ETV Bharat / bharat

'విద్యార్థులను ఉగ్రవాదులంటారా? వెంటనే రాజీనామా చేయాల్సిందే'- ధర్మేంద్ర ప్రధాన్‌పై ఖర్గే ఫైర్‌

నీట్‌ పేపర్ లీక్‌ నిరసనలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం- లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరోపణ- విద్యార్థుల గొంతును అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రంపై విమర్శలు

Kharge
Kharge (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : June 24, 2026 at 6:05 PM IST

3 Min Read
Choose ETV Bharat

Kharge On Dharmendra Pradhan : నీట్‌ (NEET-UG) పేపర్ లీక్​కు సంబంధించి విద్యార్థులు చేపట్టిన నిరసనలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్రచర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై, విద్యాశాఖ మంత్రిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన ప్రభుత్వం ఇప్పుడు ప్రశ్నించే వారిని ఉగ్రవాదులుగా ముద్ర వేస్తోందని ఆరోపించారు.

ఎక్స్‌లో స్పందించిన ఖర్గే, కేంద్ర ప్రభుత్వ హయాంలో అనేక పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని పేర్కొన్నారు. "90 పేపర్ లీక్‌లు జరిగాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింది. నీట్‌ పేపర్ లీక్‌ ఘటనతో 20 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎన్నో కుటుంబాలు తీవ్ర వేదనను అనుభవిస్తున్నాయి. అయినా విద్యాశాఖ మంత్రి తన పదవిని అంటిపెట్టుకుని ఉండటమే కాకుండా, విద్యార్థుల గొంతును ఉగ్రవాదుల గొంతుగా అభివర్ణిస్తున్నారు" అని ఖర్గే విమర్శించారు.

విద్యార్థుల విషయంలోనూ అదే ధోరణి: ఖర్గే
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా చిత్రీకరించడం బీజేపీ నేతలకు అలవాటైందని కూడా ఆయన ఆరోపించారు. గతంలో రైతుల ఉద్యమాల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులను ఆందోళన జీవులు, పరాన్న జీవులు అంటూ వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ఇప్పుడు విద్యార్థుల విషయంలోనూ అదే ధోరణి కొనసాగుతోందని అన్నారు. "విద్యార్థుల స్వరం దేశవ్యాప్తంగా మరింత బలంగా వినిపిస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే" అంటూ ఖర్గే డిమాండ్ చేశారు.

ఇదే అంశంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే కూడా మండిపడ్డారు. జంతర్‌మంతర్‌లో విద్యార్థులు నిర్వహిస్తున్న నిరసనల సందర్భంగా విద్యాశాఖ మంత్రి వారిని ఉగ్రవాదుల బీ-టీమ్​గా అభివర్ణించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను కూడా ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. "విద్యార్థుల ఆత్మహత్యలకు న్యాయం చేయాలని మేము డిమాండ్‌ చేస్తున్నాం. అలాంటి మమ్మల్ని ఉగ్రవాదుల బీ-టీమ్‌ అంటున్నారు. దేశ యువతను ఉగ్రవాదులుగా పిలిచే హక్కు ఎవరికీ లేదు. మేము ఉగ్రవాదులు కాదు. దేశభక్తి సర్టిఫికెట్లు మీలాంటి వారి నుంచి మాకు అవసరం లేదు" అని దీప్కే తీవ్రంగా స్పందించారు. మరో పోస్టులో ఆయన మరింత ఘాటుగా స్పందించారు. "మమ్మల్ని ఉగ్రవాదులంటున్నారు. కానీ విద్యార్థుల మరణాలకు బాధ్యత వహించాల్సింది ఎవరో దేశ ప్రజలకు తెలుసు" అని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జంతర్‌మంతర్ వద్ద తన రాజీనామా కోరుతూ జరుగుతున్న నిరసనలపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో తిరస్కరణకు గురైన కొన్ని శక్తులు మారువేషంలో వచ్చి వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. దేశాన్ని విభజించాలనుకునే వారి కోసం నినాదాలు చేస్తున్నవారే ఈ నిరసనల వెనుక ఉన్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం వివాదానికి కేంద్రబిందువయ్యాయి.

ఎంతటి అహంకారానికి నిదర్శనం?: కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ అంశంపై కేంద్ర మంత్రిని విమర్శించారు. "పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న అమాయక విద్యార్థులు దేశాన్ని విభజించాలనుకుంటున్నారా? వారి భవిష్యత్తును నాశనం చేస్తూ దేశాన్ని కాపాడుతున్నామని చెప్పడం ఎంతటి అహంకారానికి నిదర్శనం?" అంటూ ఎక్స్‌లో ప్రశ్నించారు.

కాగా, నీట్‌-యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్‌ ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ వివాదం మధ్యే జూన్‌ 21న నిర్వహించిన రీ-ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా, అలాగే విదేశాల్లోని 14 కేంద్రాల్లో పూర్తైంది. అయితే పరీక్షల నిర్వహణ, పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తుపై ఇంకా అనేక ప్రశ్నలు మిగిలే ఉన్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నీట్‌ పేపర్ లీక్‌ అంశం ఇప్పుడు కేవలం పరీక్షల పరిమితిని దాటి రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది.

జవాబుదారీతనం అనే పరీక్షలో బీజేపీ ఫెయిల్​- ప్రధాన్ కచ్చితంగా రాజీనామా చేయాల్సిందే: ఖర్గే

ఎస్​ఐఆర్​ సహా ఎన్నికల అక్రమాలపై త్వరలోనే CJIకు లేఖ రాస్తాం : మల్లికార్జున ఖర్గే