సొంతిల్లు లేని పేద సర్పంచ్- ఊరందరికీ ప్రభుత్వ పథకాలు- ఆమెకు మాత్రం నో!
పేదరికంతో ఇబ్బందులు పడుతున్న మధ్యప్రదేశ్‌కు చెందిన సర్పంచ్- పీఎం ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరు కాక ఇక్కట్లు

Published : February 27, 2026 at 8:58 PM IST
Sarpanch Deprived Government Schemes : సర్పంచ్ అంటే ఆ గ్రామానికి అధిపతి. ఊరి ప్రజలకు ఏదైనా అవసరం వచ్చిందంటే చాలు వెంటనే సర్పంచ్ ఇంటికి వచ్చేస్తారు. గ్రామ స్థాయిలో అది అంతటి ముఖ్యమైన పదవి. అయితే మధ్యప్రదేశ్‌లోని ఓ మహిళా సర్పంచ్ కూడా ఇలాగే తమ ప్రజల బాగోగులు చూసుకుంటున్నారు. కానీ సర్పంచ్ మాత్రం దీనస్థితిలో ఉండిపోయారు. ఆమెకు ఉండడానికి కనీసం సొంతిల్లు కూడా లేదు. ప్రభుత్వ పథకాలేవీ అందట్లేదు. దీంతో కుటుంబ సభ్యులు అందరూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
మట్టి గుడిసెలో జీవనం
దామోహ్ జిల్లాలోని కువాన్ ఖేడా నాయక్ పంచాయతీకి మీనా అతియా సర్పంచ్. ఆమె ఎస్సీ వర్గానికి చెందిన మహిళ. భర్త, పిల్లలు, మామ సహా 10 మంది కుటుంబ సభ్యులతో కలిసి మీనా అతియా సెమ్రాపతి గ్రామంలో నివసిస్తున్నారు. మట్టి గుడిసెలోనే వారందరూ ఉంటున్నారు. దాని పైకప్పును గడ్డితో కప్పారు. ఆ ఇంటికి బాత్రూమ్ సహా ఎటువంటి సదుపాయాలు లేవు.
వర్షాకాలం వస్తే మకాం మార్చాల్సిందే!
వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ మట్టి గుడిసెలోంచి నీరు కారిపోతుంది. దీంతో సర్పంచ్ కుటుంబం అద్దెకు వేరే ఇంటికి మారుతోంది. ఒక విధంగా చెప్పాలంటే సంచార జీవితాన్ని గడుపుతున్నారు. ప్రభుత్వ పథకాలేవీ మీనా అతియా కుటుంబానికి అందడం లేదు. దీంతో తీవ్ర పేదరికంలో మగ్గిపోతున్నారు. పీఎం ఆవాస్ యోజన కింద ఇల్లు కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా మీనా కుటుంబానికి ఇల్లు మంజూరు కాలేదు. సొంతిల్లు ఇప్పించమని పదే పదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ సర్పంచ్‌గా ఉన్న మీనా తిరిగినా ఫలితం లేకపోయింది.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగాను : సర్పంచ్
వర్షాకాలంలో తాము ఈ మట్టి గుడిసెలో నివసించలేమని సర్పంచ్ మీనా అతియా తెలిపారు. ఆ సమయంలో తాము ఇల్లును అద్దెకు తీసుకుంటామని పేర్కొన్నారు. "నేను పీఎం అవాస్ యోజన పథకానికి దరఖాస్తు చేశాను. చాలా సార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగాను. అయినా ప్రయోజనం లేదు. పదవిలో ఉన్న సర్పంచ్ ప్రభుత్వ ప్రయోజనాలను పొందలేరని అధికారులు చెబుతున్నారు. అందువల్ల మాకు పీఎం ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరు కాలేదు" అని మీనా అతియా స్పష్టం చేశారు.
'అధికారులు ఏది చెబితో అదే నిజమని భావిస్తాం'
తమకు ఇల్లు మంజూరు కాకపోవడంపై సర్పంచ్ మీనా అతియా మామ నాథూరామ్ సైతం ఆవేదన వ్యక్తం చేశారు. "శాశ్వత ఇల్లు ఎవరికి వద్దు? మీనా సర్పంచ్ అవ్వకముందు సొంతిల్లు కోసం చాలా సార్లు ప్రయత్నించాం. కానీ మా పేర్లు అర్హుల జాబితాలో లేవు. అలా ఎందుకో జరిగిందో మాకు తెలియదు. మేము పెద్దగా చదువుకున్న వాళ్లం కాదు. ప్రభుత్వ పథకాల గురించి మాకు తెలియదు. కాబట్టి అధికారులు ఏది చెబితో అది నిజమని మేము భావిస్తాం" అని నాథూరామ్ పేర్కొన్నారు.
రేషన్ కార్డూ లేదు!
అలాగే మీనా అతియాకు రేషన్ కార్డు లేదు. దీంతో ప్రభుత్వం ఉచిత బియ్యం కూడా అందడం లేదు. రేషన్ కార్డు లేకపోవడంతో మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం 'లాడ్కీ బహిన్ యోజన'కు దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో ప్రభుత్వం అందించే నగదును అందుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కుటుంబ పోషణ కోసం సర్పంచ్ కుటుంబంలోని కొందరు కూలీ పనులకు వెళ్తున్నారు. మరికొందరు పొలాల్లో పనిచేస్తున్నారు. సర్పంచ్ మీనా సహాయంతో ఇతర గ్రామస్థులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారు. కానీ స్వయంగా సర్పంచే ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్నారు. ఆ పదవే ఆమె పాలిట శాపంగా మారినట్లైంది.
అయితే సర్పంచ్ మీనా అతియాకు పీఎం ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరు కాకపోవడం విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి కమలేశ్ ఖరే స్పందించారు. పీఎం ఆవాస్ యోజన ఇల్లు కోసం మహిళా సర్పంచ్ కుటుంబ సభ్యుల్లోని ఇద్దరి పేర్లను పంపామని తెలిపారు. వారి దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
కళ్లద్దాలు కొనడానికి వెళ్లి రూ.3 కోట్ల లాటరీ గెలుచుకున్న స్టవ్ రిపేర్ షాప్ ఓనర్
ప్రతి నెలా బాలేశ్వర్ టు పూరీ యాత్ర- సైకిల్‌పై 260కి.మీల ప్రయాణం- జగన్నాథుడికి తులసిని తీసుకుని!

