ETV Bharat / bharat

రూ.18లక్షల జీతాన్ని వదిలి వ్యవసాయంలోకి- 'సలాడ్ ఆకు' సాగుతో రూ.కోట్ల సంపాదన!

సాఫ్ట్​వేర్​ టూ సక్సెస్​ఫుల్​ రైతు - మెళకువల కోసం పలు దేశాల్లో పర్యటన - ప్రస్తుతం 80 ఎకరాల్లో సాగు, ఎకరానికి 9 టన్నుల దిగుబడి

Iceberg Lettuce Success Story
Iceberg Lettuce Success Story (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 11, 2026 at 8:32 AM IST

4 Min Read
Choose ETV Bharat

Iceberg Lettuce Farmer Success Story : చదువు పూర్తి చేసి బడా కంపెనీల్లో లక్షల జీతంతో సెటిల్ అవ్వాలని ప్రతి యువకుడు కలలు కంటాడు. కానీ హరియాణాలోని కురుక్షేత్రకు చెందిన బిన్వంత్ సింగ్ కథ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఏడాదికి రూ. 18 లక్షల జీతం వస్తున్నా తన ఊరి మట్టి మీద ఉన్న మక్కువతో ఆ ఉద్యోగాన్ని వదులుకుని గ్రామానికి వచ్చేశాడు. వ్యవసాయంలో ఏముంది అని తండ్రి వారించినా వినకుండా సరికొత్త సాగుతో ప్రయోగాలు చేశాడు. నేడు అదే వ్యవసాయంతో కోట్లు సంపాదిస్తూ వేలాది మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి సక్సెస్‌ఫుల్ రైతుగా మారిన బిన్వంత్ సింగ్ ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

మహారాష్ట్రలో ఉద్యోగం మానేసి
బిన్వంత్ సింగ్ తన చదువు పూర్తయ్యాక మహారాష్ట్రలోని ఒక ప్రైవేట్ కంపెనీలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం చేసేవాడు. అయితే తన తాతల కాలం నుంచి వస్తున్న భూమిలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో 2003లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సొంత ఊరు గౌరీపూర్‌కు చేరుకున్నాడు. మంచి జీతం వచ్చే పనిని వదిలేసి మళ్లీ పొలం పనులకే వస్తున్నావా అని తండ్రి మొదట కోప్పడ్డాడు. మామూలు పంటలు వేస్తే పెద్దగా లాభం లేదని గ్రహించిన బిన్వంత్ ఏదైనా వెరైటీగా చేయాలనుకున్నాడు. అప్పుడే భారత్​లోకి అడుగుపెట్టిన మెక్‌డొనాల్డ్స్ కంపెనీకి 'ఐస్ బర్గ్ లెట్యూస్' అనే సలాడ్ ఆకుకూర అవసరమని తెలుసుకుని ఆ దిశగా అడుగులు వేశాడు.

Iceberg Lettuce Success Story
ఐస్​బర్జ్​ లెట్యూస్​ (ETV Bharat)

ఏమిటీ ఐస్ బర్గ్ లెట్యూస్? ఎందుకు ఇంత డిమాండ్?
చూడటానికి క్యాబేజీలా ఉండే ఈ ఐస్ బర్గ్ లెట్యూస్ ఆకులు చాలా లేతగా, రుచిగా ఉంటాయి. అందుకే వీటిని సలాడ్లు, శాండ్‌విచ్‌లు, బర్గర్లలో విరివిగా వాడుతుంటారు. ముఖ్యంగా బడా ఫుడ్ చైన్ కంపెనీలు, స్టార్ హోటళ్లలో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. బిన్వంత్ పండించే ఈ ఆకుకూర నాణ్యత చాలా బాగుండటంతో మెక్‌డొనాల్డ్స్ ఇతనితో కొన్ని ఏళ్ల నుంచి కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. కేవలం పండించడమే కాకుండా క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల నేడు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఇతని పంట సరఫరా అవుతోంది. మన దేశంలో చాలా తక్కువ మంది రైతులు ఈ సాగు చేయడమే ఇతనికి కలిసి వచ్చిన అతి పెద్ద అంశం.

విదేశీ పర్యటనలతో సాగు మెళకువలు
అప్పట్లో ఈ సలాడ్ ఆకు గురించి దేశంలో ఎవరికీ పెద్దగా తెలియదు. దాని సాగు విధానంపై సరైన సమాచారం లేకపోవడంతో బిన్వంత్ సింగ్ చైనాకు వెళ్లి 11 రోజుల పాటు అక్కడ జరిగిన సెమినార్‌లో పాల్గొన్నాడు. అక్కడితో ఆగకుండా జపాన్, ఆస్ట్రేలియా, మెక్సికో, థాయిలాండ్ దేశాల్లో పర్యటించి ఆ పంటలోని లోతుపాతులను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. అలా ఏబీసీడీలు కూడా తెలియని పంటతో మొదలుపెట్టి నేడు ఏకంగా 80 ఎకరాల్లో ఈ ఆకుకూర సాగు చేస్తూ రికార్డు సృష్టిస్తున్నాడు. ఎకరాకు సుమారు 9 టన్నుల దిగుబడి వస్తుందని పెట్టుబడి ఖర్చు పోను రెండు నుంచి రెండున్నర లక్షల వరకు లాభం ఉంటుందని బిన్వంత్ వివరిస్తున్నాడు.

Iceberg Lettuce Success Story
ఐస్​బర్జ్​ లెట్యూస్​ను మార్కెట్​కు తరలించడానికి సిద్ధం చేస్తున్న దృశ్యం (ETV Bharat)

వ్యాక్యూమ్ ప్రి కూలర్ సిస్టమ్‌తో సరికొత్త విప్లవం
కూరగాయలు త్వరగా పాడైపోతాయనే భయం రైతుల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు బిన్వంత్ ఉత్తర భారత్​లోనే మొట్టమొదటి వ్యాక్యూమ్ ప్రి కూలర్ సిస్టమ్‌ను తన ఫామ్‌లో ఏర్పాటు చేశాడు. దీనివల్ల పొలం నుంచి కోసిన 20 నిమిషాల్లోనే ఆకుకూరల ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు చేరుతుంది. ఆ తర్వాత కోల్డ్ స్టోరేజ్, ఫ్రీజర్ వాహనాల ద్వారా రవాణా చేయడం వల్ల అవి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. దీనివల్ల కూరగాయలు వృథా అయ్యే అవకాశం చాలా వరకు తగ్గింది. టెక్నాలజీని వాడితే వ్యవసాయంలో నష్టాలను ఎలా తగ్గించుకోవచ్చో బిన్వంత్ నిరూపిస్తున్నాడు.

ఆరోగ్య ప్రయోజనాలు వందలాది మందికి ఉపాధి
ఐస్ బర్గ్ లెట్యూస్ కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ కె, విటమిన్ ఏ, ఫోలేట్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, కంటి చూపు మెరుగుపడటానికి ఎంతగానో దోహదపడతాయి. ఇక బిన్వంత్ తన ఫామ్ ద్వారా సుమారు 30 నుంచి 40 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాడు. పారేసే వ్యర్థాలను కూడా వదలకుండా విలువైన ఉత్పత్తులుగా మార్చవచ్చని ఇతని పరిశోధనలు చెబుతున్నాయి. రైతులకు ఐస్ బర్గ్ లెట్యూస్ సాగుపై శిక్షణ ఇస్తూ తన వంతు సహకారాన్ని అందిస్తున్నాడు. మొత్తానికి బిన్వంత్ సింగ్ కథ నేటి యువతకు ఒక గొప్ప ప్రేరణ అని చెప్పవచ్చు.

Iceberg Lettuce Success Story
ఐస్​బర్గ్​ లెట్యూస్ సాగు (ETV Bharat)

లక్షల జీతాన్ని వదులుకుని నష్టాల బాటలో ఉన్న వ్యవసాయాన్ని లాభాల బాటలోకి ఎలా తీసుకురావచ్చో అతను ప్రాక్టికల్​గా చూపించాడు. ఒక రిస్క్ తీసుకుంటేనే గొప్ప విజయాలు సొంతమవుతాయని బిన్వంత్ సింగ్ నిరూపించాడు. అతని పొలాన్ని సందర్శించడానికి ఇప్పుడు వేలాది మంది రైతులు తరలివస్తుండటం విశేషం. ఇవాళ ఏ హోటల్ కి వెళ్ళినా ఇతని పొలంలో పండిన సలాడ్ ఆకులే కనిపిస్తున్నాయంటే అది అతని కష్టానికి దక్కిన ఫలితం.

మహారాష్ట్రలో 'హుర్దా పార్టీ' ట్రెండ్- రైతులకు కాసుల పంట- సీజన్​లో రూ.12 లక్షల చొప్పున ఆదాయం!

ఇటాలియన్ తేనెటీగల పెంపకం- కోరియా రైతులకు ఫుల్​గా లాభాలు- ఈ హనీ గురించి మోదీ సైతం ప్రస్తావన!