ETV Bharat / bharat

కొవిడ్​లో సరదాగా పీతల పెంపకం- ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్న కేరళ యువకుడు

లాక్​డౌన్​లో వచ్చిన ఆలోచనతో ప్రీమియం బిజినెస్- అంతర్జాతీయ మార్కెట్లో హాట్​ కేకుల్లా అమ్ముడుపోతున్న పచ్చ పీతలు

Kerala Farmer Shibin Earns Lakhs Through Scientific Green Crab Farming
Kerala Farmer Shibin Earns Lakhs Through Scientific Green Crab Farming (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 16, 2026 at 9:56 PM IST

4 Min Read
Choose ETV Bharat

Kerala Green Crab Millionaire : చాలా మందికి కొవిడ్ లాక్​డౌన్ కాలం ఒక చేదు జ్ఞాపకం. కానీ కేరళలోని కాసరగోడ్​కు చెందిన ఒక యువకుడికి మాత్రం అది జీవితాన్ని మార్చేసిన ఒక మేలు మలుపు. కేవలం పండ్ల ప్లాస్టిక్​ డబ్బాల్లో, పది పీతలతో సరదాగా ప్రారంభించిన వ్యాపారం, నేడు అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని అతను ఊహించి ఉండడు. కానీ నేడు రోజుకు కేవలం 3 గంటల సమయం శ్రమిస్తూ, లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ కథనం చదివేయండి.

కేరళకు చెందిన షిబిన్ అనే యువకుడు సంప్రదాయ మత్స్యకార పద్ధతులను విడిచిపెట్టి, శాస్త్రీయ పద్ధతుల్లో 'పచ్చ బురద పీతలు' (గ్రీన్ మడ్ క్రాబ్​) పెంచుతున్నాడు. వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. అతను ఈ వ్యాపారం గురించి ఏం చెబుతున్నాడంటే?

"పీతల పెంపకం వల్ల మంచి లాభాలు వస్తాయి. కేవలం రూ.500కు కొనుగోలు చేసిన ఒక పీత పిల్ల, బాగా పెరిగిన తర్వాత రూ.2,000 నుంచి రూ.4,000 వరకు ధర పలుకుతుంది. ఈ పచ్చ బురద పీతలకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. రోజుకు కేవలం మూడు గంటలు కేటాయిస్తే, ఎవరైనా పీతల పెంపకాన్ని అద్భుతమైన ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు."
- షిబిన్​, కేరళకు చెందిన పీతల పెంపకందారు, వ్యాపారి

అలా మొదలైంది!
'నేను కొవిడ్-19 లాక్​డౌన్ సమయంలో ఈ పీతల పెంపకం ప్రారంభించాను. పండ్లు పెట్టే సాధారణ ప్లాస్టిక్ పెట్టెల్లో కేవలం 10 పీతలతో దీనిని ప్రారంభించాను. అయితే ఇవి పెరిగిన తర్వాత తమ శక్తివంతమైన కొండెలతో ఆ ప్లాస్టిక్ పెట్టెలను పగలగొట్టడం ప్రారంభించాయి. దీనితో వీటి పెంపకం పద్ధతులను కచ్చితంగా మార్చివేయాలని నిర్ణయించాను. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్​, హైదరాబాద్​ నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన మన్నికైన భారీ పెట్టెలను దిగుమతి చేసుకున్నాను. ప్రతి పెట్టె ధర రూ.400 నుంచి రూ.600 వరకు ఉంటుంది. ఒక పెట్టెలో ఒక పీత పిల్ల మాత్రమే ఉంచుతాను. పీతలు బాగా పెరగడానికి నీటిలో లవణీయత (ఉప్పుదనం) ఎక్కువగా ఉండాలి. అందుకే పీతలను వర్షాలు లేని కాలంలో పెంచడం మంచిది. ఎందుకంటే వర్షం పడి లవణీయత తగ్గి పీతలు చనిపోతాయి' అని షిబిన్ తెలిపారు. కాగా, అక్టోబర్​లో పీత పిల్లలను పెట్టెల్లో పెట్టి స్టాకింగ్ ప్రారంభిస్తే, జూన్ నాటికి హార్వెస్టింగ్​ పూర్తవుతుందని షిబిన్ చెప్పారు. అంటే అక్టోబర్​లో పీతలు పెంచడం ప్రారంభిస్తే, జూన్​ నాటికి అవి అమ్మకానికి సిద్ధమవుతాయన్నమాట.

ఇంటర్నేషనల్ మార్కెట్లో భారీ ధరలు
'ప్రారంభంలో నేను స్థానిక మత్స్యకారుల నుంచి పీత పిల్లలను సేకరించేవాడిని. కానీ ఇప్పుడు నేను మంగళూరు నుంచి కోజికోడ్ వరకు ఉన్న మత్స్యకారులు, ఏజెంట్ల నుంచి వీటిని సేకరిస్తున్నాను. అంతేకాదు పీతల మార్కెటింగ్​ను కూడా ఏజెంట్ల ద్వారానే చేస్తున్నాను. అయితే స్థానికంగా వీటి అమ్మకాలు తక్కువ. ప్రాంతీయ మార్కెట్లో ఈ పీతలు ఎక్కువగా ఫైవ్​-స్టార్​ హోటళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కానీ విదేశాల్లో వీటికి డిమాండ్ ఎక్కువ. అందువల్ల రోజుకు కేవలం 3 గంటలు కష్టపడితే, మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు' అని షిబిన్ పేర్కొన్నాడు.

సవాళ్లు ఉన్నాయ్​
'ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన పీత పిల్లల కొరత ఉంది. ఇక అందుబాటులో ఉన్న వాటి ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇవి నేడు పీతల పెంపకందారులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. పీతలు 'పెంకు' (కర్పరం) ఉన్న జీవులు. కనుక అవి నిర్ణీత వ్యవధిలో తమ పాత కవచాన్ని వదిలేస్తాయి. దీనిని మోల్టింగ్ అని అంటారు. ఈ సమయంలో వాటికి సరైన పోషకాహారం ఇస్తే, ప్రతి మోల్టింగ్​ చక్రంలోనూ వాటి పరిమాణం రెట్టింపు అవుతుంది. అందుకే నేను పెంటే పీతలకు చిన్న చేపలను ఆహారంగా పెడతాను' అని షిబిన్ చెప్పారు.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, సాధారణంగా ఒక తల్లి పీత ఒకేసారి 4 లక్షల గుడ్లు పెట్టినప్పటికీ, అందులో చాలా తక్కువ శాతం మాత్రమే బతికి బయటపడగలుగుతాయి. నీటి లవణీయత, పీహెచ్​ స్థాయిలు, నీటి, వాతావరణ ఉష్ణోగ్రతలు వాటి మనుగడను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

ఈ పీతల్లో ఎన్నో ఔషధ గుణాలు?
కాగా, ఈ పచ్చ బురద పీతలకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. అయితే దీనిపై తాను ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేయలేని షిబిన్ స్పష్టం చేశాడు. అయితే 2018లో కోజికోడ్​కు చెందిన ఓ ఆర్థోపెడిక్ వైద్యుడు పచ్చ బురద పీతలకు మంచి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పారు. ఓ ప్రమాదంలో కుడి మడమ ఎముకలు పూర్తిగా విరిగిపోయిన మధ్య వయస్సుగల వ్యక్తికి తాను శస్త్ర చికిత్స చేసినప్పటికీ నయం కాలేదని, కానీ రెండు నెలల తర్వాత అతనిని పరీక్షించినప్పుడు విరిగిన ఎముకలు పూర్తిగా కలిసిపోవడం చూసి ఆశ్చర్యపోయామని చెప్పారు. సదరు వ్యక్తి దగ్గర్లోని నదిలో దొరికే పచ్చ బురద పీతలను తింటూ ఉండేవాడని అందుకే అతని కాలు చాలా వేగంగా నయం అయ్యిందని తెలుసుకున్నానని చెప్పారు. దీనిపై అప్పట్లో మీడియా కథనాలు కూడా రావడం గమనార్హం. అందుకే చాలా మంది పీతలు తినడం వల్ల ఎముకలు గట్టిపడతాయని నమ్ముతారు.

నోట్​ : పైన చెప్పినది కేవలం ఒక వ్యక్తికి కలిగిన అనుభవం. అంతేగానీ దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. అలర్జీలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పీతలు తినాలని అనుకుంటే, కచ్చితంగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత వైద్యం- 'ఐదు రూపాయల డాక్టర్' కావాలనే లక్ష్యం!

కేరళలో షిగెల్లా కలకలం- నెలరోజుల్లో 70 కేసులు- ఎన్నికల కోడ్ వల్లే వ్యాప్తి పెరిగిందన్న మంత్రి!