ETV Bharat / bharat

మమత వర్గంతో చర్చించాకే- టీఎంసీ రెబల్​ ఎంపీల విలీనంపై స్పీకర్ నిర్ణయం!

తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ముదిరిన సంక్షోభం- తాము ఎన్‌సీపీఐ పార్టీలో విలీనమైనట్లు ప్రకటించిన టీఎంసీ రెబల్ ఎంపీలు- ఈ విషయంపై త్వరలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకునే ఛాన్స్

Lok Sabha Speaker Om Birla
Lok Sabha Speaker Om Birla (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : June 16, 2026 at 12:59 PM IST

3 Min Read
Choose ETV Bharat

LS Speaker Decision On TMC MPs : టీఎంసీ పార్టీ రెబల్ ఎంపీలు తాము నేషనలిస్ట్ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో (ఎన్‌సీపీఐ) విలీనమయ్యామని, తమకు లోక్‌సభలో ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని స్పీకర్ ఓం బిర్లాను కోరిన నేపథ్యంలో ఆయన నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తిరుగుబాటు చేసిన 20 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల స్థితిగతులను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పరిశీలిస్తున్నారని, రెండు వర్గాల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే లోక్‌సభ స్పీకర్ కార్యాలయం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఎంపీల బృందానికి అధికారిక సమావేశం కోసం ఆహ్వానిస్తూ ఈ-మెయిల్ పంపిందని స్పష్టం చేశాయి. తిరుగుబాటు వర్గం కోరిన విలీన అభ్యర్థనపై, పార్టీ అధికారిక నాయకత్వంతో చర్చించిన తర్వాతే స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వెల్లడించాయి. కాగా, టీఎంసీ లోక్‌సభ సభ్యుల బృందంలో అధికారికంగా చీలిక ఏర్పడిన నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది.

పదవుల కోసం టీఎంసీ రెబల్ ఎంపీలు కొట్లాడుకుంటున్నారు : కీర్తి ఆజాద్
నేషనలిస్ట్‌ సిటిజెన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో విలీనమయ్యామని ఇటీవలే తిరుగుబాటు టీఎంసీ ఎంపీలు ప్రకటించారు. తమకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి విజ్ఞప్తి చేశారు. తమకు తృణమూల్‌ మొత్తం ఎంపీల్లో 2/3వంతుకు మించి మెజారిటీ ఉందన్నారు. అందుకే ముందడుగు వేస్తున్నామని, ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏతో కలిసి దేశం కోసం పని చేస్తామని వివరించారు. ఈ పరిణామంపై టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ స్పందించారు. ఈ చర్యను తప్పుదోవ పట్టించేది, అప్రజాస్వామికమని మండిపడ్డారు. టీఎంసీ పార్టీ పూర్తిగా మమతా బెనర్జీ నాయకత్వంలోనే ఉందని స్పష్టం చేశారు. పార్లమెంటరీ స్థాయిలో అసలు ఉనికి లేని పార్టీలో టీఎంసీ రెబల్ ఎంపీలు ఎలా విలీనం అవుతారు? అని ప్రశ్నించారు. పదవుల కోసం రెబల్ ఎంపీలు తమలో తాము కొట్లాడుకుంటున్నారని ఆరోపించారు.

'మమతదే టీఎంసీ పార్టీ'
"నిజమైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీదే. టీఎంసీ మమతదేనని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నాం. 20 మంది తిరుగుబాటు టీఎంసీ ఎంపీలు స్పీకర్‌కు ఇచ్చిన లేఖ తప్పుదోవ పట్టించేలా ఉంది. తిరుగుబాటు ఎంపీల బృందం వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తోంది. ఇప్పటికే వారిలో అంతర్గత విభేదాలు తలెత్తాయి. ఎవరు మంత్రి కావాలనే విషయంలో ఆ ద్రోహుల (తిరుగుబాటు టీఎంసీ ఎంపీలనుద్దేశించి) మధ్య వివాదం నెలకొంది. రెబల్ ఎంపీలు విలీనం అయిన పార్టీ(నేషనలిస్ట్ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా)కి పార్లమెంట్‌లో ఎలాంటి ప్రాతినిధ్యం లేదు, అది గుర్తింపు లేని, రిజిస్టర్ కాని పార్టీ. దానికి ఎలాంటి ఉనికి లేదు. ఆ పార్టీలో తిరుగుబాటు టీఎంసీ ఎంపీల విలీనం ప్రజాస్వామ్యబద్ధం కాదు. " అని కీర్తి ఆజాద్ తెలిపారు.

వార్తల్లో నిలిచిన నేషనలిస్ట్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా
ఏమాత్రం పేరు ప్రఖ్యాతులు లేని నేషనలిస్ట్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా పార్టీ ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. అందుకు ప్రధాన కారణం తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి 20 మంది తిరుగుబాటు ఎంపీలు అందులో విలీనం కావాలని నిర్ణయించుకోవడమే. ఈ పార్టీకి ఎంపీ, ఎమ్మెల్యేలు గానీ లేరు. కాగా, 2023లో జరిగిన త్రిపుర శాసనసభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో నేషనలిస్ట్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా బరిలోకి దిగింది. పార్టీ ఫిరాయింపులు చేసే వారిని తిరస్కరించాలన్న నినాదంతో ఆ పార్టీ ఎన్నికల ప్రచారం చేసింది. పోటీ చేసిన మూడు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు రావడం గమనార్హం.

నేషనలిస్ట్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా పార్టీ అధ్యక్షుడిగా బంగాల్‌కు చెందిన ఉట్టియ కుందు ప్రస్తుతం సేవలందిస్తున్నారు. అయితే తృణమూల్‌ కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎంపీలు చేసిన ప్రతిపాదనకు స్పీకర్‌ ఓంబిర్లా ఆమోదముద్ర వేస్తే లోక్‌సభలో నేషనలిస్ట్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఐదో పెద్ద పార్టీగా నిలుస్తుంది. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ తొమ్మిదో స్థానానికి పడిపోతుంది.

టెలిగ్రామ్​పై కేంద్రం కీలక నిర్ణయం- నీట్​ పరీక్ష అయ్యే వరకు బ్యాన్

రాహుల్ గాంధీ ఒక పెద్ద జోక్- రాజకీయ పరిణతి లేని లీడర్ : డీఎంకే ఫైర్