ETV Bharat / bharat

'అజిత్ విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాలి'- వేలాది మందితో MLA రోహిత్ పవార్​ ఆందోళన

వేలాది మంది కార్యకర్తలతో బారామతి పోలీస్ స్టేషన్ వద్ద రోహిత్ పవార్ ఆందోళన- వీఎస్ఆర్ కంపెనీ, సంబంధిత అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ డిమాండ్- డీజీసీఏ నివేదికలో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయని ఆరోపణ

Ajit Pawar Flight Crash
Ajit Pawar (ETV BHARAT)
author img

By ETV Bharat Telugu Team

Published : February 26, 2026 at 1:34 PM IST

3 Min Read
Choose ETV Bharat

Ajit Pawar Flight Crash : మహారాష్ట్రలోని బారామతిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు చెందిన విమాన ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే రోహిత్ పవార్ భారీ స్థాయిలో ఆందోళనకు దిగారు. వేలాది మంది కార్యకర్తలతో కలిసి ఆయన బారామతి తాలూకా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పట్టుబట్టారు.

ఎందుకు ప్రయాణానికి అనుమతిచ్చారు?
ఇప్పటికే ఘటనపై గత కొన్ని రోజులుగా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయని, ప్రమాదానికి అసలు కారణాలేంటో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని, నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోహిత్ పవార్ స్పష్టం చేశారు. వీఎస్ఆర్ కంపెనీ నిర్వహణలో నడిచిన విమానం సాంకేతిక లోపాలతో ఉండగా ఎందుకు ప్రయాణానికి అనుమతిచ్చారని ఆయన ప్రశ్నించారు.

Ajit Pawar Flight Crash
పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ప్రజలు (ETV Bharat)

పోలీసులు భారీ బందోబస్తు
పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉదయం నుంచే భారీగా ప్రజలు గుమికూడారు. అజిత్ దాదా అమర్ రహే, దోషులపై చర్యలు తీసుకోండి, పూర్తి దర్యాప్తు చేయాలి అంటూ నినాదాలతో ప్రాంతం మారుమోగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే సమయంలో రోహిత్ పవార్ మీడియాతో మాట్లాడుతూ కీలక ఆరోపణలు చేశారు.

చర్యలు తీసుకోవాలని డిమాండ్
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఇటీవల విడుదల చేసిన నివేదికలో వీఎస్ఆర్ కంపెనీ పలు నిబంధనలు పాటించలేదని తేలిందన్నారు. మిగిలిన విమానాలను గ్రౌండ్ చేసిన తర్వాత కూడా లోపాలున్న విమానాన్ని అజిత్ పవార్ ప్రయాణానికి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. విమానానికి ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాధ్యత తెలిసినా కూడా!
అలాగే ఫ్లైట్ ప్లానింగ్ బాధ్యత వహించిన ఏరో కంపెనీ వాతావరణం క్లియర్‌గా ఉందని తెలిపిందని, అయితే ప్రమాదం ఎలా జరిగిందో విచారణలో తేలాలన్నారు. బాధ్యత తెలిసినా పట్టించుకోని ప్రభుత్వ అధికారులు, సంబంధిత వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేయాలని కోరారు. ఇప్పటికే ముంబయిలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసామని, కానీ కేసు నమోదు కాలేదని తెలిపారు.

సాంకేతిక విచారణ వేగవంతం
చట్ట ప్రకారం జీరో ఎఫ్‌ఐఆర్ ఎక్కడైనా నమోదు చేయవచ్చని, సుప్రీంకోర్టు తీర్పులు కూడా ప్రజలకు ఆ హక్కు ఇచ్చాయని గుర్తు చేశారు. అందుకే నేరుగా బారామతిలో కేసు నమోదు చేయించేందుకు వచ్చామని చెప్పారు. సందర్భంలో ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ), డీజీసీఏ నివేదికలు కీలకమని పార్టీ నేతలు పేర్కొన్నారు. బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉందని అధికారికంగా ధ్రువీకరించడంతో సాంకేతిక విచారణ వేగవంతం కావాలని కోరారు. వాస్తవాలు బయటపడే వరకు గందరగోళం సృష్టించకూడదని కూడా అన్నారు.

రోహిత్ పవార్​ డిమాండ్​కు మద్దతు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) నాయకులు కూడా రోహిత్ పవార్ డిమాండ్‌కు మద్దతు తెలిపారు. అవసరమైతే సీబీఐ దర్యాప్తు జరిపించాలని, బాధ్యులెవ్వరైనా తప్పించుకోకూడదని స్పష్టం చేశారు. ఇది రాజకీయ అంశం కాదని, న్యాయం కోసం చేస్తున్న పోరాటమని తెలిపారు. ఏదేమైనా అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ఇప్పుడు ఉద్యమంగా మారింది. రోహిత్ పవార్ నేతృత్వంలో సాగుతున్న ఈ ఆందోళన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. పోలీసుల తదుపరి చర్యలపై అందరి దృష్టి నెలకొంది.

అజిత్‌ పవార్‌ 1959 జులై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంత్‌ రావ్‌ పవార్‌, సీనియర్‌ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్‌ పవార్‌కు సోదరుడు. బాబాయి శరద్‌ పవార్‌ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్‌ పవార్‌, 1982లో తొలిసారి కార్పొరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పుణె జిల్లా సెంట్రల్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు.

1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయి శరద్‌ పవార్‌ కోసం ఆ సీటును త్యాగం చేసి, రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బా్యతలు చేపట్టారు. కానీ అనూహ్యంగా గత నెలలో విమాన ప్రమాదంలో కన్నుమూశారు.

''ప్రమాదమా? కుట్రనా? దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి'- అజిత్ మృతిపై రోహిత్ పవార్​ అనుమానాలు

అజిత్​​తో కలిసి విమానంలో నేనూ వెళ్లాల్సింది, కానీ జస్ట్ మిస్!: 'మహా' మాజీ మంత్రి