంది. అదనంగా, నిందితుడికి సంబంధించిన ఇతర ఆస్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. హోటల్ యాజమాన్యం, నిర్వహణ బాధ్యతలు ఎవరి వద్ద ఉన్నాయనే అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు.

దర్యాప్తులో భాగంగా, కేంద్ర ప్రభుత్వ బీఎన్‌బీ పథకం కింద ఈ భవనానికి కేవలం ఆరు డబుల్ బెడ్ రూమ్స్​ నిర్వహణకు మాత్రమే అనుమతి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే హోటల్‌లో బేస్‌మెంట్‌తో కలిపి మొత్తం 25 గదులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భవనాన్ని బజాజ్ 2022లో కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతకుముందు అక్కడ ఖాదీ దుకాణం ఉండేదని విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది.

బుధవారం జరిగిన ఈ అగ్నిప్రమాదంలో మొత్తం 21 మంది మరణించారు. వారిలో 12 మంది విదేశీ పౌరులు, 9 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 58 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి సమీప ఆస్పత్రులకు తరలించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు అతిథులు బయటకు రాలేకపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సహాయక చర్యలు చేపట్టినప్పటికీ భారీ ప్రాణనష్టం సంభవించింది.

తెలంగాణ, గుజరాత్​ డ్రగ్ నెట్​వర్క్​ల గుట్టు రట్టు- రూ.100 కోట్ల మాదకద్రవ్యాలు సీజ్​!

ఉత్తరాఖండ్‌లో పాక్ కుట్రలు- సోషల్ మీడియా ద్వారా ఉగ్ర నెట్‌వర్క్ ఏర్పాటుకు యత్నాలు!