ETV Bharat / bharat

ఇంట్లోని తడి చెత్తతో కంపోస్ట్ తయారీ- 'హోమ్ కంపోస్టింగ్ మెషీన్‌' అభివృద్ధి- యువకుడి వినూత్న స్టార్టప్

చెత్త సమస్యకు పరిష్కారం కనుగొన్న యువ వ్యాపారవేత్త- తడి చెత్తతో కంపోస్ట్ తయారుచేసే యంత్రం అభివృద్ధి- ఇప్పటివరకు 3500 మెషీన్ల అమ్మకాలు- దేశవ్యాప్తంగా సేల్స్

fertilizer at home from wet waste
తడి చెత్తతో ఇంట్లోనే ఎరువు తయారీ (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : September 1, 2026 at 10:50 PM IST

3 Min Read
Choose ETV Bharat

Compost From Wet Waste Machine : ప్రస్తుత కాలంలో దేశంలోని ప్రధాన నగరాలను చెత్త సమస్య వేధిస్తోంది. కొందరు ప్రజలు వీధుల్లోనే వ్యర్థాలను పడేయడంతో చెత్త పేకమేడల్లా పేరుకుపోతోంది. దీంతో దుర్వాసన, దోమల సమస్యతో డస్ట్ బిన్‌ల సమీప ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మహారాష్ట్రలో పుణెకు చెందిన ఓ యువ వ్యాపారవేత్త సార్థ్వ భోండ్వే నడుం బిగించారు. తడి చెత్తతో కంపోస్ట్‌ను తయారుచేసే అద్భుతమైన యంత్రాన్ని రూపొందించారు. ఈ మెషీన్ల తయారీ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో 'హోమ్ కంపోస్టింగ్ మెషీన్' ఎలా పనిచేస్తుంది? ఇంటి వద్ద తడి చెత్తతో కంపోస్ట్‌ను ఎలా తయారుచేయొచ్చు? దీని తయారీకి యువ ఆవిష్కర్త ఎదుర్కొన్న సవాళ్లేంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.

మెషీన్లకు మంచి ఆదరణ
పుణె నగరంలో ప్రతిరోజూ దాదాపు 2,800 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అందులో 1,000-1,100 టన్నుల వరకు తడి చెత్తే ఉంటుంది. ఇంత భారీ మొత్తంలో చెత్త ఉత్పత్తి కావడం, దానిని శుద్ధి చేసే సామర్థ్యం పరిమితంగా ఉండటంతో నగరం తీవ్రమైన వ్యర్థాల నిర్వహణ సమస్యను ఎదుర్కొంటోంది. అనేక ప్రాంతాల్లో డస్ట్ బిన్‌ల నుంచి చెత్త బయటకు పొర్లిపారడం జరుగుతోంది. అందుకే పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త సార్థ్వ భోండ్వే మూడేళ్ల క్రితం ఒక యంత్రాన్ని తయారుచేశారు. ఆ తర్వాత 'ఆక్సీ సస్టైనబుల్ సొల్యూషన్స్' అనే స్టార్టప్ ద్వారా ఆ మెషీన్ల అమ్మకాలను జరుపుతున్నారు. ఈ యంత్రాన్ని ఉపయోగించి వినియోగదారులు తమ ఇంట్లోని తడి చెత్తతో నెలకు 10-15 కిలోల కంపోస్ట్‌ను తయారు చేసుకోవచ్చు. అందుకే ఈ యంత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది.

Compost From Wet Waste Machine
తడి వ్యర్థాల యంత్రం నుంచి తయారైన కంపోస్ట్ (ETV Bharat)

2023లో స్టార్టప్ ప్రారంభం
సార్థ్వ భోండ్వే తయారుచేసిన ఈ పరికరం ప్రజలు తడి చెత్తను చెత్త కుండీల్లో పడేయడానికి లేదా బహిరంగ ప్రదేశాల్లో పారేయడానికి బదులుగా నేరుగా కంపోస్ట్‌గా మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా ఈ యంత్రం ఇంటి చెత్త కుండీగా కూడా ఉపయోగపడుతుంది. గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా 3,500కు పైగా హోమ్ కంపోస్టింగ్ మెషీన్లు అమ్ముడయ్యాయి. భవిష్యత్తులో అమ్మకాలు ఇంకా పెరుగుతాయని సార్థ్వ భోండ్వే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్టార్టప్‌ను 2023లో ప్రారంభించానని చెప్పారు. ప్రాథమిక పరీక్షల అనంతరం 2024లో వాణిజ్యపరమైన అమ్మకాలను మొదలుపెట్టామని వివరించారు.

"నా తండ్రి చాలా ఏళ్లుగా ఘన వ్యర్థాల నిర్వహణ రంగంలో పనిచేస్తున్నారు. అందుకే నేను చిన్నప్పటి నుంచే చెత్త తొలగింపులో ఉండే సవాళ్లను ప్రత్యక్షంగా చూశాను. పుణెలో భారీ మొత్తంలో తడి చెత్త ఉత్పత్తి అవుతుంది. దీనికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తుండగా, విజ్ఞాన్ ఆశ్రమంలో ఈ కార్యక్రమం మొదలైంది. అక్కడి డాక్టర్ యోగేశ్ కులకర్ణి మాకు ఎంతో సహాయం చేశారు. ఆయన తయారుచేసిన సాంకేతికను ఉపయోగించి తడి చెత్త సమస్యకు పరిష్కారంగా ఈ హోమ్ కంపోస్టింగ్ యంత్రాన్ని అభివృద్ధి చేశాం. ఇప్పటివరకు ఆన్‌లైన్ మార్గాల ద్వారా ఈ యంత్రం దాదాపు 28 రాష్ట్రాలకు చేరింది. 3,500కు పైగా మెషీన్లు అమ్ముడయ్యాయి. గృహ వ్యర్థాల నిర్వహణకు ఇది ఒక ఆచరణీయమైన ప్రత్యామ్నాయమని ప్రజలు భావిస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ ఇప్పటికే డస్ట్‌బిన్ ఉన్నప్పటికీ ఈ యంత్రానికి ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది" అని సార్థ్వ భోండ్వే చెప్పారు.

ఒక ఇంట్లో రోజుకు 700- 800 గ్రాముల తడి చెత్త ఉత్పత్తి అయితే, అది నెలకు 20–25 కిలోలకు చేరుతుందన్నారు సార్థ్వ భోండ్వే. ఈ యంత్రాన్ని ఉపయోగించి ఆ తడి చెత్తను రీసైక్లింగ్ చేయడం వల్ల 5 కిలోల కంపోస్ట్ లభిస్తుందని తెలిపారు. తేమ సహజంగా ఆవిరి కావడం వల్ల వ్యర్థాల పరిమాణం సుమారు 75 శాతం తగ్గుతుందని వివరించారు. ప్రజలు ఈ కంపోస్ట్‌ను తమ తోటలలో వాడుకుంటున్నారని స్పష్టం చేశారు. పుణెలో 500-600 యంత్రాలు అమ్ముడయ్యాయని వెల్లడించారు.

Compost From Wet Waste Machine
తడి వ్యర్థాల యంత్రం నుంచి తయారైన కంపోస్ట్ (ETV Bharat)

వినియోగదారులు ఏమంటున్నారంటే?
ఈ హోమ్ కంపోస్టింగ్ యంత్రాన్ని తాను గత మూడేళ్లుగా ఉపయోగిస్తున్నామని సునీత తెలిపారు. ప్రతిరోజూ తమ ఇంటిలోని తడి చెత్తను ఈ యంత్రంలో వేస్తామని, దీనివల్ల నెలకు సుమారు 3- 3.5 కిలోల కంపోస్ట్ లభిస్తుందన్నారు. ఆ కంపోస్ట్ తమ ఇంటి గార్డెన్‌లో ఉపయోగిస్తామని చెప్పారు. ఇంట్లోని తడి చెత్త వృథా కాకుండా సద్వినియోగం అవుతుందన్న విషయం తనకు చాలా సంతోషాన్ని ఇస్తోందన్నారు.

మొక్కు కోసం ఆలయానికి కుమారుడు దానం- ఈ వెరైటీ ఆచారం ఏంటో తెలుసా?

నేపాల్ విపత్తు నుంచి పాఠాలు- ఉత్తరాఖండ్‌లో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్- సైంటిస్టుల కీలక నిర్ణయం