ETV Bharat / bharat

ఇండియా కూటమి ర్యాలీలో లాఠీఛార్జ్‌, తొక్కిసలాట- తెలంగాణ నేతలకు గాయాలు

India Bloc March Live Updates
సీఈసీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి మార్చ్ (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : October 12, 2026 at 11:46 AM IST

|

Updated : October 12, 2026 at 7:14 PM IST

Choose ETV Bharat

India Bloc March Live Updates : భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి సోమవారం సుప్రీంకోర్టు వరకు మార్చ్​ను చేపట్టనున్నాయి. చలో దిల్లీ-మార్చ్ ఫర్ డెమోక్రసీ పేరుతో ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. లైవ్​ అప్డేట్స్​ మీకోసం.

LIVE FEED

7:14 PM, 12 Oct 2026 (IST)

ఇండియా కూటమి ర్యాలీలో లాఠీఛార్జ్‌, తొక్కిసలాట- తెలంగాణ నేతలకు గాయాలు

ఇండియా కూటమి ర్యాలీలో లాఠీఛార్జ్‌ జరిగింది. ర్యాలీలో ఉన్న వారు చల్లాచదరు కావడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో పలువురు నేతలు కింద పడ్డారు. ఈ క్రమంలో తెలంగాణ నేతలకు స్వల్ప గాయాలయ్యాయి.

6:01 PM, 12 Oct 2026 (IST)

ఎన్నికల సంఘంలో జరిగిన ఓట్ల చోరీ, ఓటరు జాబితాల ప్రత్యేక సవరణలో అవకతవకలపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఫామ్-6, ఫామ్-7లలో జరిగిన అక్రమాలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ ఎక్కడ దాక్కున్నారని కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే నిలదీశారు. యూపీలో ఓటరు సవరణ పూర్తయినా ఇంకా భారీ సంఖ్యలో నకిలీ ఓట్లు, డబుల్ ఓట్లు ఉన్నాయని, ఈసీ పూర్తిగా బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు.

5:50 PM, 12 Oct 2026 (IST)

సీఈసీ జ్ఞానేశ్​ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండీ కూటమి చేపట్టిన నిరసన నేపథ్యంలో మూసివేసిన ఆరు స్టేషన్లను తిరిగి తెరిచింది. పటేల్ చౌక్, జన్‌పథ్, రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, బారాఖంబా రోడ్ మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను తెరిచింది. ఉదయం 6 గంటల నుంచి మూసివేసిన స్టేషన్లను మొదట సాయంత్రం 4 గంటలకు తెరుస్తామని చెప్పినా, ఆ తర్వాత ఆంక్షలను సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది.

5:31 PM, 12 Oct 2026 (IST)

SIRలో పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ సహా పలువురు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్​తో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, టీఎంసీ నేత సౌగతా రాయ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వీ యాదవ్ కూడా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

5:16 PM, 12 Oct 2026 (IST)

కన్నాట్ ప్లేస్‌లోని బారాఖంబా జంక్షన్ నుంచి సుప్రీంకోర్టు వైపు సాగిన ఈ నిరసన ప్రదర్శనను భగవాన్ దాస్ రోడ్డు వద్ద పోలీసులు భారీ బారికేడ్లతో అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ ఏకంగా బారికేడ్ల పైకెక్కి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, దిల్లీ పోలీసులు కుమ్మక్కై యువతను అణచివేస్తున్నారని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థులు, మహిళలపై ఉద్దేశపూర్వకంగానే దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

4:56 PM, 12 Oct 2026 (IST)

సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు రాహుల్‌గాంధీ. తమ లాయర్ల ద్వారా ఎలక్షన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయించారు. ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేసినట్లు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌ వెల్లడించింది. కోర్టు సమయం ముగుస్తున్నందున లాయర్లతో పిటిషన్‌ వేయించారు.

4:29 PM, 12 Oct 2026 (IST)

సుప్రీంకోర్టుకు ఇండీ కూటమి నేతలు పాదయాత్రగా వెళ్తున్నారు. ఇందులో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, విపక్ష నేతలతో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా డిమాండ్‌తో ఇండియా కూటమి నేతల ర్యాలీ చేపట్టారు. అనంతరం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

4:01 PM, 12 Oct 2026 (IST)

"ఈ రోజు దేశమంతా రోడ్లపైకి వచ్చింది. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడకు చేరుకున్నారు. మా అందరి డిమాండ్ ఒక్కటే సుప్రీంకోర్టు మా వాదనను వినాలి. CEC చేసిన పని చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సిందే. మేము బయటపెట్టిన 'ఓట్ల చోరీ'కి సంబంధించిన ఆధారాలు, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మనం పోరాడాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. మేము శాంతియుతంగా, గాంధేయ పద్ధతిలో మాట్లాడాలని అనుకుంటున్నాం. కానీ పోలీసులు యువతపై దాడులు చేస్తున్నారు. నాయకులను జైలుకు పంపుతున్నారు. ఇది తప్పు. సరైన చర్యలు తీసుకునేలా సుప్రీంకోర్టు మా వాదనను వినాలని నేను భావిస్తున్నాను. ఆ పదవిలో కొనసాగే హక్కు CECకి లేదు. ఈ ప్రభుత్వం తనను తాను రక్షించుకోవడానికి పోలీసులను ముందుంచుతోంది." అని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు.

2:59 PM, 12 Oct 2026 (IST)

సుప్రీంకోర్టుకు ర్యాలీగా వెళ్తున్న ఇండీ కూటమి నేతలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో సుప్రీం కోర్టు వరకు ఇండీ కూటమి నేతలు ర్యాలీలో పాల్గొనేందుకు బస్సులో బయలుదేరారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా డిమాండ్‌తో ఇండీ కూటమి నేతల ర్యాలీ చేపట్టారు. సీఈసీ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయనున్నారు.

India Bloc March Live Updates
ర్యాలీలో నిరసనకారులు (ETV Bharat)

2:31 PM, 12 Oct 2026 (IST)

దిల్లీ: బారాఖంబా జంక్షన్‌లో భారీగా పోలీసుల మోహరింపు

సుప్రీం కోర్టు వరకు ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో బారాఖంబా జంక్షన్‌లో భారీగా పోలీసుల మోహరించారు. బారాఖంబా నుంచి మండి హౌస్‌ వరకు పోలీసులను మోహరించారు. అటు కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఇండీ కూటమి నేతల సమావేశమై బారాఖంబా నుంచి ర్యాలీగా సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు.

1:48 PM, 12 Oct 2026 (IST)

దిల్లీ పోలీసుల కీలక నిర్ణయం- నిరసన ప్రదేశాల జాబితా నుంచి జంతర్‌మంతర్ తొలగింపు

జంతర్‌మంతర్‌ విషయంలో దిల్లీ పోలీసుల కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరసన ప్రదేశాల జాబితా నుంచి జంతర్‌మంతర్ తొలగించారు. నిరసనల కోసం ప్రత్యేకంగా మూడు ప్రదేశాలను దిల్లీ పోలీసులు సూచించారు. నిరసనల కోసం రామ్‌లీలా మైదాన్‌(సెంట్రల్‌ దిల్లీ), బురారీ(నార్త్‌ దిల్లీ) మైదాన్‌, సీబీడీ గ్రౌండ్‌( ఈస్ట్ దిల్లీ)ను దిల్లీ పోలీసులు సూచించారు.

1:30 PM, 12 Oct 2026 (IST)

ఎన్నికల కమిషన్‌ను ప్రక్షాళన చేసే వరకు ఆందోళన కొనసాగిస్తాం: రాహుల్‌

ఎన్నికల కమిషన్‌ను ప్రక్షాళన చేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడిన ఐదుగురు నేరగాళ్లు న్యాయవిచారణ ఎదుర్కొనే వరకు వదిలిపెట్టేది లేదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునే వాళ్లు తమతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఇది రాహుల్‌గాంధీ, నరేంద్రమోదీ మధ్య పోరాటం కాదని, ఇది ప్రజాస్వామ్య రక్షణ, నిరసన తెలిపే హక్కుల కోసం జరుగుతున్న పోరాటమని అన్నారు. ఇది దేశ యువత భవిష్యత్‌, రాజ్యాంగ రక్షణ కోసం జరుగుతున్న పోరాటమని పేర్కొన్నారు.

1:09 PM, 12 Oct 2026 (IST)

సుప్రీంకోర్టు వరకు ఇండియా కూటమి ర్యాలీ

ఇండియా కూటమి మరి కాసేపట్లో కన్నాట్‌ప్లేస్‌ నుంచి సుప్రీంకోర్టు వరకు ర్యాలీ ప్రారంభించనుంది. దిల్లీలోని బారాఖంబా జంక్షన్‌ నుంచి ప్రారంభంకానున్న ఇండి కూటమి ర్యాలీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వం వహించనున్నారు. ఆ తర్వాత సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా పిటిషన్‌ వేయనున్నారు.

12:16 PM, 12 Oct 2026 (IST)

మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

దిల్లీలో ఒక భయానక వాతావరణం సృష్టించారని రాహుల్ గాంధీ తెలిపారు. దిల్లీ రోడ్లపై దాదాపు 30 వేల మంది పోలీసులను మోహరించారని తెలిపారు.
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను ప్రధాని మోదీ ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. యువతను ఎక్కడికక్కడ నిరోధిస్తున్నారని, ఆర్‌ఎస్‌ఎస్‌ గూండాలకు ఉన్న స్వేచ్ఛ యువతకు ఎందుకు లేదని ప్రశ్నించారు. జ్ఞానేశ్‌కుమార్‌ చరిత్ర తమకు తెలసని, అంతా బయటపెడతామని అన్నారు. ఆయన సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాల్సిందేనని, చేసేవరకు వదలిపెట్టమన్నారు. మోదీ, అమిత్‌షా, భాగవత్‌, ఢోబాల్‌ నలుగురు ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని అన్నారు.

12:14 PM, 12 Oct 2026 (IST)

జంతర్‌మంతర్ వద్ద నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవటంపై యూత్ కాంగ్రెస్ పిటిషన్​ దాఖలు చేసింది. దీనిపై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.
నిరసనకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలని యూత్‌ కాంగ్రెస్‌ కోరింది. యూత్‌ కాంగ్రెస్‌ అభ్యర్థనపై రేపటిలోపు చెప్పాలని దిల్లీ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది.

12:06 PM, 12 Oct 2026 (IST)

ఇంటర్నెట్ నిలిపివేత పిటిషన్​పై సుప్రీంకోర్టులో విచారణ

ఇంటర్నెట్ నిలిపివేత, పనులకు ఆటంకంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నిరసనలు, ప్రజాస్వామ్య కార్యకలాపాలు సజావుగా సాగాలని సీజేఐ తెలిపారు. సుప్రీంకోర్టు పనితీరుకు కూడా ఎలాంటి ఆటంకం కలగకూడదని అన్నారు. దిల్లీలో నిరసనలు, సంబంధిత ఆంక్షల అంశం శాంతిభద్రతలకు సంబంధించినది పేర్కొన్నారు. ఆంక్షలు, శాంతిభద్రతల అంశం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు.

12:06 PM, 12 Oct 2026 (IST)

ఆప్​ నేతలపై కేసు నమోదు

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా బంగ్లా సాహిబ్‌ గురుద్వారాలోకి ప్రవేశించిన ఆప్‌ నేతలపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా పలువురు నేతలపై ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలంటూ శనివారం నిరసనకారులు జంతర్‌మంతర్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పలువురు బంగ్లా సాహిబ్‌ గురుద్వారా ప్రాంగణంలోకి చేరుకోగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గురుద్వారా ప్రాంగణంలో ఆందోళన చేపట్టి మత పవిత్రతకు భంగం కలిగించారంటూ దిల్లీ సిక్కు గురుద్వారా నిర్వహణ కమిటీ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆప్‌ కార్యకర్తలు గురుద్వారాలో రాజకీయ నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారని కమిటీ ఆరోపించింది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలను వక్రీకరిస్తూ ఆప్ నేతలు పలు వీడియోలను పోస్ట్‌ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు మేరకు ఇవాళ దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

11:56 AM, 12 Oct 2026 (IST)

దిల్లీకి చేరుకున్న నేతలు

సుప్రీంకోర్టు వరకు నిరసన ర్యాలీకి ఇండియా కూటమి సిద్ధమైంది. ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు దిల్లీకి చేరుకున్నారు.
మధ్యాహ్నం 1.30 గంటల నుంచి కన్నాట్‌ప్లేస్‌ నుంచి సుప్రీంకోర్టు వరకు ర్యాలీ జరగనుంది.

11:40 AM, 12 Oct 2026 (IST)

'మార్చ్‌ ఫర్‌ డెమోక్రసీ, మార్చ్‌ ఫర్‌ జస్టిస్‌' అని చలో దిల్లీకి రాహుల్​ గాంధీ పిలుపునిచ్చారు. అందరూ దిల్లీకి వస్తున్నట్లు అర్ధం వచ్చేలా ఇండియా మ్యాప్​ను ఎక్స్​లో పోస్ట్ చేశారు.

11:37 AM, 12 Oct 2026 (IST)

అందరికోసం సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి : సీజేఐ

సుప్రీం కోర్టు తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్‌ తెలిపారు. ఇండియా కూటమి నుంచి తనకు అభ్యర్థన వచ్చిందన్న సీజేఐ, నిన్న ఆదివారం రాత్రే దానికి స్పందించినట్లు వెల్లడించారు.

11:35 AM, 12 Oct 2026 (IST)

రాహుల్​పై బీజేపీ ఫైర్

ఓట్ల చోరీ అంశంపై వినతి పత్రం సమర్పించేందుకు సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కోరడంపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. న్యాయవ్యవస్థ రోజువారీ రాజకీయ పోరాటాలకు అతీతంగా ఉండాలని కోరింది. రాజ్యాంగ చట్టాన్ని రాజకీయ నాటకీయతతో రాహుల్‌ గందరగోళానికి గురిచేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను కలిసేందుకు సీజేఐ నిరాకరించడం ద్వారా న్యాయవ్యవస్థ రాజకీయాలకు అతీతంగా నిలవాలనే సందేశం ప్రజల్లోకి వెళ్ళిందని పేర్కొన్నారు. చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని తిరిగినంత మాత్రాన రాజ్యాంగం అర్థమైనట్లు కాదని, దానిని చదవాలని, గౌరవించాలని రాహుల్‌కు హితవు పలికారు.

8:58 AM, 12 Oct 2026 (IST)

కన్నాట్​ప్లేస్​ నుంచి ర్యాలీ

కన్నాట్‌ప్లేస్‌ నుంచి సుప్రీంకోర్టు వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మధ్యాహ్నం 1.30 గంటలకు నుంచి ర్యాలీ నిర్వహించాలని పేర్కొంది.

8:56 AM, 12 Oct 2026 (IST)

కట్టుదిట్టమై భద్రతా

మార్చ్ నేపథ్యంలో దిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మండి హౌస్ సమీపంలోని బారాఖంబా రోడ్డు వద్ద భద్రతా సిబ్బందిని మోహరించారు. దిల్లీ పోలీసు సిబ్బందితో పాటు ఆర్ఏఎఫ్ (ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్), సీఆర్​పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) సిబ్బందిని కూడా మోహరించారు.

8:48 AM, 12 Oct 2026 (IST)

కీలక మెట్రో స్టేషన్లు మూసివేత

ఇండియా కూటమి మార్చ్ నేపథ్యంలో దిల్లీ మెట్రో కీలక ప్రకటన చేసింది. సాయంత్రం నాలుగు గంటలకు వరకు దిల్లీలోని ఆరు కీలక మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేస్తున్నట్లు దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. భద్రతా కారణాల దృష్ట్యా జన్‌పథ్, మండి హౌస్, బారాఖంబా రోడ్, సెంట్రల్ సెక్రటేరియట్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్ మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్‌ మూసివేస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ స్టేషన్లలో ఇంటర్‌చేంజ్‌ సదుపాయం మాత్రం ప్రయాణికులకు యథాతథంగా అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

Last Updated : October 12, 2026 at 7:14 PM IST