వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్ చరిత్రలోనే ఉంది : బీజేపీ
ఇండి కూటమి కుప్పకూలిపోతుంది- దానికి ఎటువంటి ఉమ్మడి సిద్ధాంతం, దార్శనికత లేదు- ప్రతిపక్ష కూటమి కేవలం రాజకీయ అనివార్యతలు, వ్యక్తిగత ఆశయాల కోసమే ఏర్పడింది- బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శలు

Published : May 6, 2026 at 5:12 PM IST
BJP ON TAMILNADU POLITICS : తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 సీట్లు అవసరమవడంతో టీవీకేకు మద్దతు తెలిపేందుకు పలు పార్టీలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో టీవీకేకు మద్దతు తెలుపుతున్నట్లు కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. మిత్రపక్షాలను వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్ చరిత్రలోనే ఉందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు. అదేసమయంలో ప్రతిపక్ష ఇండి కూటమిపై కూడా విరుచుకుపడ్డారు. త్వరలో ఆ కూటమి కుప్పకూలిపోతుందని, దానికి ఎటువంటి ఉమ్మడి సిద్ధాంతం, దార్శనికత లేదని ఆరోపించారు.
"ప్రతిపక్ష కూటమి కేవలం రాజకీయ అనివార్యతలు, వ్యక్తిగత ఆశయాల కోసమే ఏర్పడింది. ఇండి కూటమికి ఎప్పుడూ ఎటువంటి లక్ష్యం గానీ, దార్శనికత గానీ లేవు. కేవలం పదవీకాంక్ష, అవినీతి, కమీషన్లు, మోదీపై ద్వేషం అనే అంశాల ఆధారంగానే వారు ఒక్కటయ్యారు. కానీ త్వరలో అదంతా కుప్పకూలిపోతుంది."
-షెహజాద్ పూనావాలా, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి
'ఇండి కూటమి ముగిసిపోయినట్లే'
అదేవిధంగా, మే 4 వెలువడిన అసెంబ్లీ ఫలితాలను చూస్తే ఇండి కూటమి ముగిసిపోయినట్లే ఉందని షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మోసం చేయని వారు అంటూ ఎవరూ లేరని, డీఎంకేకే వారు ఇలా చేశారంటే, ఇక సమాజ్‌వాదీ పార్టీకి ఏం చేస్తారో ఒక్కసారి ఊహించండని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అలాగే, ఇండి కూటమికి ఇవే అంత్యక్రియలని అభివర్ణించారు. ఈ సందర్భంగా పూనావాలా ఒక వీడియో సందేశంలో ఇలా అన్నారు. "ఇప్పుడు విపక్ష కూటమి డీఎంకే, టీఎంసీ, వామపక్షాలు లేని ఇండి కూటమిగా మారిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ డీఎంకేని వదిలేసి టీఎంసీని పట్టుకుంది. చాలా రాష్ట్రాల్లో ఆ కూటమి జాడ కూడా లేదు. బంగాల్, కేరళ, గుజరాత్, పంజాబ్‌లో, దిల్లీ, హరియాణా, కర్ణాటకలో అసలు ఇండి కూటమి ఎక్కడ ఉంది?" ఉందో చెప్పండి అని ఆయన ప్రశ్నించారు.
టీవీకేకు కాంగ్రెస్ మద్దతు- వెన్నుపోటుగా అభివర్ణించిన డీఎంకే
మరోవైపు, టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించడాన్ని డీఎంకే తీవ్రంగా తప్పుపట్టింది. దీన్ని వెన్నుపోటు చర్యగా అభివర్ణించింది. ఈ సందర్భంగా డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. "కాంగ్రెస్ పార్టీ టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఆ పార్టీకి తమ మద్దతును ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని వెన్నుపోటు పొడవడమేనని నేను భావిస్తున్నా. వారు తమిళనాడు ప్రజలకు, వారి తీర్పునకు వెన్నుపోటు పొడిచారు. గెలుపు ధ్రువీకరణ పత్రంపై రిటర్నింగ్ అధికారి చేసిన సంతకం సిరా ఆరకముందే, పొత్తు దిశగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు" అని వ్యాఖ్యానించారు.
టీవీకేకు ఇంకా 10 మంది ఎమ్మెల్యేల అవసరం
ఇదిలా ఉండగా, 234 అసెంబ్లీ స్థానాలున్న తమినాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సరిగ్గా రెండేళ్ల రాజకీయ అనుభవం కూడా లేని ఆ పార్టీ 108 సీట్లను కైవసం చేసుకుంది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమయ్యింది. దీంతో ఇతర పార్టీల మద్దతు కోసం చర్చలు జరుగుతున్నట్లు టీవీకే వర్గాలు అంటున్నాయి.
మరోవైపు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాలను గెలుచుకుంది. బీజేపీ కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. సీపీఐ, సీపీఐఎం చెరో రెండు స్థానాలను గెలుచుకున్నాయి. ఇక డీఎంకే విషయానికొస్తే, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిని చవిచూడక తప్పలేదు. కేవలం 59 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. అలాగే, అన్నాడీఎంకే 47 స్థానాలను గెలుచుకుంది. మరోవైపు, పట్టాలి మక్కల్ కచ్చి నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. కాాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేయగా, బీజేపీ మాత్రం ఏఐఏడీఎంకేతో పొత్తు కుదుర్చుకుని బరిలోకి దిగింది.
గవర్నర్‌ను కలిసిన విజయ్- గురువారమే ప్రమాణ స్వీకారం!
ఒక్క ఓటుతో గెలుపు నుంచి 50 శాతానికిపైగా ఓట్లతో విజయాల దాకా- 2026 ఎన్నికల్లో TVK సంచలన గణాంకాలు

