ETV Bharat / bharat

'ఎకానమీపై మోదీ చేస్తున్న ప్రచారం 'లెట్స్, కెమెరా, ఇన్‌యాక్షన్' అన్నట్లుగా ఉంది'- ప్రధానిపై ఖర్గే ఫైర్

భారత ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే- దేశంలో నిరుద్యోగం 50 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరిందని ఆరోపణ- 40 శాతం యువ పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నారని విమర్శలు

Mallikarjun Kharge Slams PM Modi
మల్లికార్జున ఖర్గే ఫైల్ చిత్రం (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : September 1, 2026 at 3:52 PM IST

5 Min Read
Choose ETV Bharat

Mallikarjun Kharge Slams PM Modi : ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో దేశ జీడీపీ అంచనాలకు మించి 7.8శాతం వృద్ధి నమోదు చేయడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. జీడీపీ వృద్ధిని ప్రశంసిస్తూ ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేయడంపై దుయ్యబట్టారు. మోదీ ఆర్థిక వ్యవస్థపై చేస్తున్న ప్రచారం కేవలం 'లైట్స్, కెమెరా, ఇన్‌యాక్షన్' అన్నట్లుగా ఉందని విమర్శించారు. సామాన్య ప్రజలు నిరుద్యోగం, ధరల పెరుగుదల, అసమానతలను ఎదుర్కొంటూనే ఉన్నారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం 50 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరిందని, 40 శాతం యువ పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నారని అన్నారు. ఈ మేరకు ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

"దేశం జీడీపీ వృద్ధి సంబరాలు జరుపుకుంటోందని నరేంద్ర మోదీ చెబుతున్నారు. ఆ సౌకర్యం ఆయనకు ఉండొచ్చు. కానీ సామాన్యుడికి లేదు! సామాన్య ప్రజలు 3'U'ల భారంతో ఉన్నారు. దానికి మోదీయే బాధ్యులు!. ఆ 3'U'లు ఏంటంటే అనూహ్యమైన నిరుద్యోగం, భరించలేని ధరల పెరుగుదల, అదుపులేని అసమానత!. దేశంలో నిరుద్యోగం 50 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. 40 శాతం యువ పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నారు. 2026 జులై నాటికి 15- 29 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి ఆరుగురు యువ భారతీయులలో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ వాగ్దానం భగ్నమైంది. రిటైల్ ద్రవ్యోల్బణం 19 నెలల గరిష్ఠానికి చేరింది. చక్కెర, ఉల్లి, టమాటా, పప్పుధాన్యాలు, వంట నూనె, బియ్యం, పాలు, ఇలా ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ, సీఎన్‌జీ ధరలు సాధారణ ప్రజలకు అందుబాటులోకి లేకుండా పోతున్నాయి. మధ్యతరగతి కుటుంబాలు ఎలాగోలా బతకడానికి పోరాడుతున్నాయి. పేదలు ఆశ వదులుకున్నారు"
-- మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

అలాగే సంపద అసమానతలపై కూడా మోదీ ప్రభుత్వాన్ని మల్లికార్జున ఖర్గే ఎండగట్టారు. బ్రిటిష్ పాలన కంటే దారుణమైన అసమానత దేశంలో ప్రస్తుతం ఉందన్నారు. దేశ మొత్తం సంపదలో 40శాతం ఒక శాతం మంది చేతిలోనే ఉందని పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో పేదల నుంచి ధనికులకు సంపద బదిలీని మోదీ ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. విచ్చలవిడి ఆశ్రిత పెట్టుబడిదారీ విధానమే కేంద్ర సర్కార్ ఏకైక ఆర్థిక విధానమని ఎద్దేవా చేశారు.

'తన సన్నిహిత మిత్రుడికి ట్రావెట్ ఏజెంట్‌గా మోదీ'
"2014 నుంచి మోదీ ప్రభుత్వం రూ. 16 లక్షల కోట్లకు పైగా కార్పొరేట్ రుణాలను మాఫీ చేసింది. అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయమేమిటంటే రూ. 22,006 కోట్ల అంగీకరించిన క్లెయిమ్‌లకు గానూ రుణదాతలు కేవలం రూ. 6.5 కోట్లను మాత్రమే తిరిగి పొందగలిగారు. అంటే 99.97శాతం రుణాన్ని వదులుకోవాల్సి వచ్చింది. భారత ప్రధాని మోదీ తన సన్నిహిత మిత్రుడికి వ్యక్తిగత ట్రావెల్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని దేశం చూసింది!. భారతీయులు బంగారం కొనొద్దని, విదేశాలకు వెళ్లొద్దని మోదీ పదేపదే చేసే ఉపన్యాసాలు క్షేత్రస్థాయి వాస్తవాలను తెలియజేస్తున్నాయి. వాస్తవం ఏమిటంటే ప్రజలకు అబద్ధాలు చెప్పే మీ సామర్థ్యం తప్ప మరేమీ మారలేదు!" అని ఖర్గే పేర్కొన్నారు.

ఆ జీడీపీ వృద్ధి గణాంకాల గారడీయే : జైరాం రమేశ్
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీడీపీ గణాంకాలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వృద్ధిని 'గణాంకాల గారడీ'గా అభివర్ణించారు. 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం చాలా తక్కువ ఫలితాలను సాధించిందని, కానీ మోదీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'ఫేక్ ఇన్ ఇండియా' పథకం మాత్రం నిరాటంకంగా కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం దేశ దయనీయమైన ఆర్థిక వాస్తవికతను దాచిపెడుతూ జీడీపీ గణాంకాలను తారుమారు చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు జైరాం రమేశ్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

"నామమాత్రపు, వాస్తవ జీడీపీల మధ్య వ్యత్యాసం ద్రవ్యోల్బణాన్ని సూచిస్తుంది. అయితే ఆ తేడాను కేవలం 2.3శాతం మాత్రంగా ప్రభుత్వం చూపించింది. కానీ ఈ త్రైమాసికంలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 9 శాతానికి పైగా ఉంది. ఇది స్పష్టమైన వ్యత్యాసం. ఈ ఏడాది జీడీపీని లెక్కించే పద్ధతిని రెండుసార్లు సవరించిన మోదీ ప్రభుత్వమే ఈ వ్యత్యాసాన్ని సృష్టించింది. మోదీ ప్రభుత్వం నిజాయితీతో కూడిన గణాంకాలను ఇచ్చి ఉంటే వాస్తవ వృద్ధి రేటు చాలా తక్కువగా ఉండేది. ఈ విషయాన్ని మోదీ ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారుతో సహా చాలా మంది గతంలోనే చెప్పారు"
-- జైరాం రమేశ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

'ప్రజలకు మోదీ ప్రభుత్వం వారానికో షాక్ ఇస్తోంది'
పెరుగుతున్న ధరల రూపంలో దేశానికి మోదీ ప్రభుత్వం భారీ షాక్ ఇస్తోందని జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. అహంకారపూరిత మోదీ ప్రభుత్వం గణాంకాల గారడీ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే పనిలో నిమగ్నమై ఉందని విమర్శించారు. "మోదీ సర్కార్ ప్రతి వారం దేశానికి పెరుగుతున్న ధరల రూపంలో ఒక కొత్త, భారీ షాక్‌ను ఇస్తోంది. ద్రవ్యోల్బణం కేవలం వంటగదికే పరిమితం కాలేదు. ఇంటి నిర్మాణం నుంచి విద్యుత్ పరికరాల వరకు ప్రతి అంశంలోనూ పెరుగుతున్న ఖర్చుల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు" అని జైరాం రమేశ్ ధ్వజమెత్తారు.

"రాగి తీగ ధర కిలో రూ. 850 నుంచి రూ. 1,700కు, అల్యూమినియం ధర కిలోకు రూ. 350 నుంచి రూ. 650కు పెరిగింది. 1,000 చదరపు అడుగుల ఇంటికి వైరింగ్ ఖర్చు రూ. 50,000 నుంచి దాదాపు రూ. లక్షకు అంటే రెట్టింపు అయ్యింది. సోలార్ ప్యానెళ్ల ధరలు 10-15శాతం పెరిగాయి. ఎలక్ట్రిక్ ఐరన్ బాక్సుల వంటి గృహోపకరణాల ధరలు 20శాతం వరకు పెరిగాయి. అలాగే ఎల్‌ఈడీ, హాలోజన్ లైట్ల ధరలు కూడా సుమారు 20శాతం పెంపు జరిగింది. స్విచ్‌లు, సాకెట్లు, మెయిన్-లైన్ కేబుల్స్ నుంచి టైల్స్, వైరింగ్, కూలీ ఖర్చుల వరకు ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్రతి ఖర్చూ పెరుగుతూనే ఉంది. ద్రవ్యోల్బణం ప్రజల జేబులకు అన్ని వైపుల నుంచి గట్టి షాక్ ఇస్తోంది. అయినప్పటికీ అహంకారపూరిత మోదీ ప్రభుత్వం ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చి, గణాంకాల గారడీ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలోనే ఉంది" అని జైరాం రమేశ్ పేర్కొన్నారు.

ఖర్గే సభా వేదికను శుద్ధి చేయడం నేరమే- వెంటనే FIR నమోదు చేయాలి: రాహుల్‌ డిమాండ్

'నేపాల్​లో చిక్కుకున్న భారతీయుల కోసం NDRF బలగాలు మోహరించాలి'- కేంద్రానికి ఖర్గే లేఖ