ETV Bharat / bharat

'సద్దాం హుస్సేన్ లాంటి పరిస్థితినే నికోలస్ మదురో ఎదుర్కోవచ్చు!'- మాజీ రాయబారి కెపీ ఫాబియన్

నికోలస్ మదురో భవిష్యత్తు గురించి కీలక విషయాలు వెల్లడించిన మాజీ రాయబారి, విదేశాంగ విధాన నిపుణుడు కేపీ ఫాబియన్- మదురో సద్దాం హుస్సేన్ లాంటి పరిస్థితిని ఎదుర్కోవచ్చని వ్యాఖ్యలు

KP Fabian On Venezuela Crisis
KP Fabian On Venezuela Crisis (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : January 10, 2026 at 6:40 PM IST

3 Min Read
Choose ETV Bharat

KP Fabian On Venezuela Crisis : వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో భవిష్యత్తుపై భారత్​కు చెందిన మాజీ రాయబారి, విదేశాంగ విధాన నిపుణుడు కేపీ ఫాబియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాక్​లో గతంలో చేపట్టినలాంటి పూర్తి స్థాయి సైనిక చర్య వెనెజువెలాలో అమెరికా చేపట్టకపోవచ్చని అభిప్రాయపడ్డారు. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ లాంటి పరిస్థితిని ఎదుర్కోవచ్చని హెచ్చరించారు. మదురోను అమెరికా నిర్భందంలోకి తీసుకోవడం, ఈ క్రమంలో వెనెజువెలాలో ఏర్పడిన రాజకీయ గందరగోళం తదితర అంశాల గురించి పలు విషయాలను ఈటీవీ భారత్​తో షేర్ చేసుకున్నారు కేపీ ఫాబియన్.

'ట్రంప్ ఇంటర్నేషనల్ చట్టాలను ఉల్లంఘించారు'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించారని కేపీ ఫాబియన్ ఆరోపించారు. ట్రంప్ చర్యలు ఐక్యరాజ్యసమితి చార్టర్​ను ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. అయినప్పటికీ చాలా దేశాలు భయంతో మౌనంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోమని యూకే ప్రధాని చెప్పారని అన్నారు. యూరోపియన్ దేశాలు నిశ్శబ్దంగా ఉన్నాయని వెల్లడించారు. కొలంబియా, రష్యా, చైనా వంటి దేశాలు మాత్రమే వెనెజువెలాపై అమెరికా చర్యలను ఖండించాయని తెలిపారు.

KP Fabian On Venezuela Crisis
మాజీ రాయబారి కెపీ ఫాబియన్ (ETV Bharat)

వెనెజువెలాలో పూర్తి స్థాయి అధ్యక్ష మార్పు జరగలేదు : ఫాబియన్
భారత్ నుంచి వెనెజువెలా సంక్షోభం గురించి తగిన ప్రకటన వచ్చిందని కేపీ ఫాబియన్ తెలిపారు. శాంతియుత పరిష్కారం కోసం భారత్ పిలుపునిచ్చిందని గుర్తు చేశారు. మదురోను అదుపులోకి తీసుకున్నప్పటికీ, అతని మద్దతుదారులు వెనెజువెలాను పాలించడం కొనసాగిస్తున్నారని అన్నారు. వెనెజువెలాలో అధ్యక్ష మార్పు పూర్తి పాలన మార్పు కాదని, తాత్కాలిక నాయకత్వ మార్పుగా అభివర్ణించారు.

"ట్రంప్ చమురు కోసం వెనెజువెలాపై దాడి చేశారు. అయినప్పటికీ ట్రంప్ నిర్ణయం నిజమైన ప్రయోజనాలను ఇస్తుందా లేదా అనేది అస్పష్టంగానే ఉంది. అయితే కొన్ని నివేదికలు ట్రంప్ నిర్ణయం వల్ల భారతీయ చమురు కంపెనీలు ప్రయోజనం పొందుతాయని చెబుతున్నాయి. కానీ వెనెజువెలా ముడి చమురు నుంచి వచ్చే ఏవైనా లాభాలు చివరికి అమెరికాకు తిరిగి వెళ్తాయి. సమస్య ఏమిటంటే ఐక్యరాజ్యసమితిలో వీటో అధికారం ఉన్న P5 దేశాలు ఏమైనా చేయగలవు. అందుకు ఐక్యరాజ్యసమితిని తప్పుపట్టలేం. ఐక్యరాజ్యసమితి సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదిక. వెనెజువెలాపై దాడులకు అమెరికాను వ్యతిరేకించే దేశాలు కూడా ఆపలేవు. వారు అలా చేయడానికి ప్రయత్నిస్తే, అది పెద్ద యుద్ధానికి దారి తీస్తుంది. ట్రంప్ తదుపరి చర్యలు అనూహ్యమైనవి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడంలో వెనుకాడరు. ట్రంప్ తానే దేశాన్ని అనే రాచరిక మనస్తత్వంతో ఉన్నారు." అని వీపీ ఫాబియన్ తెలిపారు.

అమెరికా అదుపులో మదురో దంపతులు
వెనెజువెలా రాజధాని కరాకస్​లోని లా కార్లోటా ఎయిర్ ఫీల్డ్​, ప్యూర్టే లియునా మిలిటరీ బేస్​, లా గ్వైరా నౌకాశ్రయంతోపాటు కీలక సైనిక స్థావరాలపై అమెరికా దళాలు శుక్రవారం అర్ధరాత్రి దాటాక (జనవరి 2న) మెరుపు దాడులు చేపట్టాయి. ఈ దాడుల్లో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోతోపాటు ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్​ను అమెరికా తమ నిర్భందంలోకి తీసుకొంది. ఈ విషయాన్ని కాసేపటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ వేదికగా వెల్లడించారు. వెనెజువెలా అధ్యక్ష భవన కాంపౌండ్​లోకి ప్రవేశించిన 5 నిమిషాల్లోనే డెల్టా ఫోర్స్‌ కమెండోలు మదురోను బంధించినట్లు పేర్కొన్నారు. అయితే వెనెజువెలాపై అమెరికా చేసిన దాడులను రష్యా, ఇరాన్​, చెనా, కొలంబియా సహా ఇతర దేశాలు తీవ్రంగా తప్పుపట్టాయి. అలాగే ఈ దాడులను ముక్తకంఠంతో ఖండించాయి.

అయితే వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్​ మదురోను బంధించే క్రమంలో అమెరికా చేపట్టిన ఆకస్మిక దాడుల్లో 56 మంది భద్రతాధికారులు చనిపోయారు. అందులో వెనెజువెలాకు చెందిన 24 మంది ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. వెనిజువెలాలో పనిచేస్తున్న 32 మంది క్యూబా సైనిక, పోలీసు అధికారులు సైతం ఈ ఆపరేషన్‌లో మరణించారని క్యూబా ప్రభుత్వం తెలిపింది. మరోవైపు, డజన్లకొద్దీ భద్రతా సిబ్బంది, పౌరులు కూడా మరణించారని వెనెజువెలా అటార్నీ జనరల్‌ తారెక్‌ విలియం స్పష్టం చేశారు. యుద్ధ నేరం కింద కేసులు నమోదు చేసి విచారిస్తామని అన్నారు.