Telangana Panchayat Elections Results2025

ETV Bharat / bharat

జంతువుల ఎముకలతో కళాఖండాలు తయారీ- దేశవిదేశాల్లో వాటికి ఫుల్ డిమాండ్- ధర తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే!

లఖ్​నవూకు చెందిన 250 ఏళ్ల క్రితం నాటి హస్తకళ- జంతువుల ఎముకలతో అందమైన ఉత్పత్తులు తయారీ

Animal Bones Products
Animal Bones Products (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : October 18, 2025 at 7:46 PM IST

4 Min Read
Choose ETV Bharat

Animal Bones Products : ఉత్తర్​ప్రదేశ్​లో హస్తకళాకారులు జంతువుల ఎముకలతో అందమైన, విలువైన వస్తువులను తయారుచేస్తున్నారు. 250 ఏళ్ల క్రితం నాటి ఈ హస్తకళతో 200 మంది ఉపాధి పొందుతున్నారు. జంతువుల ఎముకలతో స్టాండింగ్ ల్యాంప్స్, మొబైల్ హ్యాంగింగ్ స్టాండ్స్​, చెవిపోగుల సెట్లు, నగల పెట్టెలు, ఫొటో ఫ్రేమ్​లు, ఏనుగు బొమ్మలు, షోపీస్​లు, చెస్ బోర్డులను తయారుచేసే చేసి ఔరా అనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ హస్తకళ యూపీలోని లఖ్​నవూలో మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో జంతువుల ఎముకలతో అందమైన వస్తువులను ఎలా తయారుచేస్తారు? వాటి ధర ఎంత ఉంటుంది? తదితర విషయాలు తెలుసుకుందాం.

మొఘలుల కాలం నుంచే మొదలు
ఈ హస్తకళ మొఘలుల కాలంలో ఉద్భవించిందని చెబుతారు. దీనికి ఎటువంటి డాక్యుమెంటరీ ఆధారాలు లేవు. అయితే నవాబుల యుగంలో జంతువుల ఎముకలతో అందమైన వస్తువులను తయారుచేసే హస్తకళ అపారమైన గౌరవాన్ని పొందింది. అలాగే నవాబులు ఈ హస్తకళలో నైపుణ్యం ఉన్నవారిని ప్రోత్సహించారు. ఇదే విషయాన్ని నవాబుల మూడో తరం వారసుడు మసూద్ అబ్దుల్లా సైతం వెల్లడించారు. తొలుత జంతువుల దంతాలతో చదరంగం బోర్డులు, కల్మా సహా మరికొన్నింటిని తయారు చేశారు. 1980లో వన్యప్రాణుల చట్టం వచ్చిన తర్వాత ఏనుగు దంతాలతో వస్తువులను తయారు చేయడం ఆపేశారు. ఒంటె, గేదె ఎముకలతో అందమైన ఉత్పత్తులను తయారుచేయడం ప్రారంభించారు.

Animal Bones Products
జంతువుల ఎముకలతో తయారు చేసిన వస్తువులు (ETV Bharat)

అంత ఈజీ కాదు!
అయితే ఈ హస్తకళ చాలా సున్నితత్వం, కచ్చితత్వంలో కూడుకున్నది. ఓపికతో వస్తువులను తయారుచేయాలి. ఎముకలపై సుత్తి, ఉలితో నిదానంగా తాము అనుకున్న వస్తువును తయారు చేస్తుంటారు. కొన్నిసార్లు ఒక వస్తువు తయారీకి చాలా రోజులు పడుతుంది. జంతువుల ఎముకలతో స్టాండింగ్ లాంప్స్, మొబైల్ హ్యాంగింగ్ స్టాండ్​లు, చెవిపోగుల సెట్లు, నగల పెట్టెలు, ఫొటో ఫ్రేమ్​లు, షోపీస్​లు, చెస్ బోర్డులు వంటి అందమైన ఉత్పత్తులను తయారుచేస్తారు. ఈ ఉత్పత్తులు లఖ్​నవూ నగరం, యూపీలోని అన్ని మార్కెట్లలో అమ్ముడవుతాయి. ఆన్​లైన్​లో కూడా వీటికి ఫుల్ డిమాండ్ ఉంది. అలాగే ఈ ప్రొడక్ట్స్ విదేశాలకు కూడా రవాణా అవుతాయి. జంతువులను ఎముకలతో అందంగా తయారుచేసిన ఈ వస్తువుల ధరలు రూ.100- రూ.2 లక్షల వరకు ఉంటాయి. అత్యంత చౌకైనవి చెవిపోగులు కాగా, అత్యంత ఖరీదైనది స్టాండింగ్ ల్యాంప్. ఈ స్టాండ్ ల్యాంప్ ధర రూ.2 లక్షలు. దీని ఎత్తు 5 అడుగులు.

Animal Bones Products
జంతువుల ఎముకలతో తయారు చేసిన ఏనుగు బొమ్మలు (ETV Bharat)

రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు
సజ్జద్​బాగ్​లోని గోల్ దర్వాజాలోని ఒక ఫ్యాక్టరీలో జలాలుద్దీన్ కళాకారుడిగా పనిచేస్తున్నాడు. అలాగే ఆయన ఈ వస్తువులను విక్రయించే వ్యాపారం కూడా చేస్తున్నాడు. తన మామ నుంచి ఈ కళను నేర్చుకున్నాడు. ఇప్పుడు చాలా మంది యువకులకు దీనిని నేర్పించాడు. ఈ హస్తకళలో మంచి నైపుణ్యం కనబర్చినందుకు జలాలుద్దీన్ 2010లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓ అవార్డును అందుకున్నాడు. 2014లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి సత్కారం అందుకున్నాడు.

Animal Bones Products
జంతువుల ఎముకలతో తయారు చేసిన వివిధ రకాల వస్తువులు (ETV Bharat)

'దేశ విదేశాల్లో ఫుల్ డిమాండ్'
గేదె, ఒంటె ఎముకల నుంచి అలంకరణ వస్తువులను తయారుచేసే కళాకారులు లఖ్​నవూలో సుమారు 200 మంది ఉన్నారని జలాలుద్దీన్ తెలిపాడు. "ఈ పని 250 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ కళకు లఖ్​నవూ ప్రధాన కేంద్రం. ఒక కళాఖండాన్ని రూపొందించడానికి దాదాపు ఒక నెల పడుతుంది. చదరంగం బోర్డు తయారీకి రెండు వారాలు పడుతుంది. కళాకారులు రోజుకు రూ.1000-రూ.1200 సంపాదిస్తారు. జంతువుల ఎముకలతో తయారుచేసే ఉత్పత్తులకు దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ డిమాండ్ ఉంది. అమెరికా, దుబాయ్, హాంకాంగ్, సౌదీ అరేబియాకు ఎగుమతి అవుతాయి. భారత ప్రభుత్వం వాటిని అంతర్జాతీయ ప్రదర్శనలకు కూడా చాలాసార్లు పంపింది" అని జలాలుద్దీన్ వివరించాడు.

Animal Bones Products
ఎముకలతో తయారు చేసిన నగలు పెట్టేలు (ETV Bharat)

కొన్ని ప్రదేశాల్లోనే అమ్మకాలు
"ఈ వస్తువులను లఖ్​నవూలోని బడా ఇమాంబారా, దిల్లీలోని జామా మసీదు, కుతుబ్​మినార్, ఆగ్రాలోని తాజ్​మహల్ వంటి చారిత్రక ప్రదేశాలకు సమీపంలో ఉన్న దుకాణాలలో అమ్ముతారు. కొంత మంది మతపరమైన భావాల కారణంగా ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయరు. తాము తయారుచేసే వస్తువులను చూసినప్పుడు అవి జంతువుల ఎముకలతో తయారైనవని ప్రజలు అసలు అనుకోరు. మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు" అని జలాలుద్దీన్ పేర్కొన్నాడు.

Animal Bones Products
జంతువుల ఎముకలతో స్టాండింగ్ ల్యాంప్స్ (ETV Bharat)

'చనిపోయిన జంతువుల ఎముకలనే ఉపయోగిస్తాం'
అలాగే జలాలుద్దీన్ తనయుడు అకీల్ అక్తర్ కూడా ఈ సాంప్రదాయ హస్తకళను నేర్చుకున్నాడు. తాము జంతువులను చంపి ఎముకలను తీస్తామని ప్రజలు అపోహ పడుతున్నారని అన్నాడు. ఇది అసలు నిజం కాదని చెప్పాడు. తాము జంతు కబేళాల నుంచి, సహజంగా చనిపోయిన జంతువుల నుంచి తీసిన ఎముకలను మాత్రమే ఉపయోగిస్తామని వెల్లడించాడు. సోషల్ మీడియా ఈ కళకు కొత్త గుర్తింపు ఇచ్చిందన్నాడు. ఇప్పుడు కళాకారులు ఆన్​లైన్ ఆర్డర్స్​ బట్టి దువ్వెనలు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు, నగల పెట్టెలు, గోడ ఫ్రేమ్​లు, గడియారాలు, దీపాలు, మొబైల్ హ్యాంగింగ్ బాక్స్​లు వంటి ఆధునిక ఉత్పత్తులను తయారు చేస్తున్నారని చెప్పాడు. సాంకేతికత రాకతో పని సులభతరం అయిందని వివరించాడు. గతంలో నెలలు పట్టే పనిని ఇప్పుడు యంత్రాలతో కొన్ని వారాల్లోనే పూర్తి చేస్తున్నామని స్పష్టం చేశాడు. అయినప్పటికీ, అనేక క్లిష్టమైన వస్తువులను ఇప్పటికీ చేతితోనే తయారుచేస్తున్నామన్నాడు.

Animal Bones Products
జంతువుల ఎముకలతో తయారు చేసిన వస్తువులు (ETV Bharat)
Animal Bones Products
జంతువుల ఎముకలతో తయారు చేసిన వస్తువులు (ETV Bharat)
Animal Bones Products
జంతువుల ఎముకలతో తయారు చేసిన వస్తువులు (ETV Bharat)
Animal Bones Products
జంతువుల ఎముకలతో తయారు చేసిన ఏనుగు బొమ్మలు (ETV Bharat)
Animal Bones Products
జంతువుల ఎముకలతో తయారు చేసిన గడియారాలు (ETV Bharat)

దీపావళికి ట్రిప్ ప్లాన్ చేశారా? టైగర్ రిజర్వ్​ పార్క్​కు వెళ్తున్నారా? అయితే కేటుగాళ్లతో జర జాగ్రత్త!

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDAకు బిగ్ షాక్- మధుర అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ