ETV Bharat / bharat

'భారత్-యూకే సంబంధాలను మరింత బలోపేతం చేద్దాం'- బ్రిటన్ కొత్త ప్రధానికి మోదీ శుభాకాంక్షలు

యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆండీ బర్న్‌హామ్‌కు ప్రధాని అభినందనలు- భారత్, యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామన్న మోదీ

Modi Wishes UK New PM
Prime Minister Narendra Modi and UK PM Andy Burnham (PIB,X@andyburnham)
author img

By ETV Bharat Telugu Team

Published : July 21, 2026 at 9:57 AM IST

3 Min Read
Choose ETV Bharat

Modi Wishes UK New PM : బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లేబర్‌ పార్టీ నాయకుడు ఆండీ బర్న్‌హామ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్-యూకే మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆయనతో కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్ చేశారు.

భారత్, యూకే దేశాలు ప్రజాస్వామ్య విలువలతో అనుసంధానమైన దేశాలని మోదీ తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, ప్రజల మధ్య సంబంధాలు వంటి అనేక రంగాల్లో ఇరు దేశాలు విస్తృతంగా సహకరిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నెల నుంచి అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) భారత్​- యూకే సంబంధాలకు కొత్త ఊపు తీసుకువస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందంతో ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలపడుతుందని, 'విజన్-2035' లక్ష్యాల సాధనలో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. భారత్‌, యూకే మధ్య కుదిరిన చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జులై 14 నుంచే అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం వల్ల బ్రిటన్‌కు భారత్‌ చేసే ఎగుమతుల్లో 99 శాతం వస్తువులపై ఎలాంటి సుంకాలు ఉండవు. బ్రిటిష్ వస్తువులకు ఒకటి నుంచి పదేళ్లలో దశల వారీగా సుంకాల మినహాయింపు లభించనుంది.

బ్రిటన్‌కు 59వ ప్రధాని
ఆండీ బర్న్‌హామ్ సోమవారం బ్రిటన్ 59వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మాజీ ప్రధాని కీర్ స్టార్మర్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో రాజీనామా సమర్పించిన అనంతరం బర్న్‌హామ్ అధికార బాధ్యతలు చేపట్టారు. ఆయన భార్య మేరీ-ఫ్రాన్స్ వాన్ హీల్‌తో కలిసి 10 డౌనింగ్ స్ట్రీట్‌కు చేరుకుని దేశ ప్రజలను ఉద్దేశించి తొలి ప్రసంగం చేశారు.

'బ్రిటన్‌కు స్థిరత్వం తీసుకొస్తాం'
ప్రధానిగా తొలి ప్రసంగంలో ఆండీ బర్న్‌హామ్ మాట్లాడుతూ, రాజకీయ అస్థిరతతో విసిగిపోయిన దేశానికి మళ్లీ స్థిరత్వాన్ని తీసుకురావడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. గత పదేళ్లలో ఏడో ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న ఈ సందర్భం ఆత్మపరిశీలనకు, కొత్త సంకల్పానికి నాంది కావాలని అన్నారు. గత నాలుగు దశాబ్దాల్లోనే అతిపెద్ద మార్పులను తీసుకువస్తూ బ్రిటన్‌కు కొత్త దిశను చూపుతామని బర్న్‌హామ్ హామీ ఇచ్చారు. కొత్త రాజకీయ, ఆర్థిక విధానాలను రూపొందిస్తానని ప్రకటించారు. ఇళ్ల నిర్మాణానికి తన పాలనలో అధిక ప్రాధాన్యమిస్తానన్నారు.

ఎవరీ ఆండీ బర్న్‌హామ్‌?
ఆండీ బర్న్‌హామ్- లివర్‌పుల్‌లో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో 1970లో జన్మించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ పట్టా పొందారు. అక్కడే నెదర్లాండ్స్‌కు చెందిన విద్యార్థిని మేరీ ఫ్రాన్స్ వాన్ హీల్‌ను కలుసుకున్నారు. 2000లో వివాహం చేసుకోగా వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజకీయాల్లోకి రాకమునుపు బర్న్‌హామ్ జర్నలిస్టుగా కూడా పనిచేశారు. 2001లో మొదటిసారి ఎంపీగా ఎన్నికైన ఆయన, మాజీ ప్రధాని గోర్డన్ బ్రౌన్ ప్రభుత్వంలో ట్రెజరీ చీఫ్ సెక్రటరీ, సాంస్కృతిక శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2017లో ఎంపీ పదవికి రాజీనామా చేసి గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ప్రజా రవాణా, గృహ నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. కొవిడ్ సమయంలో అప్పటి కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ప్రధాని బోరిస్ జాన్సన్ విధానాల్ని బహిరంగంగా విమర్శించారు. ఆ సమయంలోనే నార్త్ ఇంగ్లాండ్ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించడంతో 'కింగ్ ఆఫ్ ది నార్త్' అనే పేరు కూడా వచ్చింది. లేబర్‌ పార్టీలో నాయకత్వ పగ్గాల కోసం ఆండీ గతంలో రెండు సార్లు పోటీపడ్డారు. కేవలం రెండు నెలల కిందటే ఉపఎన్నికలో గెలిచి మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన- ఇప్పుడు బ్రిటన్ 59వ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఇక వంటింట్లోకి ఇథనాల్- LPG సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా కొత్త స్టవ్- కేంద్రం సరికొత్త ప్లాన్!

'ఇథనాల్ బ్లెండింగ్​తో ఆహార భద్రత, నీటి వనరులకు ముప్పు లేదు'- కేంద్రం కీలక ప్రకటన