ETV Bharat / bharat

మహేంద్ర సింగ్​ ధోనీకి జరిమానా- ఓవర్​ స్పీడ్​ వెళ్లినందుకు ఫైన్​

రాంచీలో మాజీ క్రికెటర్​ మహేంద్ర సింగ్​ కారుకు చలాన్​- అధికవేగంతో ప్రయాణించినందుకే!

Mahendra Singh Dhoni Car Challan
Mahendra Singh Dhoni Car Challan (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : March 4, 2026 at 3:09 PM IST

3 Min Read
Choose ETV Bharat

Mahendra Singh Dhoni Car Challan : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి వార్తల్లో నిలిచారు. ట్రాఫిక్​ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఆయనకు రూ.1,000 జరిమానా విధించారు అధికారులు. ఝార్ఖండ్​లోని రాంచీలో మార్చి 1న కాంకే రింగ్ రోడ్‌లోని బిర్సా వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలో ఆయన లగ్జరీ కారు వేగ పరిమితిని మించి ప్రయాణించింది. దీంతో ఆటోమేటిక్ కెమెరాలు ధోనీ కారుపై చలాన్ జారీ చేశాయి. ఆ ప్రాంతంలో వేగ పరిమితి గంటకు 60 కిలోమీటర్లు ఉండగా, ధోనీ కారు మాత్రం పరిమితిని మించి ప్రయాణించింది. దీంతో చలాన్​ జారీ అయ్యింది. అయితే, ధోనీ ఆ కారులో ఉన్నారో లేదో అన్న విషయంపై ఇంకా స్పష్టతలేదు. ఎందుకంటే ధోనీ ప్రస్తుతం ఐపీఎల్​ ప్రాక్టీస్​లో బిజీగా ఉన్నారు. మరోవైపు, ధోనీ మంగళవారం రాంచీలో కనిపించారని స్థానికులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, ప్రధాన కూడళ్లలో రింగ్ రోడ్ వద్ద ఈ ఆటోమెటిక్​ వ్యవస్థ 24x7 పనిచేస్తుందని రాంచీ పోలీసులు పేర్కొన్నారు. అతివేగం, సిగ్నల్ జంపింగ్, ఇతర ఉల్లంఘనలను పర్యవేక్షిస్తుందని చెప్పారు. ట్రాఫిక్​ రూల్స్​ అతిక్రమించిన వారికి ఎవరికైనా జరిమానా తప్పదన్నారు. అయితే, ఇదివరకు కూడా ధోనీ పలు కేసుల్లో వార్తల్లో నిలిచారు. ఇటీవల పరువు నష్టం కేసులో మద్రాసు హైకోర్టు ధోనీకి రూ.10 లక్షల జరిమానా విధించింది. 2013నాటి కేసు ఆధారంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఆ డబ్బును మార్చిలోపు చెల్లించాలని కూడా ఆదేశించింది.

E-challan issued to MS Dhoni
ధోనీ కారుకు చలాన్​ విధింపు (Special Arrangement)

అసలేంటి ఈ పరువు నష్టం కేసు?
తన పరువుకు భంగం కలిగించారంటూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్‌పై ధోనీ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా, సాక్ష్యాలకు సంబంధించిన సీడీ పత్రాలను లిఖితపూర్వకంగా మార్చినందుకు గాను, ధోనీ రూ.10 లక్షల ఫీజు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని మార్చి 12వ తేదీ లోపు చెల్లించాలని ఆదేశించింది.

ఈ కేసులో ధోనీయే పిటిషనర్ అయినప్పటికీ డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఎందుకంటే, ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా కొన్ని సీడీలు ఉన్నాయి. ఈ వీడియో/ఆడియో రికార్డులను కోర్టు భాషలోకి, లిఖితపూర్వక పత్రాలుగా మార్చాల్సి ఉంది. దీనికోసం కోర్టు ఒక ట్రాన్స్‌లేటర్‌ను, ఒక టైపిస్ట్‌ను నియమించింది. ఈ పని చాలా పెద్దది. వారు దీనికోసం తమ పూర్తి సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఏకంగా మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టింది. వారి శ్రమకు, అదనపు ఖర్చులకు గాను ఈ ఫీజు చెల్లించాలని కోర్టు నిర్ణయించింది. ఈ రూ.10 లక్షలను 'చీఫ్ జస్టిస్ రిలీఫ్ ఫండ్'లో జమ చేయాలని ధోనీని ఆదేశించింది.

గతంలోనూ బైక్​కు నంబర్​ ప్లేట్ లేదని ఫైన్
అదేవిధంగా బైక్‌లు, కార్ల పట్ల తనకున్న ప్రేమ కారణంగా కూడా ధోనీ చాలాసార్లు వార్తల్లో నిలిచారు. 2015 ధోనీ ప్రయాణించిన బైక్​కు నంబర్​ ప్లేట్​లేదని రూ.500 ఫైన్​ విధించారు ట్రాఫిక్ పోలీసులు.​ రాంచీ నగర వీధుల్లో ఆయన ప్రయాణించిన బైక్​కు ముందు వెనుక భాగంలో నంబర్​ ప్లేట్ లేదని అధికారులు చెబుతున్నారు. కానీ, ముందు చక్రంపై ఉన్న మడ్​గడ్​పై మాత్రం నంబర్​ రాసి ఉందని అధికారులు తెలిపారు. వాస్తవానికి అది వాహనానికి ముందు భాగంలో ఉండాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, చలాన్​ను ధోనీ ఇంటికి పంపించామని, ఆయన ఆ ఫైన్​ను చెల్లించారని అధికారులు పేర్కొన్నారు.

ఫామ్‌హౌస్​లో ధోనీ ఆర్గానిక్ సాగు- 38ఎకరాల్లో టమాటా పంట - మార్కెట్​లో మంచి గిరాకీ

ఐపీఎల్ బెట్టింగ్ వివాదం: రూ.10 లక్షలు చెల్లించాలని ధోనీకి మద్రాస్ హైకోర్టు ఆదేశాలు!