కేరళ ఓనం బంపర్ లాటరీ- ఫస్ట్ ప్రైజ్ రూ.30కోట్లకు పెంపు- టిక్కెట్ ధర ఎంతంటే?
కేరళ ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాటరీ ప్రారంభం- ఫస్ట్ ప్రైజ్ రూ.30 కోట్లు- మిగతా ప్రైజ్‌ల వివరాలు ఎలా ఉన్నాయంటే?

Published : July 8, 2026 at 10:59 PM IST
Kerala Onam Bumper Lottery : లాటరీలపై ఆసక్తి ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్. కేరళ రాష్ట్ర లాటరీ శాఖ ఈ ఏడాది ఓనం బంపర్ లాటరీని అధికారికంగా ప్రకటించింది. మొదటి బహుమతి కింద రూ.30 కోట్ల ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే టికెట్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదని స్పష్టం చేసింది.
దేశంలోనే హయ్యెస్ట్ ప్రైజ్ మనీ
గతంలో కేరళ ప్రభుత్వం మొదటి బహుమతి కింద రూ.25 కోట్లు ఇచ్చింది. తాజాగా దీనిని రూ.30 కోట్లకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర బహుమతుల విషయంలోనూ పలు మార్పులు చేసింది. గతంలో రూ.50 లక్షలుగా ఉన్న థర్డ్ ప్రైజ్‌ను రూ.25 లక్షలకు తగ్గించింది. టికెట్ ధర మాత్రం ఎప్పటిలానే రూ.500గా ఉంచింది. ఇందులో బేస్ ప్రైస్ రూ.357.14, దీనికి 40 శాతం జీఎస్టీ అదనం.
కేరళ లాటరీ డైరెక్టర్ అంజు కేఎస్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఓనం బంపర్ లాటరీ అధికార కార్యక్రమాన్ని జులై 17న ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రారంభిస్తారు. గుర్తింపు పొందిన ఏజెంట్లకు పంపిణీ చేయడం కోసం డిపార్ట్మెంట్ మొదటిగా 90 లక్షల టికెట్లను ప్రింట్ చేయాలని నిర్ణయించింది. డ్రా తేదీ దగ్గర పడేకొద్దీ మార్కెట్ డిమాండ్‌ను బట్టి మరిన్ని టికెట్లను ప్రింట్ చేసే అవకాశం ఉంది. ఈ టికెట్లను TA, TB, TC, TD, TE, TG, TH, TJ, TK, TL అనే 10 సిరీస్‌లలో విడుదల చేస్తాం. విజేతలకు పంపిణీ చేయడం కోసం మొత్తం రూ.125.54 కోట్ల భారీ బహుమతి పూల్‌ను కేటాయించారు. సెప్టెంబర్ 26న రాజధాని తిరువనంతపురంలో ఈ లాటరీ డ్రా తీస్తారు.
బహుమతుల వివరాలు
ఫస్ట్ ప్రైజ్ కింద రూ.30 కోట్లు ఇస్తారు. రెండో బహుమతి కింద 20 మందికి (ప్రతి సిరీస్ నుంచి ఇద్దరు విజేతలకు) తలో రూ.1 కోటి చొప్పున అందిస్తారు. మూడో బహుమతి కింద 20 మంది తలో రూ.25 లక్షలు, నాలుగో బహుమతి కింద 10 మందికి (ప్రతి సిరీస్‌కు ఒకరు) రూ.5 లక్షలు చొప్పున అందజేస్తారు. ఐదో బహుమతి కింద 10 మందికి రూ.2 లక్షలు చొప్పున, ఆరో బహుమతిగా 54వేల మందికి రూ.5000 చొప్పున, ఏడో బహుమతి కింద 81వేల మందికి రూ.2000 చొప్పున, ఎనిమిదో బహుమతి కింద 1,24,200 మందికి రూ.1000 చొప్పున, తొమ్మిదో బహుమతి కింద 2,75,400 మందికి రూ.500 చొప్పున అందిస్తారు. ఇవే కాకుండా, మిగిలిన సిరీస్‌ల్లో ఒకే అదృష్ట సంఖ్య కలిగిన తొమ్మిది మందికి కన్సోలేషన్ ప్రైజ్‌గా రూ.5 లక్షల చొప్పున ఇస్తారు.
నో ఆన్లైన్ టికెట్స్
అయితే ప్రజల్లో ఉన్న విపరీతమైన క్రేజ్ వల్ల ఆన్లైన్ మోసాలు జరగకూడదనే ఉద్దేశంతో దీనిని టికెట్లను ఆన్లైన్లో విక్రయించడాన్ని నిషేధించారు. ఒక వేళ ఆన్లైన్లో టికెట్ విక్రయాలు చేస్తే అది చట్టవిరుద్ధమని, శిక్షార్హమని పేర్కొన్నారు. కేవలం లైసెన్స్ పొందిన ఏజెట్లు, రిటైల్ విక్రేతల ద్వారా మాత్రమే ప్రింటెడ్ టికెట్లు కొనాలని స్పష్టం చేశారు. సోషల్ మీడియా, డిజిటల్ పేమెంట్ లింక్‌ల ద్వారా ఆన్లైన్ బుకింగ్ కోసం డబ్బులు పంపవద్దని హెచ్చరించారు. ఈ లాటరీ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని 'కారుణ్య బెనవలెంట్ ఫండ్' లాంటి కీలక ప్రజా సంక్షేమ, ప్రజారోగ్య పథకాలకు ఉపయోగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గతేడాది ఓనం బంపర్ లాటరీకి వచ్చిన అద్భుతమైన స్పందనను బట్టి, ఈ సీజన్లో కూడా ప్రజల నుంచి మరింత భారీ రెస్పాన్స్ వస్తుందని కేరళ లాటరీ శాఖ భావిస్తోంది.
కేవలం ఒక్క రూపాయి, కొబ్బరికాయతోనే పెళ్లి- వరకట్నం దురాచారానికి చెక్ పెట్టిన ఆదర్శ కుటుంబం

