ETV Bharat / bharat

'నేపాల్​లో చిక్కుకున్న భారతీయుల కోసం NDRF బలగాలు మోహరించాలి'- కేంద్రానికి ఖర్గే లేఖ

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న భారతీయులను త్వరగా స్వదేశానికి తీసుకురావాలని ఖర్గే విజ్ఞప్తి- అవసరమైన ప్రాంతాల్లో ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలను మోహరించాలని అమిత్‌ షాకు లేఖ

Kharge On Nepal Floods
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : August 29, 2026 at 11:21 AM IST

3 Min Read
Choose ETV Bharat

Kharge On Nepal Floods : నేపాల్​లో భీకర వరదల కారణంగా నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరావాస చర్యలను మరింత ముమ్మరం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షాను కోరారు. ముఖ్యంగా నేపాల్​లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి అత్యవసర చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

అవసరమైన ప్రాంతాల్లో జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్​డీఆర్​ఎఫ్​) బృందాలను నేపాల్​కు పంపే అంశాన్ని పరిశీలించాలని ఖర్గే లేఖలో పేర్కొన్నారు. నేపాల్​ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రక్షణ, తరలింపు, సహాయక చర్యల్లో ఎన్​డీఆర్​ఎఫ్ సిబ్బందిని వినియోగించాలని సూచించారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో ఎన్​డీఆర్​ఎఫ్​కు ఉన్న అనుభవం, సాంకేతిక నైపుణ్యం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. అదే సమయంలో నేపాల్‌ ప్రజలకు అవసరమైన మానవతా, సహాయక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఖర్గే కోరారు.

'భారతీయులను సురక్షితంగా తీసుకురావాలి'
నేపాల్‌లో వరదల కారణంగా భారతీయులు, భారత సంతతికి చెందిన పలువురు చిక్కుకుపోయారని ఖర్గే తెలిపారు. విదేశాంగ శాఖ తాజా సమాచారం ప్రకారం సుమారు 320 మంది భారతీయులు ఆచూకీ తెలియకుండా ఉన్నారని తన లేఖలో పేర్కొన్నారు. వారిని గుర్తించి, అవసరమైన సహాయం అందించి, వీలైనంత త్వరగా సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. వేలాది మంది ఆహారం, మందులు, నివాసం వంటి కనీస అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారని ఖర్గే పేర్కొన్నారు. ఆగస్టు 26న రసువా జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదలు భారీ విధ్వంసం సృష్టించాయి. నేపాల్‌లో మృతుల సంఖ్య 579కు చేరగా, గల్లంతైన వారి సంఖ్య 1,924కు పెరిగింది కాగా, విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, 84 మంది భారతీయులను ఇప్పటికే రక్షించారు. వీరిలో తమిళనాడుకు చెందిన 21 మంది శుక్రవారం భారత్‌కు చేరుకున్నారు. మరో 63 మంది త్రిశూలి-1 జలవిద్యుత్‌ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు.

నేపాల్‌కు చేరిన 11 మంది భారత బృందం
ఇదిలా ఉండగా నేపాల్‌లో సహాయక చర్యలకు మద్దతుగా 11 మంది సభ్యులతో కూడిన భారత బృందం శనివారం నేపాల్‌కు చేరుకుంది. నేపాల్‌ ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు ఈ బృందాన్ని పంపినట్లు భారత రాయబార కార్యాలయ వర్గాలు తెలిపాయి. బృందంలో వైద్య సిబ్బందితో పాటు సొరంగాల రక్షణలో నైపుణ్యం ఉన్న నిపుణులు ఉన్నారు. వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో స్థానిక అధికారులతో కలిసి వీరు రక్షణ చర్యల్లో పాల్గొననున్నారు. నేపాల్‌ ప్రభుత్వం తొలిదశలో తమ భద్రతా బలగాలనే గరిష్ఠంగా వినియోగించాలని భావించినప్పటికీ, ప్రత్యేక సాంకేతిక నైపుణ్యం అవసరమైన చోట అంతర్జాతీయ సాయం తీసుకోవడానికి సిద్ధమని ఇప్పటికే ప్రకటించింది. వరదల్లో మూడు డజన్లకు పైగా వంతెనలు కొట్టుకుపోవడంతో నేపాల్‌లో రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో 42 బైలీ వంతెనల నిర్మాణానికి భారత్‌, చైనాల సాయం కోరింది. త్వరగా ఏర్పాటు చేయడానికి వీలుగా ఉండే ఈ తాత్కాలిక వంతెనలు రవాణా మార్గాలను పునరుద్ధరించడంలో కీలకంగా మారనున్నాయి.

స్వస్థలానికి చేరుకున్న తమిళనాడు యాత్రికులు
నేపాల్‌ విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడిన 21మంది తమిళనాడు యాత్రికులు సురక్షితంగా స్వస్థలానికి చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో కన్నీటి దృశ్యాలు, భావోద్వేగాల మధ్య వారు తమ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వారు మృత్యుముఖం నుంచి బయటపడిన తీరును వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. కొండల పైనుంచి వరద సునామీలా దూసుకొచ్చిందని, టిమురె ప్రాంతంలోని మార్కెట్ మొత్తం తమ కళ్లముందే కొట్టుకుపోయిందని గద్గదస్వరంతో చెప్పారు. అనేక కష్టాలు పడి బార్డర్ పోలీస్ అవుట్‌పోస్ట్‌కు చేరుకున్న తమిళనాడు యాత్రికులకు నేపాల్ సైనికులు, అధికారులు ఆశ్రయం కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కాఠ్‌మాండూ నుంచి దిల్లీ మీదుగా ఎయిర్​ఇండియా విమానంలో వారు చెన్నైకి చేరుకున్నారు. తమను కాపాడిన నేపాల్ సైన్యానికి, తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాలకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతి విపత్తుకూ వాతావరణ మార్పులే కారణమని చెప్పడం సరైనది కాదు- శాస్త్రవేత్తల హెచ్చరిక

1.77 అంగుళాలు వంగిన భాక్రా నంగల్ డ్యామ్ గోడ- క్లారిటీ ఇచ్చిన కేంద్రం